Pullela Gopichand: అప్పుడా పరీక్షలో ఫెయిల్‌ అయ్యా.. బ్యాడ్మింటన్‌ ఆటగాడిగా మారా: పుల్లెల గోపీచంద్

తాను ఓ ప్రవేశ పరీక్ష ఫెయిల్‌ అయ్యానని, అలా జరగడం వల్లే బ్యాడ్మింటన్‌లో రాణించగలిగినట్టు  బ్యాడ్మింటన్‌ దిగ్గజం పుల్లెల గోపీచంద్‌ తెలిపారు.

Published : 04 Mar 2023 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం విత్‌ స్మిత’ (Nijam With Smita) కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ (Pullela Gopichand), నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu) సందడి చేశారు. తాము కలిసి చేసిన ప్రయాణాన్ని ఆ వేదికపై నెమరువేసుకున్నారు. వాటిల్లోని కొన్ని విశేషాలు వారి మాటల్లోనే..

నాలుగు సర్జరీలు అయ్యాయి: పుల్లెల గోపీచంద్‌

‘‘1985లో బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా మలుచుకోవచ్చనే ఆలోచన ఎవరికీ లేదు. చదువుకు ప్రాధాన్యతనిస్తూనే ఒకానొక సమయంలో నేనూ అన్నయ్య ఆడడం ప్రారంభించాం. మా అన్నయ్య చదువులో టాపర్‌. నేనూ అందరిలానే.. ఇంజినీరింగ్‌ లేదంటే మెడిసన్‌ చదవాలనుకున్నా. కానీ, అదృష్టవశాత్తు సంబంధిత ప్రవేశ పరీక్షలో తప్పాను. ‘నీకు ఇంకో సంవత్సరం సమయం ఉంది. బాగా ఆడితే బ్యాడ్మింటన్‌ కొనసాగించేందుకు అంగీకరిస్తాం. లేకపోతే ఏదో ఒక కాలేజీలో చేర్పిస్తాం’ అని కుటుంబ సభ్యులు అన్నారు. ఆ తర్వాత ఓ కాంపిటీషన్‌లో గెలిచా. మరోవైపు, నాకు ఉద్యోగం రావాలని అమ్మ పలు సంస్థలకు అప్లికేషన్లు పంపిస్తుండేది. అలా టాటా స్టీల్‌ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. దాంతో, బ్మాడ్మింటన్‌ కెరీర్‌లా మారింది. ఇప్పటి వరకు నా కాలికి నాలుగు సర్జరీలు అయ్యాయి. ఒక్కోసారి ప్రాక్టీస్‌కు టైం సరిపోకపోతే కళ్లు మూసుకుని ఆటను ఊహించుకునేవాణ్ని. ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ షటిల్స్‌ మన దగ్గర ఉండేవి కావు. అందుకే విదేశాలకు మ్యాచ్‌లకు వెళ్లినప్పుడు అక్కడ వాడేసిన వాటిని బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకొచ్చి, ప్రాక్టీస్‌ చేసేవాణ్ని. ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ రిప్రజెంటేటర్‌ (బ్యాడ్మింటన్‌)గా వ్యవహరించిన తొలి మహిళగా లక్ష్మి (భార్య) నిలిచింది’’

‘‘క్రీడాకారుల జీవితం చిన్న పక్షిలాంటిది. మనం గట్టిగా పట్టుకుంటే అది చచ్చిపోతుంది. అలా కాకుండా  వదిలేస్తే అది ఎక్కడికైనా ఎగిరిపోతుంది. ఇక్కడ వాటిని జాగ్రత్తగా పట్టుకోవడమే నీ ఉద్యోగం. అలా అయినప్పుడే అవి ఇబ్బందిపడకుండా, ఎక్కడికి ఎగిరిపోకుండా ఉంటాయి. వయోబేధం వల్ల సుధీర్‌, నేను ఒకే బ్యాచ్‌లో కలిసి ఆడలేకపోయాం. తనో జట్టులో ఉంటే నేనో జట్టులో ఉండేవాణ్ని. అప్పట్లో నా దగ్గర బైక్‌ లేదు. సుధీర్‌ తన బైక్‌పైనే నన్ను తిప్పేవాడు’’ అని గోపీచంద్‌ నాటి సంగతులు వివరించారు.

అందుకు పేరు మార్చుకునేవాణ్ని: సుధీర్‌బాబు

‘‘నా పూర్తి పేరు పోసాని నాగ సుధీర్‌బాబు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా బ్మాడ్మింటన్‌ టోర్నమెంట్‌ల్లో పాల్గొనేందుకు ఆ పేరును మారుస్తూ ఉండేవాణ్ని. బెంగళూరులోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో గోపీచంద్‌, నేను తొలిసారి కలుసుకున్నాం. ఆ సమయంలో అక్కడికి వెళ్లినవారిలో తెలుగువాళ్లం మేమిద్దరమే. ఎక్కడికి వెళ్లాలన్నా కలిసి వెళ్లేవాళ్లం. దాంతో మా మధ్య స్నేహం ఏర్పడింది. క్రీడాకారుడిగా, కోచ్‌గా రెండింటిలోనూ విజయం అందుకునేవారు అరుదుగా ఉంటారు. వారిలో గోపీచంద్‌ ఒకరు’’ అని సుధీర్‌బాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని