Manjummel Boys: ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా

మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ రికార్డు సృష్టించింది. అదేంటంటే?

Published : 19 Mar 2024 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వసూళ్ల పరంగా ఇప్పటికే పలు రికార్డు సృష్టించిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ (Manjummel Boys) తాజాగా మరో రికార్డు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా (గ్రాస్‌) వసూళ్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా (the highest grossing Malayalam film ever) నిలిచింది. అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన మలయాళ చిత్రాల జాబితాలో ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న ‘2018’ని వెనక్కి నెట్టింది. గతేడాది విడుదలైన ‘2018’ వసూళ్లు దాదాపు రూ.175 కోట్లు. ఇప్పుడీ చిత్రం రెండో స్థానంలో ఉండగా ‘పులిమురుగన్‌’ (మోహన్‌లాల్‌) మూడో స్థానంలో, ‘లూసిఫర్‌’ (మోహన్‌లాల్‌) నాలుగో స్థానంలో నిలిచాయి.

శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేసి, విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఊహించని విజయాన్ని అందుకుంది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల లిస్ట్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

మంజుమ్మెల్‌ బాయ్స్‌ కథేంటంటే: కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అవుతారు. కమల్‌హాసన్‌ ‘గుణ’ మూవీ అక్కడే తీశారని తెలియడంతో అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ ఓ గుహలోకి వెళ్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా పట్టించుకోరు. ఓ పాయింట్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడి రాళ్లపై ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ అని రాస్తారు. తర్వాత, వారిలోని ఓ సభ్యుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. సుభాష్‌ ఏదో సరదాకు అలా చేశాడని అందరూ తొలుత అనుకుంటారు. కానీ, ఎన్నిసార్లు పిలిచినా మాట రాకపోయేసరికి భయపడి బయటకు వచ్చేస్తారు. మరి, ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని