Shree Karthick: అల్లు అర్జున్‌ కోసం ఐదేళ్లయినా వేచి చూస్తా: శ్రీ కార్తిక్‌

‘ఒకే ఒక జీవితం’ చిత్ర దర్శకుడు శ్రీ కార్తిక్‌ ఇంటర్వ్యూ. ఆయన చెప్పిన విశేషాలివీ..

Published : 14 Sep 2022 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు దర్శకులు కమర్షియల్‌ హంగులను పక్కనపెట్టి, మనసును హత్తుకునే కథను తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుంటారు. ఆ జాబితాలో నిలిచేవారిలో శ్రీ కార్తిక్‌ (Shree Karthick) ఒకరు. శర్వానంద్‌ (Sharwanand) హీరోగా ఆయన తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో శ్రీ కార్తిక్‌ విలేకరుల సమావేశంలో పాల్గొని, తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్‌ అంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని, ఆయనతో సినిమా చేయాలనుందని తెలిపారు. శ్రీ కార్తిక్‌ చెప్పిన సంగతులివీ..

అమ్మే కారణం..

‘ఒకే ఒక జీవితం’ కథ పూర్తవడానికి రెండేళ్ల సమయం పట్టింది. దానికి న్యాయం చేసే నటుడు ఎవరా? అని ఆలోచించి, ఎంపిక చేసేందుకు మరో ఏడాదిన్నర గడిచింది. ఆ తర్వాత కొవిడ్‌ కారణంగా రెండు సంవత్సరాలు ఆలస్యమైంది. అలా ఇన్నాళ్లకు నా తొలి సినిమా మీ అందరి ముందుకొచ్చింది. నా నిరీక్షణకి తగ్గ ఫలితం దక్కింది. ఎంతో ఆనందంగా ఉంది. దీనంతంటికీ కారణం మా అమ్మ. తాను అనారోగ్యానికి గురై, మంచానికే పరిమితమైనప్పుడు నేను తీసిన ఓ లఘు చిత్రాన్ని చూపించాలనున్నా. నా ఆశ నెరవేరక ముందే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. నేను ఫిల్మ్‌ మేకర్‌ అవుతానని, అయ్యాననే విషయం తనకు తెలియదు. ఆ విషయంలో చాలా బాధ పడ్డా. అందుకే కాలం వెనక్కి వెళ్తే బాగుండు అనుకునేవాడిని. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘ఒకే ఒక జీవితం’.

అందుకే సైన్స్‌+ ఎమోషన్‌

నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తే ఈ సినిమాకు ప్లస్‌ అయింది. ఒకవేళ ఈ చిత్రంలో సైన్స్‌ అంశాలను ముడిపెట్టకపోతే మెలోడ్రామాగా సాగేది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించాలనే ఉద్దేశంతోనే ఎమోషన్‌, సైన్స్‌ను మిక్స్‌ చేశా. ప్రేక్షకుల నుంచి ఊహించిన స్పందన లభించింది. భవిష్యత్తులో మరిన్ని సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలు వస్తాయని అనుకుంటున్నా. ఈ జానర్‌ కథలను తెరకెక్కించటంలో ట్రెండ్‌ సెటర్‌గా నిలిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారికి ఈ చిత్రాన్ని చూపించి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలనుంది.

అదే పెద్ద విజయం

దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టు తెరపైకి రావాలంటే నటులు, సాంకేతిక నిపుణుల సమృష్టి కృషి ఉండాలి. ‘ఒకే ఒక జీవితం’తో నాకు మంచి టీమ్‌ లభించింది.  శర్వానంద్‌లాంటి హీరో ఈ సినిమాలో నటించడమే పెద్ద విజయం. తనకీ నాకూ ఈ చిత్రం ఎమోషనల్‌ రైడ్‌లాంటిది. శర్వాకు ఈ సినిమా మంచి విజయం అందిస్తుందనే నా నమ్మకం నిజమైనందుకు సంతోషిస్తున్నా. అమ్మ పాత్ర కోసం అక్కినేని అమలగారినే తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నా. ఆమెకు కథ బాగా నచ్చటంతో నటించేందుకు ఓకే చెప్పారు.

ప్రశంసలు..

సినిమా చూసిన తర్వాత ‘ఇకపై నిన్ను నా కొడుకులాచూస్తా’ అని నాగార్జునగారు శర్వానంద్‌తో అన్నారు. అదే నాకూ దక్కిన గొప్ప ప్రశంసగా భావిస్తా. నాగార్జునేకాదు అఖిల్‌ కూడా సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారు. దాన్నుంచి తేరుకోలేకపోవడం వల్లే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రాలేకపోయారు. మారుతితోపాటు మరికొందరు దర్శకులు ‘ఒకే ఒక జీవితం’ గురించి గొప్పగా మాట్లాడటాన్ని మర్చిపోలేను.

డ్యాన్సర్‌ నుంచి డైరెక్టర్‌గా..

నేను ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. దాని తర్వాత డ్యాన్స్‌ స్కూల్‌ ప్రారంభించటమో, న్యూయార్క్‌ వెళ్లి డ్యాన్స్‌లో మాస్టర్స్‌ చేయటమో.. వీటిల్లో ఏదో ఒకటి చేయాలనుకున్నా. ఆ సందిగ్ధం వీడక ముందే డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొన్నా. దానికి రాధిక, గౌతమిగారు న్యాయ నిర్ణేతలు. నా డ్యాన్స్‌, హావభావాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. దాంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. ‘మనమూ నటుడుగా మారొచ్చు’ అని అనుకున్నా. నటుణ్ని కావాలని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ‘ఎవరో రాస్తే, తీస్తే నేను నటించటం ఏంటి?..  నేనే రాయాలి, నేనే తీయాలి’ అని ఫిక్స్‌ అయ్యా. అలా.. షార్ట్ ఫిల్మ్స్‌, యాడ్ ఫిల్మ్స్‌ చేశా. ఇలా మీ ముందుకు వచ్చా.

అల్లు అర్జున్‌తో చిత్రం..

నా తదుపరి చిత్రం తెలుగులోనే తెరకెక్కిస్తా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఆ సినిమా కోసం మంచి నిర్మాణ సంస్థను అన్వేషిస్తున్నా. నాతో సహా మా కుటుంబమంతా అల్లు అర్జున్‌ను ఇష్టపడుతుంది. ఆయనతో సినిమా చేయాలనుంది. దాని కోసం ఐదేళ్లు ఎదురుచూడాలన్నా నాకు ఓకే.

వ్యక్తిగతం..

నాన్న రియల్ ఎస్టేట్‌ వ్యాపారి. అమ్మ బి.ఎస్.ఎన్.ఎల్ ఆఫీసర్‌గా చేశారు. అమ్మే మా కుటుంబాన్ని చూసుకుంది. అమ్మ మాతృభాష తెలుగు. నాకు నచ్చిన నగరాల్లో హైదరాబాద్ ముందుంటుంది. మనం నిజాయతీగా పనిచేస్తే ఈ విశ్వం మనకు తోడవుతుందనే విషయాన్ని నేను బాగా నమ్ముతా.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts