నా నటనతో... ఆ పేరు మార్చేసుకుంటా!

అలా కన్నుగీటేసి... ఇలా కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపిన అందం... ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అంతర్జాలంలో వైరల్‌ అయిన ఆ ఒక్క వీడియోతో ఈమె జీవితమే మారిపోయింది.

Published : 23 Feb 2021 20:36 IST

అలా కన్నుగీటేసి... ఇలా కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపిన అందం... ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అంతర్జాలంలో వైరల్‌ అయిన ఆ ఒక్క వీడియోతో ఈమె జీవితమే మారిపోయింది. తొలి అడుగుల్లోనే దక్షిణాది మొదలుకొని బాలీవుడ్‌ వరకు    పలు భాషల్లో నటించింది. ఇటీవల నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘చెక్‌’లో ఓ కథానాయికగా నటించిందీమె. ‘చెక్‌’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...

అలా మొదలైంది

‘‘తెలుగు సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మంచి కథ కోసం ఎదురు చూస్తూ వచ్చా. ఇంతలో దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి సర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయన తీసిన ‘మనమంతా’ సినిమా మలయాళంలో ‘విస్మయం’ పేరుతో వచ్చింది. నాకు బాగా నచ్చిన చిత్రమది. అది చూశాక ఈయన ఎంత గొప్ప దర్శకుడో అర్థమైంది. ఆయనే ఫోన్‌ చేసి ‘చెక్‌’లోని యాత్ర అనే పాత్రలో నువ్వు నటించాలని చెప్పగానే వెంటనే అంగీకారం తెలిపా. తెలుగులో నేను చేయడానికి సరైన సినిమా ఇదే అనిపించింది. అలా ‘చెక్‌’ సినిమాతో తెలుగులో నా ప్రయాణం మొదలైంది’’.

యాత్ర... నేను

‘‘సాహసాలకి వెనకాడని అమ్మాయి యాత్ర. కొన్ని విషయాల్లో నేను, యాత్ర ఒకలాగే ఉంటాం. ఆ పాత్రలోని సరదాతనం నా నిజ జీవితంలోనూ కొంచెం ఉంటుంది. అందుకే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన   అవసరం రాలేదు. అయితే చిత్రీకరణకి ముందు స్క్రిప్ట్‌ రీడింగ్‌ సెషన్‌ జరిగింది. దర్శకులు ముందే నాకు స్క్రిప్టు ఇచ్చి, నా పాత్రకి సంబంధించిన సంభాషణల్ని చదవమని చెప్పారు. వాటికి అర్థం తెలుసుకుంటూ నేను సిద్ధమయ్యా. మనం చెప్పాల్సిన సంభాషణల భావం తెలిస్తే మరింత బాగా నటించగలం. నా పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను కానీ... ‘చెక్‌’ అనేది ఆదిత్య ప్రయాణం. అతని ప్రయాణంలో యాత్ర ముఖ్యమైన భాగం. అదెలా అనేది తెరపైనే చూడాలి. నితిన్‌ సీనియర్‌ నటుడు కావడంతో మొదట భయపడ్డా. కానీ సెట్లో తనతో కలిసి పనిచేయడం సౌకర్యంగా అనిపించింది. తెలుగులో ‘చెక్‌’తోపాటు, ‘ఇష్క్‌’ అనే మరో సినిమా చేశా. ఇప్పుడు తెలుగు బాగా అర్థం అవుతోంది. కొంతవరకు మాట్లాడతాను కూడా. ఇంకొన్ని సినిమాల తర్వాత సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొంటా’’.

అస్సలు వదలుకోను

‘‘దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా. హిందీలోనూ చేశా. ఒక భాషకి పరిమితం కాకుండా... ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా. తమిళంలో ఇంకా నటించలేదు కాబట్టి... అక్కడా తొందరగా ఓ సినిమా చేసేయాలని ఉంది. నటనతోపాటు... నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక  సంగీతంలో శిక్షణ తీసుకున్నా. ‘చెక్‌’ సెట్లో నేను పాడటం చూసి దర్శకులు ఆశ్చర్యపోయారు. సినిమాలో నాతో పాడించాలనుకున్నారు కానీ... కుదరలేదు. కన్నడలో నేను నటించిన ‘విష్ణుప్రియ’ సినిమాలోనూ పాట పాడా. మలయాళంలోనూ పాడా. తెలుగు, హిందీల్లో ఆల్బమ్‌ గీతాలు ఆలపించా. సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’’.

సరదా సరదాగా

‘‘21 ఏళ్ల ఓ సాధారణ అమ్మాయి ఎలా ఉంటుందో నేనూ అంతే. తోడుగా ఒకరున్నారంటే వాళ్లతో సరదాగా మాటలు చెప్పుకొంటూ గడిపేస్తా. సినిమాకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. మా నాన్న సెంట్రల్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాకు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ తమ్ముడున్నాడు. తాతయ్య, నాన్నమ్మ... అందరం కలిసే ఉంటాం. అమ్మ బలవంతంతో అతికష్టం మీద గతజూన్‌లో బీకామ్‌ పూర్తి చేశా. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాపైనే’’.

రాత్రికి రాత్రే

‘‘చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేదాన్ని. ఇంట్లోవాళ్లు ‘ఏదో సరదాగా చేస్తుందిలే’ అనుకున్నారు. కానీ ఇంటర్‌ టైమ్‌లో నేను ఆడిషన్స్‌లో పాల్గొనడం చూసి ‘సీరియస్‌గానే సినిమా కెరీర్‌ని ఎంచుకుంటున్నావా?’ అన్నారు. ఆ తర్వాత నా ఆసక్తిని ప్రోత్సహించారు. కొన్ని లఘు చిత్రాలు, ఓ చిత్రంలో చిన్న పాత్ర చేశాక... ‘లవర్స్‌ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్‌ అయ్యింది. రాత్రికి రాత్రే నా జీవితంలో ఊహించని మార్పు. డిగ్రీ తొలి సెమిస్టర్‌ రోజులవి. అప్పటిదాకా స్నేహితులతో కలిసి కాలేజీకి, బయటకీ వెళ్లి సరదాగా గడిపిన నేను ఎక్కడికెళ్లాలన్నా ఆలోచించాల్సి వచ్చేది. అందరి దృష్టీ నాపైనే. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా... ఆ తర్వాత ‘ఇదంతా నేను ఎంచుకుంటున్న వృత్తిలో భాగమే అని’ అర్థమైంది. ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను వింక్‌ గాళ్‌ అనే పిలుస్తుంటారు. ఆ గుర్తింపు నా అదృష్టమే కానీ, ఇక నుంచి నా నటనతో ఆ పేరు మార్చుకోవాలి’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని