Mukesh Rishi: ‘లగాన్‌’లో ఛాన్స్‌ వదులుకుని.. సౌత్‌లో టాప్‌ విలన్‌ అయ్యారు!

Mukesh Rishi: ప్రతి నాయకుడిగా తెలుగు, తమిళ చిత్రాల్లో మెప్పించిన నటుడు ముఖేష్‌ రిషి. ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘లగాన్‌’లో కీలక పాత్రను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఇటీవల ఆయన పంచుకున్నారు.

Updated : 07 Feb 2024 10:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డెస్టినీ ఎవరిని ఎటువైపు నడిపిస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ప్రతి శుక్రవారం ఫలితాలు మారిపోతుంటాయి. ఇండస్ట్రీ ఎప్పుడూ విజయాలనే గుర్తు పెట్టుకుంటుంది. కొన్నిసార్లు సక్సెస్‌తో పాటు లక్‌ కూడా కలిసి రావాలి. నటులు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలను, కెరీర్‌ను మార్చేస్తాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా తనకంటూ గుర్తింపుతెచ్చుకున్న ముఖేష్‌ రిషి (Mukesh Rishi) విషయంలోనూ ఇదే జరిగింది. 1999లో ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘సర్ఫరోష్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ముఖేష్‌ రిషి ఇన్‌స్పెక్టర్‌ సలీమ్‌ అహ్మద్‌ పాత్రలో నటించి మెప్పించారు. తర్వాత వరుస అవకాశాలు వస్తాయని రిషి భావించారు. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆయన కెరీర్‌ ఎలా మలుపు తిరిగిందో ఇటీవల పంచుకున్నారు.

‘‘సర్ఫరోష్‌’ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయనుకున్నా. కానీ, అలా జరగలేదు. అయినా నేను నిరాశపడలేదు. సినిమా షూటింగ్‌ల విషయంలో నేను కచ్చితమైన సమయాన్ని పాటిస్తా. అదే నన్ను సక్సెస్‌ వైపు నడిపించింది. నాకన్నా ముందు విలన్‌ పాత్రల్లో రాణించిన వాళ్లలో కొందరు సమయపాలన పాటించేవారు కాదని అందరూ అనేవారు. కానీ, నేను పెట్టుకున్న నియమాలు నాకు కలిసొచ్చాయి. దక్షిణాదిలో నేను క్లిక్‌ అవడానికి అవే కారణమయ్యాయి’’

ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘లగాన్‌’లోనూ దేవ్‌ పాత్రకు తొలుత ముఖేష్‌ను అనుకున్నారు. కానీ, ఆ పాత్రను ప్రదీప్‌సింగ్‌ రావత్‌ చేశారు. ‘‘లగాన్‌’ స్క్రిప్ట్‌ వినేందుకు నేను ఆమిర్‌ ఇంటికి వెళ్లాను. కథ విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. అయితే, చిత్రబృందం చిన్న షరతు విధించింది. రోజులు కాదు, నెలల పాటు డేట్స్‌ కేటాయించాలని కోరింది. దీంతో ఒక్కసారిగా భయపడ్డా. నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఆ తర్వాత ఆమిర్‌ను కలిశా. దక్షిణాదిలో నాకు వస్తున్న అవకాశాల గురించి ఆయనకు చెప్పా. నా పరిస్థితిని ఆమిర్‌ అర్థం చేసుకున్నారు. నన్ను ప్రోత్సహించారు. ‘లగాన్‌’ చేయనందుకు నేనేమీ బాధపడటం లేదు. ఆ సినిమా చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ప్రదీప్‌ రావత్‌ దేవ్‌ పాత్రను చాలా బాగా చేశారు’’ అని ముఖేష్‌ రిషి చెప్పుకొచ్చారు. 1994లో వచ్చిన బాలకృష్ణ ‘గాండీవం’తో తెలుగు తెరకు పరిచయమైనా ఆరేళ్ల పాటు మళ్లీ ఇక్కడ నటించలేదు. 2000లో జగపతిబాబు ‘మనోహరం’తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ‘నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘జల్సా’ ఇలా వరుస సినిమాల్లో నటించి మెప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని