Naga Shaurya: ‘రంగబలి’.. పూర్తి నమ్మకంతో ఉన్నా: నాగశౌర్య

‘రంగబలి’ (Rangabali) ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు నటుడు నాగశౌర్య (Naga Shaurya). తమ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. 

Published : 05 Jul 2023 19:54 IST

హైదరాబాద్‌: ‘రంగబలి’ (Rangabali) వంటి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు నటుడు నాగశౌర్య (Naga Shaurya). నూతన దర్శకుడు పవన్‌ బాసంశెట్టి దీన్ని తెరకెక్కించారు. యుక్తి తరేజ కథానాయిక. జులై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని.. ‘రంగబలి’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘రంగబలి’పై నమ్మకం..!

‘రంగబలి’పై నేను మొదటి నుంచి పూర్తి నమ్మకంతో ఉన్నా. పవన్‌ నాకు ఏదైతే కథ చెప్పారో దాన్నే స్క్రీన్‌ పైకి తీసుకువచ్చారు. మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ కథను సిద్ధం చేశారు. సినిమా ఫైనల్‌ కాపీ చూశాక ఇది తప్పక విజయం అందుకుంటుందని గట్టి నమ్మకం వచ్చింది. అందుకే, ఇంత కాన్ఫిడెంట్‌గా ప్రమోట్‌ చేస్తున్నా. అలాగే, మా చిత్రానికి ఎవరి జీవితంతోనూ సంబంధం లేదు. సినిమా చూశాక.. దీనికి ఈ పేరు ఎందుకు పెట్టామో తప్పకుండా ప్రేక్షకులకు తెలుస్తుంది.

రిస్క్‌లు తప్పవు..!

ప్రేక్షకులను అలరించడానికే పరిశ్రమలోకి వచ్చా. ఇప్పుడున్న పోటీకి ప్రతి ఒక్కరూ డ్యాన్స్‌, యాక్షన్‌, నటన.. ఇలా అన్ని అత్యద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి, నేనూ ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు గాయాలవుతాయి. ఈ వృత్తిలో ఇవన్నీ భాగమే. కష్టపడితే తప్పకుండా విజయం వస్తుందని నేను నమ్ముతా.

సినిమా తప్ప మరొకటి తెలియదు..!

పది హిట్లు తర్వాత ఒక్క సినిమా ఫ్లాప్‌ అయినా దాన్ని రికవర్‌ చేయడం ఏ నిర్మాణ సంస్థకైనా అంత తేలికైన విషయం కాదు. సినిమా అంటే అమితమైన ఇష్టంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాం. డబ్బులు సంపాదించాలని కాదు. సినిమా తప్ప మాకు మరొకటి తెలియదు. 

యుక్తి మరోస్థాయికి వెళ్తుంది..!

యుక్తి తరేజా నటి మాత్రమే కాదు మంచి డ్యాన్సర్‌ కూడా. ఈ సినిమాలో ఆమె నటన చూడ చక్కగా ఉంటుంది. భవిష్యత్‌లో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌హీరోయిన్‌ అయ్యే అవకాశాలు ఆమెకు ఎక్కువగా ఉన్నాయి.

ఆ ఆలోచన లేదు..!

నటుడిగానే కాకుండా నిర్మాత, రచయితగానూ నేను వర్క్‌ చేశా. దీంతో దర్శకత్వం వైపు అడుగులు వేసే ఆలోచన ఏమైనా ఉందా? అని పలువురు అడుగుతున్నారు. అయితే, ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు. ఇటీవల నేను నా 24వ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించాను. ‘రంగబలి’ రిలీజ్‌ అయ్యాక కొత్త సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ మొదలుపెడతా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని