‘హీరోలతో కలిసి భోజనం.. కాలర్‌ పట్టుకుని లాగేశారు’: బీటౌన్‌ ప్రముఖ నటుడు

కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) తెలిపారు. 

Published : 06 Jun 2023 01:16 IST

ముంబయి: బీటౌన్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్నారు నవాజుద్దీన్‌ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఉన్నతస్థాయిలో ఉన్న ఆయన.. గతంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్టార్స్‌తో కలిసి భోజనానికి కూర్చొన్నందుకు కొంతమంది అందరి ముందు అవమానించినట్లు చెప్పారు.

‘‘మొదట్లో నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. సెట్‌లో నన్ను ఎవరూ పట్టించుకునేవారు కాదు. స్పాట్‌బాయ్‌ని మంచినీళ్లు అడిగినా.. ఇచ్చేవాడు కాదు. మరోవైపు, సినిమా సెట్‌లో అందరూ కలిసి భోజనాలు చేయడానికి వీలు ఉండేది కాదు. స్టార్స్‌, నటీనటులు, జూనియర్‌ ఆర్టిస్టులకు వేర్వేరుగా  భోజనాలు పెట్టేవారు. ఓసారి స్టార్స్‌తో కలిసి భోజనం చేయాలనిపించింది. అలా, ఓ సందర్భంలో వాళ్లతో కలిసి భోజనానికి కూర్చోగా..  కొంతమంది సిబ్బంది నా కాలర్‌ పట్టుకుని బయటకు తీసుకువచ్చేశారు’’ అంటూ నాడు తనకు జరిగిన అవమానాన్ని నవాజుద్దీన్‌ గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారడంతో సినీ ప్రియులు మరోసారి బీటౌన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటీనటులను ఒకేలా చూడటం బీటౌన్‌ వాళ్లు తెలుసుకోవాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక, నవాజుద్దీన్‌ త్వరలో తెలుగుతెరపై సందడి చేయనున్నారు. వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా నటిస్తోన్న ‘సైంధవ్‌’లో నవాజ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. శైలేశ్‌ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని