BRO Movie: ‘బ్రో’ క్లైమాక్స్‌.. 90 ఏళ్లు గడువు ఇచ్చినట్టు ఉంటే బాగుండేది!

‘బ్రో’ (BRO) సినిమాతో తన అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna). ఈ సినిమా ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారని ఆయన అన్నారు.

Published : 09 Sep 2023 13:01 IST

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) - సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) రివ్యూ చెప్పారు. కాలం నిర్ణయించిన విధంగానే మనం నడవాలి. అంతేకానీ, మనం కోరిన విధంగా కాలం ఉండదనే  అద్భుతమైన అంశాన్ని ఈ సినిమాతో తెలియజేశారని ఆయన అన్నారు. సినిమా క్లైమాక్స్‌ మరోలా ఉండుంటే బాగుండేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఇదొక సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ కామెడీ చిత్రం. ఇంతకుముందు కూడా మనం ఇలాంటి చిత్రాలు చూశాం. దాదాపు 30 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో యముడి కథతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అలా వచ్చిన ‘యమగోల’, ‘యమలీల’, ‘యమ జాతకుడు’, ‘యముడికి మొగుడు’ చూశాం. నరకానికి అధిపతి యముడు. ‘మనిషి చనిపోయినప్పుడు యముడు భూమ్మీదకు వచ్చి అతడిని నరకానికి తీసుకువెళ్తాడు’ అనే అంశంతో ఆయా చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. అలాంటి కథే అయినప్పటికీ.. ఆ జాడలు ఎక్కడా కనిపించకుండా సముద్రఖని ‘బ్రో’ను తెరకెక్కించారు.

‘సలార్‌’ వాయిదా.. ఆ డేట్‌కి ఎన్ని సినిమాలు వస్తున్నాయంటే?

ఇందులో కాలం అనే దేవుడి (పవన్‌ కల్యాణ్‌)ని చూపించారు. మార్క్‌ అనే కుర్రాడి (సాయిధరమ్‌ తేజ్‌)తో కాలం ఆడుకున్న గేమ్‌లా ‘బ్రో’ను తీర్చిదిద్దారు. ఇందులో మార్క్‌ ఫస్ట్‌ సీన్‌ నుంచి.. ‘నాకు టైమ్‌ లేదు.. టైమ్‌ లేదు..’ అంటూ కనిపిస్తాడు. నిజం చెప్పాలంటే, నిజ జీవితంలో అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎందుకంటే తథాస్తు దేవతలు ఉంటారు. అతడు అన్నట్టుగానే టైమ్‌ లేకుండానే పోతుంది. విశాఖ నుంచి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై అతడు చనిపోతాడు.

అలా, చనిపోయిన మార్క్‌కు కాలం అనే దేవుడిగా పవన్‌కల్యాణ్‌ కనిపిస్తాడు. కుటుంబ బాధ్యతలు తీర్చడానికి దేవుడు మార్క్‌కు కొంత సమయం ఇస్తాడు. అతడితో కలిసి తాను కూడా భూమ్మీదకు వస్తాడు. ఇద్దరూ ఉన్నప్పటికీ ఇది చాలా వరకూ సాయిధరమ్‌ తేజ్‌ చిత్రమే. పవన్‌ కల్యాణ్‌ కాలం రూపంలో వినోదాన్ని అందిస్తూ ముందుకు తీసుకువెళ్లారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్క్రీన్‌ప్లే సాగింది.

చాలారోజుల తర్వాత ఇలా.. సరికొత్త చిత్రాలపై రాజమౌళి రివ్యూ..!

ఓ ఎపిసోడ్‌లో కుటుంబ పోషణ నిమిత్తం హీరో చిన్నప్పటి నుంచి ఎంతలా కష్టపడ్డారో చూపించారు. ఆ సీన్స్‌ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. దేవుడు ఇచ్చిన గడువు ముగిసి తిరిగి పైకి వెళ్లిపోయే సమయం ఆసన్నమవుతున్నప్పుడు వచ్చే సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయి. ముఖ్యంగా.. మార్క్‌ చనిపోయినా తన కుటుంబం ఎలా ముందుకు సాగేదో అందులో చూపిస్తారు. ‘‘కాలం నిర్ణయించిన విధంగానే మనం నడవాలి. అంతేకానీ, మనం కోరిన విధంగా కాలం ఉండదు’’ అనే విషయానికి ఆ సీన్స్‌ అద్దం పడతాయి.

ఈ సినిమా విషయంలో లెవెన్త్‌ అవర్‌ చెప్పాలంటే.. క్లైమాక్స్‌ మరొక విధంగా ఉండి ఉంటే బాగుండేది. చనిపోయి పైకి వెళ్లిన మార్క్‌.. ‘నాకు ఇప్పుడు 30ఏళ్లు మరో 30 ఏళ్లు గడువు ఇవ్వు. బాధ్యతలన్నీ పూర్తి చేసి వచ్చేస్తా’ అని కాలాన్ని బతిమిలాడుకుంటాడు. చివరకు కాలం 90 రోజుల గడువు ఇస్తుంది. నా అభిప్రాయం ప్రకారం.. తన చెల్లెల్లు, తమ్ముడికి పెళ్లుళ్లు చేసి.. అమ్మ చికిత్స చేయించి 90 రోజుల తర్వాత పైకి వెళ్లిపోవాలనుకున్న మార్క్‌కు దేవుడు ఒక సర్‌ప్రైజ్‌ ఇవ్వాలి. ‘‘మార్క్‌.. నేను నీకు 90 ఏళ్లు టైమ్‌ ఇచ్చా. నువ్వు ఆరోజు సరిగ్గా వినలేదు. కాబట్టి వెళ్లిపో..’’ అని చెప్పి పంపించేయాలి. అలా మార్క్‌ కూడా తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నట్లు చూపించి.. సీన్‌ అక్కడితో క్లోజ్‌ చేయాలి. కట్‌ చేస్తే 90 ఏళ్ల వయసులో మార్క్ మృతి చెంది కాలాన్ని కలవాలి. అక్కడ వారిద్దరి మధ్య ఇప్పుడు చూపించిన సంభాషణలే ఉండాలి. ఇలా ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేదని నా భావన. ‘యమదొంగ’, ‘యమగోల’ వంటి చిత్రాలనే ఫాలో అయితే మరోలా ఉండేదేమోనని నా అభిప్రాయం’’ అని పరుచూరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని