Mamitha Baiju: అలాంటి చిత్రాల్లో నటించాలని ఉంది: మమితా బైజు

‘ప్రేమలు’ (premalu) సక్సెస్‌లో భాగంగా తెలుగులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నటి మమితా బైజు (Mamitha Baiju).

Published : 14 Mar 2024 15:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ప్రేమలు’తో ఒక్కసారిగా ఫేమ్‌ సొంతం చేసుకున్నారు నటి మమితా బైజు (Mamitha Baiju). యూత్‌ఫుల్‌, రొమాంటిక్‌ కామెడీ కథాంశంతో సిద్ధమైన ఈ చిత్రంలో రీనూగా నటించి అలరించారు. ‘ప్రేమలు’ సక్సెస్‌లో భాగంగా తెలుగులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు అల్లు అర్జున్‌ అంటే ఎంతో ఇష్టమన్నారు.

‘‘హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ‘ప్రేమలు’ చిత్రీకరించాం. మా చిత్రానికి ఇంతటి విశేష స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రేక్షకులు మాపై చూపిస్తోన్న ఆదరణకు సంతోషంగా ఉన్నాం. మా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాం. భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన చిత్రాలు, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలని ఉంది. యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ కథలంటే నాకు చాలా ఇష్టం. మలయాళీ చిత్ర పరిశ్రమ కంటెంట్‌పై ఎక్కువగా ఫోకస్‌ చేస్తుంది. ఆ చిత్ర పరిశ్రమలో రాణించాలనుకుంటున్నా’’

‘‘అల్లు అర్జున్‌ అంటే నాకెంతో ఇష్టం. ఎంతగానో అభిమానిస్తున్నా. ఆయన నటించిన ప్రతీ చిత్రాన్ని పదిసార్లు చూస్తుంటా. అయినప్పటికీ టీవీలో వచ్చినప్పుడు కూడా చూస్తా. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు.

‘ప్రేమలు’ కథేంటంటే: స‌చిన్ సంతోష్ (నాస్లెన్ కె.గ‌ఫూర్‌) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విష‌యాన్ని చెప్పేందుకు ధైర్యం స‌రిపోదు. కాలేజీలో చివ‌రిరోజు త‌న  ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. ఆ అమ్మాయేమో అప్ప‌టికే వేరొక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌ని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమ‌లో విఫ‌ల‌మైన స‌చిన్‌... యూకే వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. తీరా చూస్తే వీసా రాదు.  దాంతో గేట్ కోచింగ్‌ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్ర‌తాప్‌)తో క‌లిసి హైద‌రాబాద్ చేరుకుంటాడు. అక్క‌డే రీనూ (మ‌మిత బైజు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లి వేడుక‌లో వీరిద్దరూ క‌లుస్తారు. తొలి చూపులోనే ఆమె ప్రేమ‌లో ప‌డిపోతాడు. మ‌రి ఈసారైనా స‌చిన్ ప్రేమక‌థ సుఖాంత‌మైందా? లేక మ‌ళ్లీ అత‌ని హార్ట్ బ్రేక్ అయ్యిందా? అనే ఆసక్తికర అంశాలతో ఇది సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని