Oscars 2024: ఆస్కార్స్‌ నామినీలకు రూ.1.4 కోట్ల బంపర్ ఆఫర్‌

Oscars 2024: ఆస్కార్‌ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమైంది. అవార్డులు గెలిచిన వాళ్లు ఎలాగూ వాటిని తీసుకెళ్తారు. అయితే, ఆ అవార్డుతో సంబంధం లేకుండా నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో 20మందికి లక్కీ ఛాన్స్‌ కొట్టేసే అవకాశాన్ని ఓ సంస్థ కల్పిస్తోంది.

Published : 11 Mar 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్కార్‌ అవార్డ్స్‌-2024కు (Oscars 2024) సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగే ఈ వేడుక కోసం యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఉన్న 20మంది సభ్యులు అత్యంత విలువైన గిఫ్ట్‌ ప్యాక్‌ను సొంతం చేసుకోనున్నారు. ఏటా ఏదో ఒక వైవిధ్యమైన బహుమతితో ఇంటికి వెళ్లే నామినీలు ఈసారి మాత్రం బంపర్‌ ఆఫర్‌ కొట్టేయనున్నారు. లాస్‌ ఏంజిల్స్‌కు చెందిన మార్కెట్‌ కంపెనీ ‘డిసెంటివ్‌ అసెట్స్‌’ గత 22 సంవత్సరాలుగా ఆస్కార్‌ నామినీలకు గిఫ్ట్‌లను అందిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా బహుమతులను అందించడానికి సిద్ధమైంది.

కానీ, ఇప్పుడు ఇవ్వబోయే ఒక్కో గిఫ్ట్‌ బ్యాగ్‌ విలువ రూ.1.4 కోట్లు. అవును మీరు చదివింది నిజమే! సుమారు 50 బహుమతులు కలిగిన ఈ గిఫ్ట్‌ బ్యాగ్‌లో రూ.1200 విలువ చేసే రూబిక్‌ క్యూబ్‌ దగ్గరి నుంచి అత్యంత ఖరీదైన స్కీ చాలెట్‌లో (స్విట్జర్లాండ్‌లో ప్రకృతి అందాల మధ్య సకల సదుపాయాలు కలిగి ఉన్న  వసతి సముదాయం) మూడు రాత్రులు ఉండే అవకాశాన్ని కల్పించనున్నారు. అంతేకాదు, ఈ బ్యాగ్‌ను సొంతం చేసుకున్న వ్యక్తులు తమతో పాటు, మరో 9 మంది అతిథులను కూడా అక్కడికి తీసుకెళ్లవచ్చు.

  • ఈ గిఫ్ట్‌ బ్యాగ్‌లో అత్యంత ఖరీదైనది ‘స్కీ చాలెట్‌’ స్టే. స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్‌ పీక్‌ వద్ద ఉన్న అత్యంత విలాసవంతమైన హోటల్‌ ఇది. మూడు రాత్రులు ఉన్నందుకు చెల్లించే రూ.41లక్షల ప్యాకేజీ ఉచితంగా లభించనుంది.
  • దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డెన్‌ డోర్‌ స్పాలో ఏడు రోజులు గడిపే అవకాశం కల్పిస్తారు. దీని విలువ రూ.19లక్షలు. ఇక్కడ మసాజ్‌, ఫామ్‌ టేబుల్‌ మీల్స్‌, ధ్యానం, ఆరోగ్య సంరక్షణకు అదనపు తరగతులకు కూడా హాజరుకావచ్చు.
  • కెనడాలో చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఖరీదైన ఎల్బోక్‌ (హ్యాండ్‌ బ్యాగ్‌). దీని విలువ రూ.27వేలు.
  • రూ.లక్ష విలువైన పోర్టబుల్‌ ష్వాంక్‌ గ్రిల్‌.
  • చర్మ సౌందర్యాన్ని పెంచి, వృద్ధాప్య ఛాయలను తగ్గించే మైక్రో నీడిలింగ్‌ చికిత్స (రూ.8.2లక్షలు) ఇందులో భాగమే. అమెరికాలోని మసాచూసెట్స్‌లో ఉన్న ‘సైనోష్యూర్‌’లో దీన్ని పొందవచ్చు.
  • మానసిక వైద్య నిపుణుడు కార్ల్‌ క్రిస్ట్‌మెన్‌ లైవ్‌ షో (రూ.20లక్షలు)
  • మియాజ్‌ స్కిన్‌ కేర్‌ నుంచి రూ.42 వేల గిఫ్ట్‌ సెట్‌.

ఆస్కార్‌ అకాడమీతో ఈ కంపెనీకి ఎలాంటి ఒప్పందం లేకపోయినా ప్రతి ఒక్కరూ గెలవాలి అన్న ఉద్దేశంతో ‘డిసెంటివ్‌ అసెట్స్‌’ వీటిని నామినీలకు అందించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని