Rashmika: వాళ్ల కోసమే డీప్‌ఫేక్‌ గురించి మాట్లాడాను..: రష్మిక

ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే తన డీప్‌ఫేక్‌పై స్పందించినట్లు రష్మిక తెలిపారు.

Published : 01 Feb 2024 10:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది చర్చనీయాంశంగా మారిన అంశాల్లో ప్రముఖుల డీప్‌ఫేక్‌ ఒకటి. స్టార్ హీరోయిన్‌ రష్మిక (Rashmika Mandanna)ఫేక్‌ వీడియో ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పటికే పలువేదికలపై దీని గురించి మాట్లాడిన ఆమె.. తాజాగా మరోసారి స్పందించారు. ఇలాంటి వీడియోలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

‘‘ఇలాంటి చేదు అనుభవం నాకు కాలేజీ రోజుల్లో ఎదురైనట్లైతే ఎవరూ మద్దతు ఇచ్చేవారు కాదు. దీని గురించి మాట్లాడితే సమాజం ఏమనుకుంటుందో అని భావించేవాళ్లు. డీప్‌ఫేక్‌ గురించి స్పందించాలా? వద్దా? అని నేనూ చాలా ఆలోచించాను. దీని గురించి మాట్లాడితే నా ఫాలోవర్స్ 41మిలియన్ల మందికి తెలుస్తుంది. వారంతా రకరకాలుగా స్పందిస్తారు. ఇలాంటి వాటి గురించి పట్టించుకోకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని భావించి దీనిపై రియాక్ట్‌ అయ్యాను. కాలేజీ అమ్మాయిలకు ఇలా జరిగితే పరిస్థితేంటని భయపడ్డాను. వాళ్లలో ధైర్యాన్ని నింపడం కోసమే దీనిపై స్పందించాను. డీప్‌ఫేక్‌ ఎంతో ఒత్తిడి కలిగిస్తుంది. భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది’’ అని రష్మిక (Rashmika) అన్నారు.

అతనే ఎక్కువగా సపోర్ట్‌ చేశారు: రష్మిక చెప్పిన ఆ హీరో ఎవరంటే?

సోషల్‌ మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్‌ రూపొందించారు. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన చెందారు. ఇటీవల ఈ కేసులో అనుమానితుడిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రాలతోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని