Ashwini Dutt: ఒక్క సినిమాతో రూ.32 కోట్లు నష్టం.. సినిమాలు వదిలేద్దామనుకున్నా!

Aswani Dutt: ‘ఇక మనకి ఈ ఇండస్ట్రీ అనవసరం. సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం’ అని శక్తి సినిమాతో అనిపించిందని సినీ నిర్మాత అశ్వినీదత్‌ అన్నారు.

Published : 05 May 2023 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ నిర్మాణంలో ఎదురు దెబ్బలు తగలడం సహజమని, అయితే, మళ్లీ పుంజుకుని సినిమాలు తీస్తుంటామని సినీ నిర్మాత అశ్వినీదత్‌ (Aswani Dutt) అన్నారు. అయితే, ఒక సినిమా విషయంలో జరిగిన నష్టం చూసిన తర్వాత ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదామనుకున్నానని తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

‘‘ఏదైనా సినిమాలో నేను దెబ్బ తిన్నప్పుడు చిరంజీవిగారు పిలిచి ‘కథ రెడీ చేసుకోండి. మనం సినిమా చేద్దాం’ అని చెప్పేవారు. నాగార్జున కూడా అంతే. వేరే వాళ్ల సినిమా ఆపేసి నాకోసం సినిమాలు చేసిన హీరోలున్నారు. నా కెరీర్‌లో బాగా నిరాశకు గురి చేసిన సినిమా ‘శక్తి’. ‘ఇక మనకి ఈ ఇండస్ట్రీ అనవసరం. సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం’ అనిపించింది. నిర్మాణ వ్యయం బాగా ఎక్కువైపోయింది. ఆ ఒక్క సినిమాలోనే రూ.32 కోట్లు పోయాయి. ఇది మామూలు విషయం కాదు. నేనూ అరవింద్‌గారు కలిసి ‘చూడాలని ఉంది’ హిందీలో తీశాం. మా ఇద్దరికీ కలిపి రూ.12కోట్లు నష్టం వచ్చింది. అంటే చెరో రూ.6కోట్లు. అప్పటికి ఇద్దరం ఫామ్‌లో ఉన్నాం కాబట్టి మళ్లీ కోలుకున్నాం. ‘శక్తి’ మాత్రం నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని అనిపించలేదు. ఈలోగా పిల్లలు వచ్చి సినిమా తీస్తామంటే ఒప్పుకొన్నా. మంచి సినిమాలు తీయడంతో వాళ్లను ప్రోత్సహిస్తూ వచ్చా’’ అని అశ్వినీదత్‌ అన్నారు.

ఇక తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పటికీ ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. అయితే, పార్టీలో తాను ఏ పదవులు ఆశించనని తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆంతరంగికుల్లో ఒకరిగా తనని భావిస్తారని అశ్వినీదత్‌ అన్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ రావడంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, దిగ్గజ నటుడు నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, చంద్రబాబులు సీఎంలుగా ఉండగా తమవంతు సాయం చేశారని తెలిపారు. సినీ పరిశ్రమను కలుపుకొని వెళ్లాలనే ఉద్దేశం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా అశ్వినీదత్‌ ‘ప్రాజెక్ట్‌-కె’(వర్కింగ్‌ టైటిల్‌) మూవీని అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. దీపిక పదుకొణె కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని