Rakesh master: సినీ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూత

ప్రముఖ తెలుగు సినీ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ (rakesh master) కన్నుమూశారు.

Updated : 18 Jun 2023 18:58 IST

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు సినీ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ (53) (Rakesh master) కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్‌లో షూటింగ్‌ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఆయన అనారోగ్యం బారినపడ్డారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో ఆయన పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ‘‘ఈరోజు మధ్యాహ్న ఒంటిగంటకు రాకేశ్‌ మాస్టర్‌ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. డయాబెటిక్‌ పేషెంట్‌ కావడం, సివియర్‌ మెటబాలిక్‌ ఎసిడోసిస్‌ కావడంతో మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ అయి సాయంత్రం 5గంటలకు మృతి చెందారు’’ అని  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.

‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్‌ రియాల్టీషోల ద్వారా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆయన ఎన్నో విజయవంతమైన పాటలకు నృత్యాలు సమకూర్చారు. దాదాపు 1500లకు పైగా సినిమాలకు పనిచేశారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తరచూ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. పలు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’షోలోనూ పలు ఎపిసోడ్స్‌లో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్‌ కొరియోగ్రాఫర్‌ అయిన శేఖర్‌ మాస్టర్‌తో సహా పలువురు డ్యాన్స్‌ మాస్టర్లు రాకేశ్‌ మాస్టర్‌(Rakesh master)కు శిష్యులే. రాకేశ్‌ మాస్టర్‌ దగ్గరకు వచ్చిన తర్వాతే డ్యాన్స్‌, స్టైల్‌ నేర్చుకున్నట్లు శేఖర్‌ మాస్టర్‌ పలు సందర్భాల్లో పంచుకున్నారు. రాకేశ్‌ మాస్టర్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

రాకేశ్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫ్‌ చేసిన కొన్ని సాంగ్స్‌

  • వెండితెరకు మా వందనాలు (మనసిచ్చాను)
  • చందమామ కన్నా చల్లని వాడే (యువరాజు)
  • ఎక్స్టసీ ప్రైవసీ (సీతారామరాజు)
  • నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ (గర్ల్‌ ఫ్రెండ్‌)
  • సొమ్ములే ఆదా చేయరా (బడ్జెట్‌ పద్మనాభం)
  • నిన్నలా మొన్నలా లేదురా (చిరునవ్వుతో)
  • నేస్తామా ఓ ప్రియ నేస్తమా, కళ్లలోకి కళ్లుపెట్టి చూడలేకున్నా (లాహిరి లాహిరి లాహిరిలో)
  • బంగారం.. బంగారం, ఏయ్‌ బాబూ ఏంటి సంగతి, నువ్వంటేనే ఇష్టం, నిజంగా చెప్పాలంటే క్షమించు (దేవదాసు)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని