chiranjeevi: నానిని మెచ్చుకున్న మెగాస్టార్‌.. ట్వీట్‌ వైరల్‌

‘దసరా’ (dasara) చిత్రాన్ని వీక్షించారు మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi). ఈ సినిమా తనకెంతో నచ్చిందన్నారు.

Published : 13 Apr 2023 17:59 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) నటుడు నాని (Nani)ని మెచ్చుకున్నారు. ధరణిగా నాని అదరగొట్టేశాడని పేర్కొన్నారు. తాజాగా ‘దసరా’ (Dasara) చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్రబృందాన్ని అభినందిస్తూ గురువారం ఉదయం ట్వీట్‌ చేశారు.

‘‘డియర్‌ నాని.. కంగ్రాట్స్‌!! దసరా చూశాను. ఇదొక అద్భుతమైన చిత్రం!! ధరణి పాత్ర కోసం సిద్ధమైన తీరు.. నటనతో నువ్వు అదరగొట్టేశావు. ఇది శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రమని తెలిసి ఆశ్చర్యపోయాను. మన మహానటి కీర్తిసురేశ్‌ మరోసారి తన నటనతో మెప్పించింది. యువ నటుడు దీక్షిత్‌ శెట్టి పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. సంతోష్‌ నారాయణన్‌ తన సంగీతంతో అదరగొట్టేశాడు. ‘దసరా’ టీమ్‌ మొత్తానికి మరోసారి నా అభినందనలు’’ అని చిరు ట్వీట్‌ చేశారు.

చిరు ట్వీట్‌పై నాని స్పందిస్తూ.. ‘‘మీరెప్పటికీ మెగాస్టారే సర్‌. కేవలం నటుడిగా మాత్రమే కాదు.. సినిమా, అందులో భాగమైన ప్రతి ఒక్కరి కోసం నిలబడే మంచి మనసు కలిగినందుకు మీరు మెగాస్టార్‌’’ అని పేర్కొన్నారు. మరోవైపు చిరు ట్వీట్‌పై దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఆనందం వ్యక్తం చేశాడు. ‘దాయి దాయి దామ్మా’ (ఇంద్ర సినిమాలోని) పాటకు స్టెప్పులేస్తోన్న తన చిన్ననాటి ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘గాల్లో ఎగురుతున్నా.. థ్యాంక్యూ బాస్‌’’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రేమ, స్నేహం, పగ చుట్టూ తిరిగే కథాంశంతో ‘దసరా’ తెరకెక్కింది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. ధరణి పాత్రలో నాని.. వెన్నెలగా కీర్తిసురేశ్‌ నటించారు. మార్చి 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ అందుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని