Urvashi Rautela: రిషభ్‌ పంతా? పీలేనా?.. ఊర్వశీ రౌతేలా ట్వీట్‌ ఎవరినుద్దేశించో!

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే నటుల్లో ఊర్వశీ రౌతేలా ఒకరు. ఆమె చేసిన ఓ ట్వీట్‌ అందరినీ సందేహంలో పడేసింది.

Published : 31 Dec 2022 01:48 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) పెట్టిన ఓ ట్వీట్‌ నెటిజన్లను తికమకలో పడేసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి పోస్ట్‌ అలా పెట్టిందోనన్న చర్చ సాగుతోంది. ‘మీరు, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్న ఊర్వశి ఎవరి ఖాతాను ట్యాగ్‌ చేయకపోవడం, ఎలాంటి హ్యాష్‌ట్యాగ్‌ జతచేయకపోవడం సందేహానికి తావిచ్చింది. దాంతో, నెటిజన్లు ఎవరికి తోచినట్టు వారు కామెంట్‌ చేస్తున్నారు. మీమ్స్‌ జతచేస్తున్నారు.

టీమిండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇటీవల తమ మధ్య పరోక్షంగా (సోషల్‌ మీడియాలో) మాటల యుద్ధం జరిగినా రిషభ్‌ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఊర్వశి ట్వీట్‌ చేశారని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ (Heeraben Modi) మరణం పట్ల ఊర్వశి సానుభూతి తెలిపేందుకు ట్వీట్‌ చేశారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫుట్‌బాల్‌ దిగ్గజ క్రీడాకారుడు పీలే (Jordan Peele) మృతి పట్ల సంతాపం తెలిపారంటూ ఇంకొందరు ఊహించుకుంటున్నారు. ట్వీట్‌ చేసిన కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రార్థిస్తున్నా’ అని క్యాప్షన్‌ పెట్టిన ఊర్వశి వైట్‌ కలర్‌ లవ్‌ సింబల్‌, పావురం ఎమోజీలను జతచేశారు. ఆ పోస్ట్‌పైనా నెట్టింట చర్చ సాగింది.

‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’ అనే హిందీ సినిమాతో నటిగా మారిన ఊర్వశి ప్రత్యేక గీతాలతో అన్ని చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘వాల్తేరు వీరయ్య’తో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చిరు సరసన ఆమె నటించిన స్పెషల్‌ సాంగ్‌ ‘బాస్‌ పార్టీ’ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా 2023 జనవరి 13న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని