The Ghost Review: రివ్యూ: ది ఘోస్ట్‌

నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్‌’ సినిమా ఎలా ఉందంటే..?

Updated : 05 Oct 2022 15:50 IST

The Ghost Review చిత్రం: ది ఘోస్ట్‌; నటీనటులు: నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌, గుల్‌ పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌, రవి వర్మ, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, జయప్రకాశ్‌, తదితరులు; సినిమాటోగ్రఫీ: ముకేశ్‌; ఎడిటింగ్‌: ధర్మేంద్ర; నేపథ్య సంగీతం: మార్క్‌.కె.రాబిన్‌; పాటలు: భరత్‌-సౌరభ్‌; సంస్థ: శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌; నిర్మాతలు: సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్‌; రచన, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు, విడుదల తేదీ: 05-10-2022


ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన సినిమాల్లో కీల‌క‌మైనది ‘ది ఘోస్ట్‌’.  కొత్త ర‌క‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేయ‌డానికి ఇష్ట‌ప‌డే నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం...  ‘గ‌రుడ వేగ’తో యాక్ష‌న్ సినిమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌చార చిత్రాలు అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచాయి. నాగార్జున చేసిన ఈ స్టైలిష్ యాక్ష‌న్ చిత్రం ఎలా ఉంది?  (The Ghost Review) ఆయ‌న పోలిక‌కి త‌గ్గ‌ట్టుగా ‘శివ‌’ స్థాయిలో ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు ఇందులో ఉన్నాయా?

క‌థేంటంటే: విక్ర‌మ్ (నాగార్జున) ఇంట‌ర్‌పోల్ అధికారి.  ప్రియ (సోనాల్‌చౌహాన్‌)తో క‌లిసి దుబాయ్‌లో ప‌నిచేస్తుంటాడు. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉంటారు.  ఒక ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌నలో రౌడీ మూక చేతుల్లో చిన్న పిల్లాడు చ‌నిపోతాడు. అది విక్రమ్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది.  మాన‌సికంగా కుంగిపోతాడు.  ఆ త‌ర్వాత ప్రియ అత‌న్నుంచి దూరం అవుతుంది.  ఇంత‌లో ఉన్న‌ట్టుండి అను (గుల్‌ప‌నాగ్‌) నుంచి విక్ర‌మ్‌కి ఫోన్ వ‌స్తుంది. త‌న‌నీ, త‌న కూతురు అదితి (అనైకా సురేంద్ర‌న్‌)ని కాపాడ‌మని అను కోరుతుంది. దాంతో ఊటీకి బ‌య‌ల్దేరతాడు విక్ర‌మ్‌. ఆ క్ర‌మంలో అత‌నికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? (The Ghost Review) ఇంత‌కీ అను ఎవ‌రు? ఆమెకీ, విక్ర‌మ్‌కీ సంబంధ‌మేమిటి?  ఆమెకి ఎవ‌రి నుంచి ముప్పు పొంచి ఉంది?  మ‌రి ఆమె కుటుంబాన్ని విక్ర‌మ్ ఎలా కాపాడాడ‌నేది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే: స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. క‌థ కంటే కూడా యాక్ష‌న్ ఘ‌ట్టాలు డిజైన్ చేసుకోవ‌డంపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టిన‌ట్టుంది  చిత్ర‌బృందం.  దాంతో  అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాలు మెప్పిస్తాయి త‌ప్ప‌, క‌థతో మాత్రం ఎక్క‌డా లీనం కాలేం. ఎంచుకున్న  నేప‌థ్యం ఎలాంటిదైనా కావొచ్చు, సినిమా ఎంత స్టైలిష్‌గానైనా సాగొచ్చు కానీ, క‌థతో ప్రేక్ష‌కుల్ని క‌నెక్ట్ చేయ‌డం అన్నింటి కంటే ముఖ్యం. ఇందులో ఆ అవ‌కాశం ఉన్నా దాన్ని వృథా చేశాడు ద‌ర్శ‌కుడు.  క‌థానాయ‌కుడి  బాల్యంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, త‌ను పెరిగిన విధానం మొద‌లుకొని.. సోద‌రి బంధాన్ని బ‌లంగా ఆవిష్క‌రించేందుకు వీలుంది.  కానీ, ద‌ర్శ‌కుడు తెర‌పై త‌న మార్క్ ‘పోరాట ప‌టిమ‌’ని ప్ర‌ద‌ర్శించడంపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. దాంతో  ఎక్క‌డా భావోద్వేగాలు పండ‌లేదు.  (The Ghost Review)  స‌హ‌జీవ‌నం చేసి ఆ త‌ర్వాత ఐదేళ్ల‌పాటు దూర‌మైన నాయ‌కానాయిక‌ల జంట చుట్టూ కూడా భావోద్వేగాలకి చోటుంది. కానీ, ఆ విష‌యాన్ని కూడా పైపైనే తేల్చేశారు.  దుబాయ్‌లో  రెండు ఆప‌రేష‌న్ల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. పోరాటాలు, ఆ త‌ర్వాత ఓ పాట  ఇలా ఓ టెంప్లేట్ త‌ర‌హాలోనే ఆరంభ స‌న్నివేశాలు సాగుతాయి. క‌థ ఊటీకి చేరాకే సినిమా కాస్త ఆస‌క్తి మొదలవుతుంది. క‌థానాయ‌కుడి బాల్యంతోపాటు, అనుతో ఉన్న‌సంబంధం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో కాస్త ట్రాక్‌లో ప‌డిన‌ట్టే అనిపిస్తుంది. చెడు సావాసాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అదితిని దారిలోకి తీసుకొచ్చే స‌న్నివేశాలు కూడా ప‌ర్వాలేద‌నిపిస్తాయి. (The Ghost Review)  కానీ, ఆ త‌ర్వాతే మ‌ళ్లీ సినిమా గాడి త‌ప్పుతుంది. అక్క‌డ‌క్క‌డా మ‌లుపులున్నా సుదీర్ఘంగా, స‌హ‌జ‌త్వం లేకుండా  సాగే పోరాట ఘ‌ట్టాలు  ఏ ర‌కంగానూ మెప్పించ‌వు.  మాఫియా సామ్రాజ్యాన్ని, కార్పొరేట్ కుటుంబాల్లోని సంఘ‌ట‌న‌ల్ని  స్టైలిష్‌గా, స‌హ‌జంగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. పెద్ద గ‌న్‌తో హంగామా  ఈమ‌ధ్య కొన్ని సినిమాల్ని గుర్తు చేస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: నాగార్జున విక్ర‌మ్‌గా మెరిశాడు. ఆయ‌న స్టైలిష్‌గా క‌నిపించిన తీరు, పోరాట ఘ‌ట్టాలు  అభిమానుల్ని అల‌రిస్తాయి.   సోనాల్ చౌహాన్  అంద‌మైన ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా క‌నిపించింది. కథానాయ‌కుడితోపాటే క‌నిపిస్తూ  పోరాట ఘ‌ట్టాలతోనూ మెప్పించింది.  మ‌నీశ్ చౌద‌రి ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపిస్తారు.  గుల్‌ప‌నాగ్‌, అనైఖా సురేంద్ర‌న్ త‌ల్లీకూతుళ్లుగా పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. పెద్దింట్లో పెరిగి, క్ర‌మ‌శిక్ష‌ణ కొర‌వ‌డిన అమ్మాయిగా  అనైఖా చేసిన స‌న్నివేశాలు సినిమాకి కీల‌కం.(The Ghost Review)   జ‌య‌ప్ర‌కాశ్‌, ర‌విప్ర‌కాశ్‌, శ్రీకాంత్ అయ్యంగార్ మిన‌హా మిగిలిన‌వాళ్లు దాదాపుగా తెలుగు తెర‌కు కొత్తే. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖేష్ కెమెరా ప‌నిత‌నం, మార్క్ కె.రాబిన్ నేప‌థ్య సంగీతం సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. రొమాంటిక్ పాట, పార్టీ పాట చిత్ర‌ణ బాగుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.  ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు  ఎంచుకున్న నేప‌థ్యం బాగున్నా క‌థ‌, క‌థ‌నాల్ని మ‌లిచిన తీరు మెప్పించ‌దు.

బ‌లాలు 

+ నాగార్జున, సోనాల్ న‌ట‌న

పోరాట ఘ‌ట్టాలు, మ‌లుపులు

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌, క‌థ‌నం

- భావోద్వేగాలు పండ‌క‌పోవ‌డం

చివ‌రిగా:  ‘ది ఘోస్ట్‌’.. కొన్ని యాక్షన్‌ సీన్లకే పరిమితం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts