Allu Arjun: ఈ పాత్రలు చూస్తే.. ‘ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాలి.. జారిన ప్రతి నోరూ మూసుకోవాలి’

అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌గా భావించే పాత్రలు.. పాటలివే..!

Updated : 25 Aug 2023 17:49 IST

గ్ర నిర్మాత తనయుడు, అగ్ర కథానాయకుడి మేనల్లుడిగా ఒక బరువు బాధ్యతలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అహర్నిశలు శ్రమించి సినీ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun). చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన పాఠాలను ఇక్కడే నేర్చుకున్నారు. సినిమా మాధ్యమంగా తన అభిమానులకు వినోదాన్ని అందించడం మాత్రమే కాకుండా మంచి సందేశాన్ని ఇస్తున్నారు. సినిమా, సినిమాకూ తనలోని నటుడికి సాన పట్టి సినీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చార్యానికి గురి చేస్తున్నారు. సినిమా పరాజయం అందుకున్నప్పుడు కుంగిపోకుండా మరింత శ్రమించి విమర్శలు చేసిన వారందరి నోళ్లను మూయించారు. వేలెత్తి నిందించిన వారందరికీ తన నటనతోనే సమాధానం చెప్పారు. అలా, ఇప్పటివరకూ ఆయన పోషించిన పాత్రల్లో ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఐదు పాత్రలు, కొన్ని పాటలు..!

పుష్పరాజ్‌..!

అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో ‘పుష్పరాజ్‌’ ఒకటి. సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలోని ఈ పాత్రలో బన్నీ నటనకు దేశం మొత్తం ఫిదా అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు జాతీయ అవార్డు వరించింది. ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడం కోసం ఆయన ఎంతగానో శ్రమించారు. రఫ్‌ లుక్‌లో కనిపించడం కోసం రోజూ కొన్ని గంటలపాటు కూర్చొని మొత్తం శరీరానికి మేకప్‌ వేయించుకునేవారు. చిత్తూరు మాండలికంలో మాట్లాడటం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. సరైన సౌకర్యాల్లేని అడవుల్లోకి వెళ్లి రేయింబవళ్లూ షూట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందా? అని అందరూ సందిగ్ధంలో ఉన్న వేళ.. ‘‘ఈ సినిమా తర్వాత కమర్షియల్‌ సినిమాలు చేసే దర్శకులందరూ వర్క్‌ విషయంలో సుకుమార్‌ దగ్గర క్లాస్‌లు తీసుకుంటారు’’ అని బలంగా చెప్పి ఆ దర్శకుడి ప్రతిభపై తన నమ్మకాన్ని గట్టిగా తెలియజేశారు.


గమ్మునుండవోయ్‌..!

అల్లు అర్జున్‌ (Allu Arjun) కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో కీలకమైనది ‘గోన గన్నారెడ్డి’. ‘రుద్రమదేవి’ సినిమాలో ఆయన పోషించిన ఈ పాత్రకు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ లభించింది. స్క్రీన్‌పై ఆయన కనిపించేది తక్కువ సమయమే అయినా.. సినిమాకే హైలైట్‌. ‘గమ్మునుండవోయ్‌’, ‘తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా’ అంటూ ఆయన చెప్పే సంభాషణలు మూవీ లవర్స్‌కు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ పాత్ర చేస్తానన్న వేరే హీరో చివరి నిమిషంలో తన మనసు మార్చుకోవడంతో విషయం తెలిసిన బన్నీ.. గుణశేఖర్‌ దగ్గరకు వెళ్లి, ‘రుద్రమదేవి లాంటి చరిత్రాత్మక కథలు తెలుగు వారికి తెలియాలి. ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నేను నటిస్తా’ అంటూ భరోసా ఇచ్చి.. సినిమా పట్ల తనకున్న అభిరుచిని చాటి చెప్పారు. చిన్న పాత్రే కదాని నిర్లక్ష్యం చేయకుండా నటన, సంభాషణలు, గుర్రపు స్వారీ, లుక్స్‌.. ఇలా అన్నింటిలో ప్రత్యేక శ్రద్ధ చూపించి శెభాష్‌ అనిపించుకున్నారు.


లవర్‌ మాత్రమే కాదు.. ఫైటర్‌ కూడా..!

‘ఇద్దరమ్మాయిలతో..’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘దువ్వాడ జగన్నాథమ్‌’ వంటి వరుస ప్రేమకథా చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ (Allu arjun) నటించిన సీరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (Naa Peru Surya Naa Illu India). వక్కంతం వంశీ తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ తొలిసారి సైనికుడిగా కనిపించారు. యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ను కంట్రోల్‌ చేసుకోలేని వ్యక్తిగా ఆయన నటించారు. ఈ సినిమా కోసం బన్నీ ఎంతగానో శ్రమించారు. లుక్స్‌ పరంగా అప్పట్లో ఏ హీరో చేయని సాహసం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇందులోని ‘లవర్‌ ఆల్సో ఫైటర్‌ ఆల్సో’ పాట కోసం బన్నీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. సినిమాపై ఆయనకు ఉన్న కమిట్‌మెంట్‌కు ఇదొక నిదర్శనంగా నిలుస్తుంది.


కేబుల్‌ రాజు..!

అల్లు అర్జున్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రాల్లో ‘వేదం’ (Vedam) ఒకటి. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ బస్తీ కుర్రాడిగా కేబుల్‌ రాజు పాత్రలో నటించి తెలుగువారి మనసు గెలుచుకున్నారు. ప్రేమలో గెలవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు చూసి మొదట సరదాగా అనిపించినా.. సినిమా చివరకు వచ్చేసరికి తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తారు. కమర్షియల్‌ సినిమాలు రాజ్యమేలుతోన్న తరుణంలో హీరో పాత్రకు సరైన ఎలివేషన్స్‌ లేకపోయినా, ఆ పాత్ర చివరకు చనిపోతుందని తెలిసినా.. కథ, దర్శకుడిని నమ్మి ‘వేదం’లో ఆయన నటించారు. అలాగే ఈ సినిమాలోని మరో కీలక పాత్రకు మనోజ్‌ అయితే సరిగ్గా నప్పుతారని దర్శకుడికి చెప్పిందీ బన్నీనే. కంటెంట్‌ విషయంలో ఆయనకు ఉన్న జడ్జిమెంట్‌కు ఇదొక ఉదాహరణ అనుకోవచ్చు.


వినోదమే కాదు.. విలువలూ..!

సినిమా మాధ్యమంగా కేవలం వినోదాన్ని మాత్రమే కాదు మంచి సందేశాలను ఇస్తుంటారు అల్లు అర్జున్‌. అందుకు నిదర్శనమే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రాలు. త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ రెండు సినిమాల్లో బన్నీ పాత్ర యువతలో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. ముఖ్యంగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో తండ్రి ఇచ్చిన మాట, ఆయన పేరు నిలబెట్టడం కోసం కోట్ల ఆస్తిని వదిలి కష్టాలు ఎదుర్కొని నిజాయతీతో ఉండే తనయుడిగా కనిపించారు. ‘అల.. వైకుంఠపురములో..’ కుటుంబాన్ని ఒక్కటి చేసే కుమారుడిగా నటించి మెప్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని