Payal rajput: నటులకి అవి చాలా బాధని పంచుతాయి

పాయల్‌ రాజ్‌పూత్‌... తెలుగులో తొలి సినిమాతోనే పరిశ్రమలో చర్చని లేవనెత్తిన కథానాయిక. సాహసోపేతం అనిపించే పాత్రని పోషించి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది.

Updated : 16 Nov 2023 12:30 IST

పాయల్‌ రాజ్‌పూత్‌... తెలుగులో తొలి సినిమాతోనే పరిశ్రమలో చర్చని లేవనెత్తిన కథానాయిక. సాహసోపేతం అనిపించే పాత్రని పోషించి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఆ ప్రయత్నమే ఆమెని బిజీ కథానాయికగా మార్చింది. ఆ తర్వాత తెలుగులో పలు అవకాశాల్ని అందుకున్నా... తొలి సినిమా స్థాయి ప్రభావం చూపించలేకపోయింది. మళ్లీ తన తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్‌100’ దర్శకుడు అజయ్‌ భూపతితో మరోసారి జట్టు కట్టి ఇటీవల ‘మంగళవారం’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా పాయల్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

‘మంగళవారం’ కథ విన్న తర్వాత మీ మనసులో మెదిలిన ఆలోచనలేమిటి?

ఇది నిజంగా జరిగిందా... ఈ పాత్ర నిజమైనదేనా? అని అడిగా. ఇలాంటి గాఢమైన భావోద్వేగాలున్న సినిమాల్ని ఇదివరకు నేను కూడా చేశా కానీ... ఈ తరహా కథ, పాత్రల గురించి ఎప్పుడూ వినలేదు. ఓటీటీ వేదికల్లో ఎన్నో దేశాలకి చెందిన సినిమాల్ని చూశా కానీ, ఎక్కడా ఈ తరహా కథ రాలేదు. కథ విన్నప్పుడే ‘మంగళవారం’ నన్నెంతో ఆత్రుతకి గురిచేసింది.  

మీకంటే ముందు ఈ సినిమా కోసం చాలా మంది కథానాయికల్ని ఆడిషన్స్‌ చేశారట కదా...?

ఓ కొత్త కథానాయికని పరిచయం చేయాలనుకున్నారు అజయ్‌ భూపతి. నేనేమో ‘సార్‌... నాకు ఒక అవకాశం ఇవ్వండి’ అని ఎప్పుడూ అడిగేదాన్ని. చిన్న పాత్రయితే ఇవ్వను, బలమైన కథ కుదిరితే కచ్చితంగా ఫోన్‌ చేస్తా అని చెప్పేవారు. నా శక్తి సామర్థ్యాలు తెలిసిన దర్శకుడు ఆయన. మళ్లీ ఓసారి ఫోన్‌ చేసినప్పుడు ‘కొత్త సినిమా కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయి’ అని చెప్పారు. నాకు అవకాశం ఇస్తే నా కెరీర్‌కి మరో మలుపు అవుతుందని చెప్పా. దాంతో ఆయన ఆడిషన్స్‌కి పిలిచి, లుక్‌ టెస్ట్‌లు చేసి నన్ను ఎంపిక చేశారు.

అసలు ఈ పాత్ర ఎలా ఉంటుంది? నటిగా ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నారు?

శైలు అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర. నా వ్యక్తిత్వానికీ, ఈ పాత్రకీ పది శాతం కూడా పోలికలు ఉండవు. నేనెప్పుడూ నవ్వుతూ ఏదో ఒకటి మాట్లాడుతూ సరదాగా గడిపే అమ్మాయిని. కానీ ఈ పాత్ర అందుకు పూర్తి భిన్నం. అందరిలాగే సరదాగా గడిపే శైలు అనుకోకుండా కొన్ని అసాధారణ అనుభవాల్ని ఎదుర్కొంటుంది. అదేమిటనేది ఈ సినిమాలో కీలకం. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తూ రూపొందించిన చిత్రమిది. ఈ పాత్ర మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లు విసిరింది. మేకప్‌ కోసమే రెండు గంటలు పట్టేది. ఈ పాత్రతో భావోద్వేగమైన ప్రయాణం చేశా. దాన్నుంచి బయటికి రావడానికి కూడా నాకు దాదాపు 15 రోజులు పట్టింది. శైలు పాత్ర అందరి సానుభూతిని పొందేలా ఉంటుంది. అజయ్‌ భూపతి చాలా జాగ్రత్తలు తీసుకుని నాతో ఈ పాత్రని చేయించారు. నిర్మాతలు స్వాతిరెడ్డి, సురేష్‌ వర్మ ఎప్పుడూ నటులు, సాంకేతిక బృందం సౌకర్యంగా ఉందా లేదా అని ఆరా తీస్తూ నిర్మాణం చేశారు.

తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ అందుకు దీటుగా మీ ప్రయాణం సాగలేదేమిటి?

సినిమా విజయవంతం అయినప్పుడే నటుల కష్టం వెలుగులోకి వస్తుంది. సినిమా పరాజయాన్ని చవిచూసిందంటే,  అందులో మన ప్రతిభ, కష్టం ఎంతున్నా గుర్తింపుకు నోచుకోదు. నా విషయంలో అదే జరిగింది. కొన్నిసార్లు నేను సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేదేమో. చిత్రసీమలో నాకు మార్గదర్శిలా ఉన్నారు అజయ్‌ భూపతి. తను అప్పుడప్పుడూ ఫోన్‌ చేసి ‘అసలు ఇలాంటి కథని ఎలా ఎంచుకున్నావు?’ అని కోప్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ అనుభవాల తర్వాత మళ్లీ నా ప్రతిభని నిరూపించుకోవాలనే తపనతో పనిచేస్తూ వచ్చా. కొన్నాళ్లుగా నా విధిరాతతో పోరాటం చేస్తున్నా.

తెలుగులో ఇప్పటిదాకా సాగించిన ప్రయాణాన్ని వెనుదిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?

చిత్రసీమలో ప్రయాణం అనిశ్చితం. ఎత్తు పల్లాలు చాలా  ఉంటాయి. ఉన్నట్టుండి తారాస్థాయికి చేరుకుంటాం, ఆ వెంటనే కిందపడిపోతాం. నటులకి ఈ ఆటుపోట్లు చాలా బాధకి గురిచేస్తుంటాయి. కానీ ఈ ఐదేళ్ల ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిది. తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్‌100’ నాకు చాలా పేరు తీసుకొచ్చింది. అయితే అందులో వ్యతిరేక ఛాయలున్న పాత్ర కావడంతో... ఆ కోణంలోనే నన్ను పరిశ్రమ చూసింది. కానీ నేనొక నటిని, నేను అన్ని రకాల పాత్రలూ చేస్తానని రుజువు చేసుకుంటూ వస్తున్నా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని