Mahesh Babu: రాజమౌళి మూవీలో మహేశ్‌ డ్యూయల్‌ రోల్‌.. నిజమేనా?

Mahesh babu-Rajamouli Movie: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోయే మూవీ గురించి రోజుకో న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

Published : 12 Mar 2024 17:52 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీని ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో రోజుకో వార్త సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్త మహేశ్‌ అభిమానులకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఒకే సినిమాలో రెండు వైవిధ్యమైన పాత్రలు పోషించిన మహేశ్‌ ఇప్పటివరకూ ద్విపాత్రాభినయం చేయలేదు. (కొడుకు దిద్దినకాపురం మినహా) మరోవైపు రాజమౌళి గత చిత్రాలైన ప్రభాస్‌ ‘బాహుబలి’, రవితేజ ‘విక్రమార్కుడు’ చిత్రాల్లో హీరోలతో డ్యూయల్‌ రోల్‌ చేయించి హిట్‌ కొట్టారు. దీంతో ఈ వార్త టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది. అయితే, కథ, స్క్రిప్ట్‌పరంగా అసలు అలాంటి చర్చే జరగలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయట. ఏదేమైనా సినిమా గురించి జక్కన్న అధికారికంగా ప్రకటించేవరకూ రోజుకో వార్త వైరల్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

కొనసాగుతున్న నటీనటుల వేట..

మరోవైపు సినిమాకు సంబంధించి కీలక పాత్రల్లో కనిపించే నటీనటుల కోసం వేట కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో తీయబోయే ఈ మూవీలో వివిధ భాషా నటులు నటించనున్నారు. ఈ క్రమంలో కథకు అనుగుణంగా సరిపోయే వారి కోసం చిత్రబృందం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఒకరిద్దరు ముఖ్య నటులకు స్క్రిప్ట్‌ కూడా వినిపించినట్లు టాక్‌.  దీనిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మూడు గెటప్పులకు ఓకే?

ఇక సినిమాలో మహేశ్‌ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆయన లుక్‌లకు సంబంధించి స్కెచ్‌లు పూర్తయ్యాయి కూడా. మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేయగా, అందులో మూడింటిని ఓకే చేశారని టాక్‌. కథకు, మహేశ్‌ ఆహార్యానికి సరిపోయేలా ఆ లుక్స్‌లో మహేశ్‌ను టెస్ట్‌ ఫొటో షూట్ చేయనున్నారు. ఇంకోవైపు మహేశ్‌ బ్రాండింగ్‌ చేయనున్న ప్రకటనలకు సంబంధించి షూటింగ్‌లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒక ఏసీల కంపెనీతో పాటు, శీతల పానీయానికి సంబంధించిన షూట్‌ పూర్తయింది. ఇటీవల వరుసగా మహేశ్‌ కొత్త స్టిల్స్‌ రావడం వెనక కారణం అదే. మిగిలిన యాడ్స్‌ను కూడా పూర్తి చేసి, రాజమౌళి సినిమాకు పూర్తిగా సన్నద్ధం కానున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆ తర్వాత కొంత సమయం ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌కు తీసుకుని జూన్‌ లేదా జులై నుంచి #SSMB29 రెగ్యులర్‌ షూటింగ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని