Prithviraj Sukumaran: ఈడీకి రూ.25 కోట్లు ఫైన్‌ కట్టాడంటూ వార్తలు.. పృథ్వీరాజ్‌ ఆగ్రహం

తన గురించి వార్తలు ప్రచారం చేసిన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌పై మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈడీకి ఎలాంటి జరిమానా చెల్లించలేదని ఆయన తెలిపారు.

Published : 12 May 2023 01:31 IST

చెన్నై: నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)కు సంబంధించిన ఓ వార్త తాజాగా మలయాళీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియాకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి పృథ్వీరాజ్‌ డబ్బులు తీసుకుని ప్రచార చిత్రాలు నిర్మిస్తున్నారని.. దీంతో ఆయన ఈడీకి పెద్ద మొత్తంలో ఫైన్‌ చెల్లించారని తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో వార్తలు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న ఈ ఆరోపణల గురించి పృథ్వీరాజ్‌ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం లేకుండా తన పరువుకు భంగం కలిగించేలా ఇలాంటి వార్తలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన న్యాయప్రకియను ప్రారంభిస్తానని తెలిపారు.

‘‘మరునాడన్ మలయాళీ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ నా పరువుకు భంగం కలిగించేలా ప్రచారం చేసిన కథనాలు తాజాగా నా దృష్టికి వచ్చాయి. ప్రచార చిత్రాలు తెరకెక్కిస్తున్నాననే కారణంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు నేను రూ.25 కోట్ల జరిమానా కట్టానంటూ ఆయా కథనాల్లో ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినందుకుగానూ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాను. అలాగే, ఏదైనా సమాచారాన్ని ఇచ్చేముందు సరిగ్గా చెక్‌ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా’’ అని ఆయన ప్రకటన విడుదల చేశారు.

విభిన్నమైన కంటెంట్‌ ఉన్న చిత్రాలతో పృథ్వీరాజ్‌ మలయాళీ సినీప్రియులకు ఎంతో చేరువయ్యారు. ‘అయ్యప్పనమ్‌ కోషియం', ‘బ్రో డాడీ’, ‘లూసిఫర్‌’, ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’, ‘జనగణమన’ వంటి ప్రాజెక్ట్‌లు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రభాస్‌ నటిస్తోన్న ‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని