ఈనాడు.నెట్‌ ప్రత్యేకం: వెన్నెల ‘కంటి వెలుగులు’

సినీ గీత రచయత వెన్నెలకంటి నాకు సినీ గీత రచయిత కాక ముందు నుంచీ పరిచయం. అదీ బాలు గారి పుణ్యమే.

Published : 11 Jan 2021 17:54 IST

వెన్నెలకంటితో తన అనుబంధాన్ని పంచుకున్న మ్యూజికాలజిస్ట్‌ రాజా

‘‘వెన్నెలకంటి నాకు సినీ గీత రచయిత కాక ముందు నుంచే పరిచయం. అదీ బాలు గారి పుణ్యమే. ఓ సారి నేను మద్రాసు వెళ్లినప్పుడు రూమ్ దొరక్క బాధపడుతూ బాలు గారికి ఫోన్ చేస్తే... ఓ హోటల్ పేరు చెప్పి ‘ఫలానా రూమ్‌లో వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ అని ఒకాయన ఉంటాడు.. మనవాడే.. నేను ఫోన్ చేస్తాను. అక్కడికి వెళ్లి ఫ్రెష్ అయి రండి. ఈ లోగా మరో రూమ్ చూద్దాం’ అన్నారాయన. అలాగే అని వెళ్లాను. ‘మాది నెల్లూరండీ ... సినిమాల్లో పాటలు రాయడానికి వచ్చాను’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు వెన్నెలకంటి. ఆ రోజు నుంచి మా స్నేహం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

సినీ రచయితగా ఆయన ఎదుగుదల ప్రతి మెట్టూ చూస్తూ, ఆనందించే ఆయన స్నేహ బృందంలో నేనూ ఉన్నందుకు కించిత్ గర్వంగా కూడా ఉంటుంది నాకు. వారబ్బాయిలు శశాంక్ వెన్నెలకంటి, రాకేందు మౌళి పెళ్లిళ్లకు ఇన్విటేషన్ పంపిస్తూ ‘రాకపోతే బాలూ గారు రానంత బాధ పడతాన్నేను’ అని అన్నారాయన. ఆ ప్రకారమే వెళ్లాన్నేను. అప్పుడు తీయించుకున్న ఫొటోలు ఇప్పటికీ ఇవ్వలేదు నాకు. పాటలకు సంబంధించిన సందేహాలొస్తే మొదట ఫోన్ చేసేది నాకే. సమాధానం లేటయితే... ‘అర్థం అయింది. నేను ఫొటోలు ఇవ్వలేదన్న కోపం పెట్టుకున్నారు మీరు’ అంటూ చమత్కరించేవారు. నేను మా టీవీలో పని చేసే రోజుల్లో వెన్నెలకంటి గారితో ఘంటసాల అవధానం చేయించాను. ఈ కాన్సెప్ట్ ‘ఆ సమకాలీనులకి’ అర్థం అయ్యింది. పరుచూరి గోపాలకృష్ణ, ఆర్పీ పట్నాయిక్, భాస్కరభట్ల రవికుమార్, హేమచంద్ర, మాళవిక పృచ్చకులు. చాలా బాగా వచ్చిందా ఎపిసోడ్. అలాగే నేను ఎడిటర్గా తీసుకొచ్చిన ‘హాసం’ పక్ష పత్రికలో ‘వెన్నెలకంటి వెలుగులు’ శీర్షికపై కొన్ని పద్యాలు రాశారాయన.

వెన్నెలకంటి సహృదయుడు, రస హృదయుడు. ఓ సారి నేనడిగిన ఓ బుక్ పంపిస్తూ నన్ను ‘గడ్డం లేని ఋషి’ అని సంబోధించారు. అదేంటలా అన్నారు? అని నేనడిగితే ‘పాటల కోసం మీరు చేస్తున్న కృషి తపస్సు లాంటిదే’ అని అభినందించారు. తనే ప్రయోగం చేసినా నాతో పంచుకుంటారు. ‘తేనెటీగ’ ‘కలలో తెర తీయాలా...’ అనే తమాషా ప్రయోగం చేశారాయన. ఇటువంటి ప్రయోగం అంతకుముందు ఎవ్వరూ చెయ్యలేదు. ఈ పాట పల్లవి లో ‘కలలో తెర తీయాలా...’ అని ఉంది కదా... ఆ ‘తీయాల’లో ‘తీయ’ అనే పదాన్ని తీసుకుని ‘తీయగ ఎద వేగాల’ అని ఆ తర్వాత ఉంటుంది. ఆ ‘వేగాల’తో ‘వేగాలలో వేడి’ అని ఆ తర్వాత ఉంటుంది. మొదటి లైన్ చివర ఉన్న ‘తీయాల’కి తర్వాత లైన్‌లో ఉన్న ‘తీయగ’లో ఉన్న ‘తీయ’ కి అర్థాలు వేరు. ఇలా పాట మొత్తం ఉంటుంది.

‘దీన్నేం అలంకారం అంటారో తెలియడం లేదు’ అని అన్నారు వెన్నెలకంటి ఆ పాటని వినిపించిన తర్వాత. రెండు రకాల అర్థాలతో ఒకే పదాన్ని వాడితే ‘యమకం’ అంటారు. (అచ్చెరువున - అచ్చెరువున - వేటూరి - సప్తపది - రేపల్లియ ఎద ఝల్లన / చుక్కానవ్వవే - నావకు చుక్కానవ్వవే - వేటూరి - సీతాకోక చిలుక -  మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా) మొదటి పాదంలో విడిచిన పదాన్ని రెండో పాదంలో స్వీకరించి కొనసాగించడాన్ని ‘ముక్తపదగ్రస్తం’ అంటారు. (గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది - దాశరథి (మూగ మనసులు)) ‘ఈ రెండు లక్షణాలూ ఈ పాటలో ఉన్నాయి కనుక ‘యమక ముక్తపదం’ అని అనొచ్చేమో’ అని అన్నాన్నేను. ‘బావుంది. అనుకోవచ్చు’ అని అన్నారాయన.

ఇక వెన్నెలకంటి రాసిన పాటల్లో ఎన్నో హిట్లు. అంజలీ అంజలీ పుష్పాంజలీ (డ్యూయెట్), అరెరే వానా జడివానా (ఆవారా), నీ ఎదలో నాకు చోటు వద్దూ (ఆవారా), చలి చంపుతున్న చమక్కులో (క్షణక్షణం), హృదయం ఎక్కడున్నదీ (గజినీ), కొండా కోనల్లో (స్వాతి కిరణం), కొంతకాలం కొంతకాలం (చంద్రముఖి), మాటరాని మౌనమిది (మహర్షి), ప్రణయమా నీ పేరేమిటి ప్రణయమా (అల్లరి ప్రియుడు), రాసలీల వేళ (ఆదిత్య 369), రాజశేఖరా ఆగలేనురా (ముగ్గురు మొనగాళ్ళు), రాయిని మాత్రం కంటే (దశావతారం), కమ్మనీ నీ ప్రేమ రాసింది హృదయమే (గుణ) సన్నజాజి పడకా (క్షత్రియ పుత్రుడు), బృందావనం సినిమాలోని పాటలు, మనసొక మధు కలశం (నీరాజనం), నా నవ్వే దీపావళి, నీ గూడు చెదిరింది (నాయకుడు)... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో!
‘భామనే సత్యభామనే’ సినిమాకి రాశాక వెన్నెలకంటి గారి మీద విపరీతమైన నమ్మకం ఏర్పడిపోయింది కమల్ హసన్‌కి. అప్పట్నుంచీ ఆయన సినిమాలకి వెన్నెలకంటి వర్క్ చెయ్యాల్సిందే. అంతే కాదు డబ్బింగ్ బాధ్యతలూ చూడాల్సిందే. ఇదిలా ఉండగా మరో రచయితతో ఓ పాటేదైనా రాయించాల్సి వస్తే పాట పూర్తయ్యాక ‘వెన్నెలకంటి గారికి ఓసారి చూపించండి’ అనేవారు కమల్ హాసన్. అంత నమ్మకం ఆయనకి వెన్నెలకంటి గారంటే. 

మరొక విషయం... ఎవ్వరికీ తెలియని విషయం. ‘దశావతారం’లోని బలరామ్ నాయర్ పక్కన ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆ పాత్రకు తమిళ వెర్షన్‌లో డబ్బింగ్ ఎవరు చెప్పాలి అనే సందేహం వచ్చింది. ‘వెన్నెలకంటి గారూ మీరే చెప్పేయండి’ అన్నారు కమల్. ‘అయ్యో నేనేంటండీ.. నా వాయిస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా?’ అని అన్నారు వెన్నెలకంటి. ‘లేదండీ.. మీరు బాగా చెప్తారు. మీ వాయిస్ సూట్ అవుతుంది’ అని అన్నారు కమల్. అయినా మనస్కరించలేదు వెన్నెలకంటి గారికి. అదీ.. ఇదీ చెప్పి వాయిదా వేస్తూ వచ్చారాయన. రిలీజ్ దగ్గర పడుతోంది. ఎవరి వాయిసూ సరిపోవటం లేదు. ‘ఒక్కసారి ప్రయత్నించొచ్చు కదా ?’ అన్నారు కమల్. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాత్రకి వెన్నెలకంటి గారే డబ్బింగ్ చెప్పారు. ఒక్కసారి ప్రొజెక్షన్ వేసుకుని చూసుకుంటే బ్రహ్మాండంగా సరిపోయింది. అప్పుడు వెన్నెలకంటి గారే ఆశ్చర్యపోయారు. కమల్ హసన్ నిశిత పరిశీలనకి.  

మరోసారి వారిద్దరి అబ్బాయిల పేర్ల మీద మా సంభాషణ మళ్లింది. పెద్దబ్బాయి పేరు శశాంక మౌళి. రెండో అబ్బాయి పేరు రాకేందు మౌళి. ఇద్దరూ సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. ‘శశాంక మౌళి అని ఉంది అనొచ్చు... కానీ రాకేందు మౌళి అని అనకూడదు కదా. అలా ఇప్పటివరకూ ఎవరూ అనలేదు కదా?’ అని అడిగాను. దానికాయన నొచ్చుకోలేదు. ‘నిజమే .. బాలేందు మౌళి అని ఉంటే అది కరెక్ట్‌గా ఉండేది. కానీ ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది’ అని జవాబిచ్చారు మనస్ఫూర్తిగా. ఇదీ ఏ భేషజం లేని వెన్నెలకంటి మనస్తత్వం, వ్యక్తిత్వం.

ఇద్దరం కనీసం నెలకొకసారి లేదా రెండు మూడు సార్లైనా ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. మా గురించి కొద్దిగా, బాలూ గారి గురించి పెద్దగా. బాలూ గారి షష్టిపూర్తి వేడుకల్లో ఆయనతో మేం అంతా ఫొటో తీయించుకుంటూ ఉంటే ‘మీరిద్దరూ పక్క పక్కన నిల్చోండి’ అని ఆజ్ఞాపించారు బాలు. అదీ మా ముగ్గురి మధ్య బంధం. మొన్నటికి మొన్న 2020 జూన్ 4న బాలు గారి బర్త్ డేకి నేనొక ప్రోగ్రామ్ చేస్తే ఆ వీడియోలో ఎక్కువసేపు మాట్లాడింది వెన్నెలకంటి గారే. అంతేకాదు దుర్గ అనే సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని నాకు పరిచయం చేసి ఆవిడతో బాలు గారి గురించి మంచి ఇన్ఫర్మేషన్ మాట్లాడించింది కూడా ఆయనే. ఇలా.. బాలు గారు, వెన్నెలకంటి గారు, నేను ఒకరికొకరంలా ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ కలసి ఎన్నో పంచుకున్నాం. ఇవాళ వాళ్లిద్దరూ ఒకటై ‘పోయేరు’ - ‘నువ్వు మాత్రం మా జ్ఞాపకాలతో బతుకుతూ చావరా’ అంటూ...’’

- రాజా (మ్యూజికాలజిస్ట్)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని