Project K: కేజీయఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ను ఫాలో అవుతున్న ‘ప్రాజెక్ట్‌-కె’.. ఒక్క అక్షరంతో టైటిల్‌?

Project K: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమతో పాటు భారతీయ సినీ అభిమానులు వేచి చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌-కె’. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నారు.

Updated : 15 Jul 2023 16:56 IST

హైదరాబాద్‌:  ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘ప్రాజెక్ట్‌-కె’ (Project K). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను ఈ నెల 20న అమెరికాలో జరిగే కామికాన్‌లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఇందుకు సంబంధించిన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు.

‘‘ఈ ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తికర షో కోసం వేచి చూస్తోంది.  ప్రాజెక్ట్‌-కె ప్రపంచాన్ని పరిచయం చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉండండి. జులై 20 (యూఎస్‌ఏ) జులై 21 (ఇండియా)’’ అని చిత్ర బృందం పేర్కొంది. అంతేకాదు రెండు చేతులు ఢీకొంటున్న ఫొటోను కూడా పంచుకుంది. ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ మరో అప్‌డేట్‌ ఇచ్చి, ప్రభాస్‌ అభిమానులకు మరింత ఉత్కంఠ కలిగించారు. ఒక కవర్‌పై పూలను ఉంచిన ఫొటోను ఆయన షేర్‌ చేశారు. ‘ఈ కవర్‌లో ఒక పేపర్‌ ఉంది. దానిపై ఒకే ఒక అక్షరం ముద్రించి ఉంది. కానీ, దాని బరువు ప్రపంచమంత ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అంటే, ‘ప్రాజెక్ట్‌-కె’కు సింగిల్ లెటర్ టైటిల్‌ ఉంటుందా? అన్న చర్చ మొదలైంది.

అందుకే ఒక అక్షరాన్ని ఎంచుకున్నారా?

ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ మూవీకి ‘ప్రాజెక్ట్‌-కె’ అని ప్రకటించిన దగ్గరి నుంచి వర్కింగ్‌ టైటిల్‌ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సినిమాను పాన్‌ వరల్డ్‌మూవీగా తీర్చిదిద్దుతున్నట్లు నిర్మాత అశ్వనీదత్‌ తెలిపారు. అందుకు తగినట్లుగానే భారీ తారాగణం, అంతకుమించిన బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సినిమా సులువుగా ప్రేక్షకులకు చేరాలంటే టైటిల్‌లో వీలైనని తక్కువ పదాలు ఉండాలి. ‘కేజీయఫ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇలా అక్షరాలు, తక్కువ పదాలు ఉన్నవి సులభంగా జనంలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను నాగ్‌ అశ్విన్‌ అనుసరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్‌. ఒకే అక్షరంతో టైటిల్‌ పెడితే సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ చేయడం సులభం. భాషతో సంబంధం లేకుండా అందరూ పలకగలరు. అందుకే సింగిల్‌ లెటర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ సినిమాకు ‘కాలచక్ర’ అనే మరో టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. మరి అసలు టైటిల్‌ ఏంటి? దానికి వివరణ ఏదైనా ఉంటుందా? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

చిరంజీవి సినిమాకు పోటీగా ‘మనీ’ విడుదల చేసిన ఆర్జీవీ

ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌-కె’లో ప్రభాస్‌తో పాటు, అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఇటీవల కమల్‌హాసన్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని