ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, సూర్య ‘ఈటి’ ట్రైలర్స్‌ వచ్చేస్తున్నాయి.. ఎప్పుడంటే..

రాధేశ్యామ్‌ చిత్ర బృందం రోజుకో అప్‌డేట్‌తో సందడి చేస్తోంది. ప్రభాస్‌-పూజా హెగ్డే నటించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

Published : 28 Feb 2022 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాధేశ్యామ్‌ చిత్ర బృందం రోజుకో అప్‌డేట్‌తో సందడి చేస్తోంది. ప్రభాస్‌-పూజా హెగ్డే నటించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. సెకెండ్‌ ట్రైలర్‌ను మార్చి2న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్‌ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. దీనిపై దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ‘‘పుట్టామా, పెరిగామా, ప్రేమించామా’’ అని క్యాప్షన్‌ను జత చేశారు. రెండు నెలల క్రితం విడుదలైన తొలి ట్రైలర్‌కు ఇప్పటి దాకా 48 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. 

కాగా దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్స్‌ ఆకర్షణగా నిలవనున్నాయి. హిందీలో బిగ్‌బి అమితాబ్‌, తెలుగులో ‘రాధేశ్యామ్‌’ కథ అగ్ర దర్శకుడు రాజమౌళి, కన్నడలో శివరాజ్‌కుమార్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌  సుకుమారన్‌, తమిళంలో సత్యరాజ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘1970 నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథ. రూ.350కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇటలీ, హైదరాబాద్‌లో చిత్రీకరించారు. వంశీ, ప్రమోద్‌, ప్రసీధ నిర్మాతలుగా వ్యవహరించారు.

సూర్య ఈటి ట్రైలర్‌ సందడి అప్పుడే!

వరుస హిట్స్‌తో మంచి దూకుడు మీద ఉన్న హీరో సూర్య తదుపరి చిత్రం  ‘ఈటి... ఎవరికీ తలవంచడు’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఓ విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా మార్చి 10న విడుదల కానుంది. ఈనేపథ్యంలో సోమవారం సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం. మార్చి2న ఉదయం 11.30 గంటలకు తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నట్లు ట్వీట్‌ చేసింది.  ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రై.లి.సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డి. ఇమాన్‌ స్వరాలు సమకూర్చారు. వినయ్‌ రాయ్‌ ప్రతినాయకుడిగా నటించగా.. సత్యరాజ్‌, రాజ్‌కిరణ్‌, శరణ్య కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని