Yash: భార్య, పాప కోసం ఐస్‌ క్యాండీ.. చిన్న కిరాణా షాపునకు వెళ్లిన యశ్‌.. ఫొటోలు వైరల్

Rocking Star Yash: కన్నడ నటుడు యశ్‌ కిరణా దుకాణంలో చాక్లెట్లు కొంటున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Updated : 17 Feb 2024 18:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భార్య, పిల్లలను సంతోష పెట్టడానికి వేలు, లక్షల ఖరీదైన బహుమతులే ఇవ్వనక్కర్లేదు. వాళ్లు కోరుకునే చిన్న చిన్న సంతోషాలను నెరవేర్చినా చాలు ఇట్టే సంబరపడిపోతారు. అలాంటి పనే చేశారు నటుడు యశ్‌. తన భార్య, కూతురు ఐస్‌క్యాండీ అడిగారని చిన్న కిరాణా దుకాణానికి తీసుకెళ్లి మరీ కొనిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల కుటుంబంతో కలిసి యశ్‌ ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌లోని షిరాలీకి వెళ్లారు. అక్కడి చిత్రపుర మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన భార్య, కూతురు ఐస్‌క్యాండీ అడగడంతో దగ్గర్లో ఉన్న చిన్న దుకాణానికి వెళ్లారు. ఐస్‌ క్యాండీతో పాటు, కొన్ని చాక్లెట్లు కూడా కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు పంచుకోవడంతో అవి కాస్త వైరల్‌ అవుతున్నాయి. ‘ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో తినగలిగే అవకాశం, ఖరీదైన బహుమతులు కొనగలిగే సామర్థ్యం, విలాసవంతమైన సౌకర్యాలు పొందే అవకాశం ఉన్నా, యశ్‌ సింపుల్‌గా ఉన్నారు’ అంటూ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

యశ్‌కు తన కూతురంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ ప్రెస్‌మీట్‌లకు కూడా తన కూతురుని తీసుకువచ్చారు. సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో కుటుంబానికీ అంతే సమయం కేటాయిస్తారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతో సరదాగా గడపడానికి ప్రయత్నిస్తారు. బుల్లితెర నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన యశ్‌ కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్‌ ఇండియా హీరో అయ్యారు. ఆయన నటించిన ‘కేజీయఫ్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రూ.వందల కోట్ల వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం యశ్‌ ‘టాక్సిక్‌’ సినిమా చేస్తున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని