Ram charan: ప్రతి దానిలో మాకంటే నాన్న ఒక అడుగు ముందే ఉంటారు: రామ్‌ చరణ్‌

ఆస్కార్‌ వేడుకకు ముందు అమెరికాలో అభిమానులతో రామ్‌ చరణ్‌ (Ram charan) ముచ్చటించారు. ఇంతగా ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Updated : 12 Mar 2023 19:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో రోజులుగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న ఆస్కార్‌ (Oscars) వేడుక మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్కార్‌ మాటే మారుమోగుతోంది. ప్రపంచ దేశాల ప్రేక్షకుల మనసులు దోచుకున్న ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక ఈ వేడుకకు హాజరయ్యే ముందు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram charan) అమెరికాలో అభిమానులతో ముచ్చటించారు. తన కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

‘‘అమెరికాలో ఓ సినిమాకు వెళ్లడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది నాకోసం చాలా దూరం నుంచి ఇంతమంది వచ్చారు. మీ అందరి ప్రేమాభిమానాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటున్నాను.  మేము ఇలా ఉన్నామంటే మీ అందరి అభిమానమే కారణం. తెలుగు వాళ్లుగా మనం ‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR)తో చరిత్ర సృష్టించాం. అందులో మీరంతా భాగమే.  10 ఏళ్ల తర్వాత వెనకకు తిరిగి చూస్తే ఈ రోజు గురించి గర్వంగా చర్చించుకుంటాం.  తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సూపర్‌ హిట్‌ అయిన సందర్భంగా నాన్న గారు మీరందరితో వీడియోలో మాట్లాడారు. అది చూసి నేను అవాక్కయ్యాను. ఆయనకు అలాంటి ఐడియాలు ఎలా వస్తాయనుకున్నా.  మేము ఎంత అప్‌డేట్‌గా ఆలోచిస్తున్నాం అనుకున్నా.. ఆయన మాకంటే అన్నిటిలో ఓ అడుగుముందే ఉంటారు’’ అని రామ్‌ చరణ్‌ అన్నారు. 

అమెరికాలోని మెగా ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ (Mega Fans association USA) నిర్వహించిన ఈ ఈవెంట్‌కు మెగా అభిమానులు భారీగా హాజరయ్యారు. రామ్‌ చరణ్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పి.. ఆయనపై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడకు వచ్చిన అభిమానులు ‘మెగాస్టార్‌కు భక్తులు ఉంటారు’ అని కేరింతలు పెట్టగా.. చరణ్ భావోద్వేగానికి గురయ్యారు.

పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్‌ను రామ్‌చరణ్‌ అభినందించారు. విరాళాలు సేకరించి మంచి పనులకు ఉపయోగిస్తున్నారని.. సేవ చేయడం కోసం వేర్వేరు డ్రైవ్‌లను నిర్వహిస్తున్నందుకు అభిమాన సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్‌కు వచ్చిన వాళ్లందరితో చరణ్‌ ఫొటోలు దిగారు. ఈ ట్రిప్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని