‘నీకెవరు ఉద్యోగమిస్తారని హేళన చేశారు’

చాలామంది తమ శరీరంలో ఏదైనా లోపం ఉంటే ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. హేళనలు ఎదురైతే మరింత కుంగిపోతుంటారు. అయితే.. ..

Published : 26 Apr 2021 01:12 IST

ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలామంది తమ శరీరంలో ఏదైనా లోపం ఉంటే ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. హేళనలు ఎదురైతే మరింత కుంగిపోతుంటారు. అయితే.. ఈ రెండింటినే ఆయుధాలుగా చేసుకున్నారు పొట్టి వీరయ్య. నిజానికి సినిమా అనే రంగుల ప్రపంచంలోకి ప్రవేశించడమే పెద్ద సవాల్‌.. ఒకసారి అక్కడ ప్రవేశం దొరికితే సరిపోతుందా అంటే.. అప్పుడే అసలైన కష్టాలు మొదలవుతాయి. అందరిలాగే పొట్టి వీరయ్యకు అదే పరిస్థితి ఎదురైంది. ఉద్యోగానికి వెళ్లిన చోట.. ‘నీకెవరు ఉద్యోగం ఇస్తారు..!’ అంటూ ఎదురైన హేళనే ఆయన ఒక హాస్యనటుడిగా నిలబడేలా చేసింది. ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య(74) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

వీరయ్య నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఫణిగిరి గ్రామంలో జన్మించారు. హైస్కూల్‌ వరకూ చదువుకున్నారు. స్కూల్లో, వేదికలపై నాటకాలు వేసేవారు. 1965లో పదో తరగతి ఫెయిల్‌ కావడంతో ఆయన ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో దివ్యాంగులకు ఇప్పుడున్న ప్రత్యేక పథకాలు లేవు. మరుగుజ్జు అయిన వీరయ్యను చూసి చాలామంది ‘నీకు ఉద్యోగం ఎవరిస్తారు..?’ అంటూ హేళన చేసేవారు. ఆ హేళన వల్లే సినిమాల్లో చేరాలని.. నటుడిగా రాణించాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే ఆలస్యం.. స్నేహుతుడి సహాయంతో రూ.200 పట్టుకొని మద్రాసు వెళ్లి.. అక్కడ ఒక డెకరేషన్‌ దుకాణంలో చేరాడు. ఆ షాపు యజమానికి సినిమా స్టూడియోలలో డెకరేషన్‌ చేసేవాడు. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగానే వీరయ్య అక్కడ తలదాచుకున్నాడు. కొన్నాళ్లకు మరో దుకాణంలోకి మారాడు. అలా ఒకరోజు శోభన్‌బాబును కలిసే అవకాశం వచ్చింది. ‘దయచేసి ఏదైనా అవకాశం ఇవ్వండి సార్‌’ అని అడిగారు. దానికి దర్శకుడు విఠలాచార్య గారిని కలిస్తే ఫలితం ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. వీరయ్య మొత్తానికి దర్శకుడు విఠలాచార్యను కలిసే అవకాశం సంపాదించారు. సినిమాలో చేయాలంటే గుర్రపుస్వారీ రావాలి.. కత్తి యుద్ధం చేయాలి..? నీవల్ల అవుతుందా..? కనీసం గోడ ఎక్కి దూకగలవా అనే ప్రశ్న వీరయ్యకు ఎదురైంది. ‘ఏదైనా చేయగలను.. మీరు అవకాశం ఇవ్వండి.. అంటూ వీరయ్య గోడ ఎక్కి దూకబోయారు. విఠలాచార్య ఆశ్చర్యపోయి ‘అలా దూకితే చనిపోతావయ్య..’ అని చెప్పి రూ.500 తర్వాతి సినిమా కోసం అడ్వాన్స్‌ ఇచ్చారు. పొట్టి వీరయ్య సినీ ప్రస్థానం అలా మొదలైంది.

కాంతారావు, భారతి జంటగా నటించిన చిత్రం ‘అగ్గిదొర’తో వీరయ్య తెరంగేట్రం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వీరయ్యకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ వంటి పెద్దపెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. బ్రహ్మపుత్రుడు చిత్రానికి గానూ ఆయన రూ.25వేలు పారితోషికంగా తీసుకున్నారట. ‘అగ్గివీరుడు’ సినిమా చిత్రీకరణలో భాగంగా ఎలుక వేషం వేయాల్సి వచ్చింది. అప్పుడు బరువు మోయలేక వీరయ్య స్పృహతప్పి పడిపోయారు. ‘ఈ రంగంలోకి ఎందుకు వచ్చానురా.. భగవంతుడా’ అని ఏడ్చారట. అప్పుడు విఠలాచార్య ఓదార్చారని ఆయన చెప్పేవారు. ‘వెళ్లైకారన్‌’ అనే తమిళ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి గోళీలాడే సన్నివేశం ఉంటుంది. అందులో సూపర్‌స్టార్‌ను మన వీరయ్య ‘ఒరేయ్‌’ అనడం.. రజనీకాంత్‌ ఏమో.. ‘అన్నా’ అనడం.. అలా ఇద్దరి మధ్య సంభాషణ ప్రేక్షకులను ఎంతగానో అలరించిందని ఆయన మురిసిపోయేవారు.

వీరయ్య సతీమణి మల్లిక 2008లో మరణించారు. వీళ్లకు ఇద్దరు సంతానం. పొట్టివీర‌య్యకు 74 సంవ‌త్సరాలు. 2 అడుగుల మాత్రమే ఉండే ఆహార్యమే ఆయ‌న‌ ప్రత్యేకత. ఇదే ఆయ‌న‌కు సినిమాల్లో వేషాలు రావ‌డానికి కార‌ణ‌మైంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల‌నుంచి క‌ల‌ర్ సినిమాల‌ వ‌రకు జ‌న‌రేష‌న్‌లో న‌టించి మెప్పించిన న‌టుడు ఆయ‌న‌. ఐదు దశాబ్దాల ఆయన సినీ ప్రయాణంలో 400కు పైగా చిత్రాల్లో నటించి నవ్వులు పూయించారు. ఎన్‌టీఆర్‌, ఎమ్‌జీఆర్‌, కాంతారావు, శివాజీగణేశన్‌, రజనీకాంత్‌, కృష్ణలాంటి స్టార్‌ హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ ఆయ‌న కుటుంబ‌పోష‌ణకు అది స‌రిపోయేదికాదు. అప్ప‌డ‌ప్పుడు వేషాలు వ‌స్తుండేవి. క‌నుక ఆయ‌న వికలాంగుల కోటా కింద హైద‌రాబాద్ కృష్ణాన‌గ‌ర్‌లో బ‌డ్డీకొట్టు పెట్టుకుని జీవ‌నం సాగించేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని