Ram Charan: దాని గురించి ఆలోచిస్తే కాళ్లు వణుకుతాయి.. ‘నాటు నాటు’ అందరిదీ..: రామ్‌చరణ్‌

ప్రస్తుతం అమెరికాలో ఉన్న రామ్‌చరణ్‌ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ‘నాటు నాటు’ పాట గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడారు.

Published : 10 Mar 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ప్రేక్షకులందరిదని, దాని చిత్రీకరణ గురించి ఆలోచిస్తే ఇప్పటికీ కాళ్లు వణుకుతుంటాయని ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) అన్నారు. ఈ నెల 12న లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న ఆస్కార్‌ వేడుక (Oscar Awards 2023)ల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన రోజుకో హాలీవుడ్‌ మీడియాతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ టునైట్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని కొన్ని విశేషాలివీ..

4 కిలోల బరువు తగ్గా..

‘‘నాటు నాటు’ పాట మాది మాత్రమే కాదు ప్రేక్షకులందరిదీ. భిన్న సంస్కృతులకు చెందిన అన్ని వయసులవారు దాన్ని ఆస్వాదించారు. సాహిత్యం అర్థంకాకపోయినా తమ పాటగా స్వీకరించారు. అందులోని బీట్‌ అలాంటిది. జపాన్‌ నుంచి యూఎస్‌ వరకు ప్రతి ఒక్కరూ ఆ గీతానికి ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేయడం నేను గమనిస్తున్నా. ఇంతకు మించి నేనేం కోరుకోవట్లేదు. ఉక్రెయిన్‌ ప్రెసిడెన్సియల్‌ ప్యాలెస్ ముందు వారం పాటు ‘నాటు నాటు’ పాట‌కు సంబంధించి రిహార్స‌ల్ చేశాం. ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా నటనా అనుభవం కలిగినవారు గనక అక్కడ షూటింగ్ చేసుకుంటామనే మా విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. ఆ పాట చిత్రీక‌ర‌ణ‌లో 150 మంది డాన్స‌ర్లు పాల్గొన్నారు. 200 మంది సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. 17 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. కొన్ని స్టెప్పులకు చాలా రీటేక్స్‌ తీసుకున్నాం. దానివల్ల నేను 4 కిలోల బరువు తగ్గా. ఆ కష్టం గురించి ఆలోచిస్తే నా కాళ్లు వ‌ణుకుతాయి’’

ఆయన్ను సపోర్ట్‌ చేసేందుకు వచ్చాం..

‘‘నా నుంచి, ఎన్టీఆర్‌ నుంచి తనకు ఎలాంటి ఔట్‌పుట్‌ కావాలన్న దానిపై రాజమౌళికి స్పష్టత ఉంది. మా డ్యాన్స్‌ విషయంలో ఆయన స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా వచ్చేలా చేసేవారు.  దాని కోసం మమ్మల్ని హింస పెట్టేవారు (నవ్వుతూ). కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉంది. రాజమౌళితో కలిసి పనిచేసే సమయంలో నా బ్రెయిన్‌ని స్విచ్ఛాఫ్‌ మోడ్‌లో పెట్టేస్తా. ఎందుకంటే ఆయ‌న మ‌న‌సులో ఏముందో మ‌నం ఊహించ‌లేం. ఓ టెక్నీషియ‌న్‌గా త‌న‌కేం కావాలో బాగా తెలుసు. త్వరలోనే జరగబోతోన్న ఆస్కార్‌ వేడుకలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు కాస్త టెన్షగా ఉంది. నేను అభిమానించే తారలంతా ఆ ఈవెంట్‌కు వస్తారు. దాంతో, అక్కడ నేను అభిమానిగా ప్రవర్తిస్తానో, ఓ నటుడిగా ఉంటానో చూడాలి. టామ్‌క్రూజ్‌ చాలా గొప్ప వ్య‌క్తి. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తే చాలా గొప్ప‌. ఆస్కార్ అవార్డుకి మా సంగీత ద‌ర్శ‌కుడు ఎం. ఎం. కీర‌వాణి అర్హులు. 27 ఏళ్ల ప్రస్థానం ఆయనది. ఆయన్ను స‌పోర్ట్ చేయ‌డానికి ఓ కుటుంబంలా మేమంతా ఇక్క‌డ‌కు వ‌చ్చాం’’

వాటిల్లో నటించాలనుంది..

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో మేం ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమ‌, అభినంద‌న‌లు ద‌క్కాయి. ఇప్పుడు ఇవన్నీ అదనం. మేం ఈ క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తున్నాం. మంచి సినిమాకు భాష‌తో పనిలేదనడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ ఉదాహరణ. భిన్న సంస్కృతులకు చెందిన ప్రేక్షకులు ఇష్ట‌ప‌డే ఫ్రాంచైజీ చిత్రాల్లో నేను భాగం కావాల‌నుకుంటున్నా. ఇప్పుడు సినిమా గ్లోబ‌ల్ అయ్యింది. సినిమాకున్న హ‌ద్దుల‌న్నీ చెరిగిపోతున్నాయి. ఇలాంటి సినీ గ్లోబ‌లైజేష‌న్ స‌మ‌యంలో నేను సినీ ఇండ‌స్ట్రీలో ఉండ‌టం అదృష్టంగా భావిస్తున్నా. నేను హాలీవుడ్‌లో చాలా మంది ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్నా. వారిలో జె. జె. అబ్ర‌మ్స్ ముందుంటారు. ఆ తర్వాత క్వాంటిన్ ట‌రాన్‌టినో. నా ఆల్‌టైమ్ ఫేవ‌రేట్ మూవీస్‌లో ఈయన తెరకెక్కించిన ‘ఇన్‌గ్లోరియ‌స్ బాస్టర్డ్స్‌’ ఒకటి. ఆయ‌న ప్రభావం నాపై చాలా ఉంది. ఈ ద‌ర్శ‌కులు వారితో ప‌ని చేసే న‌టుల‌కు స‌వాలు విసురుతుంటారు’’ అని రామ్‌ చరణ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని