BRO: అందుకే ‘బ్రో’ టైటిల్‌ పెట్టాం.. ఎప్పటికీ మరిచిపోలేని సీన్‌ అదే: సాయిధరమ్‌ తేజ్‌

ఈ నెల 28న విడుదల కానున్న తన సినిమా ‘బ్రో’ ప్రచారంలో బిజీగా ఉన్నారు సాయిధరమ్‌ తేజ్‌. తాజాగా ఆయన మీమర్స్‌తో సంభాషించారు. 

Published : 26 Jul 2023 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) కథానాయికలు. బ్రహ్మానందం, రోహిణి, సుబ్బరాజు, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 28న సినిమా విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారంలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సాయిధరమ్‌ తేజ్‌, కేతిక శర్మ మీమర్స్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..

* ‘బ్రో’ అనే టైటిల్‌ పెట్టడానికి కారణమేంటి?

సాయిధరమ్‌ తేజ్‌: సినిమా అంతా మామయ్యను నేను ‘బ్రో’ అని పిలుస్తా. ఆయనా నన్ను అలానే పిలుస్తుంటారు. అందుకే అదే పేరుని టైటిల్‌గా ఖరారు చేశాం.

* ఏ సన్నివేశంలోనైనా మీ మామయ్యను మీరు డామినేట్‌ చేశాననుకున్నారా?

సాయిధరమ్‌ తేజ్‌: నటులెవ్వరూ ఇతరులను డామినేట్‌ చేయరు. ఎవరి పాత్రకు తగ్గట్టు వారు నటిస్తారు. గురువులా భావించే మావయ్యతో కలిసి తెరను పంచుకోవడమే గొప్ప.

* మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశం?

సాయిధరమ్‌ తేజ్‌: హీరోయిన్‌ (కేతిక శర్మ)తో బ్రేకప్‌ అయిన తర్వాత మద్యం తాగి మామయ్యతో బాధను పంచుకునే సన్నివేశం ఒకటుంది. అది నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఆ సీన్‌ ఎప్పటికీ మరిచిపోలేను.

* ట్రైలర్‌లో మీరు ప్రతి సీన్‌లో టైమ్‌ లేదని చెబుతూ కనిపించారు. నిజజీవితంలో ఎంతమంది అమ్మాయిలకు అలా చెప్పారు?

సాయిధరమ్‌ తేజ్‌: అమ్మాయిలకు టైమ్‌ లేదని చెప్పకూడదు. అది తప్పు (నవ్వుతూ).

* త్వరలో జరగనున్న ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌కి మీ అవసరం ఉంటే.. సినిమా పరిధిని దాటి వెళ్తారా?

సాయిధరమ్‌ తేజ్‌: ఈ విషయంపై మామయ్య మాతో (రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌) గతంలోనే చర్చించారు. ‘పూర్తిస్థాయిలో పనిచేయాలనుకుంటేనే రాజకీయాల్లోకి రండి. నాకు మద్దతు ఇవ్వడానికి రావడం కరెక్ట్‌కాదు. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారం మార్గం చూపగలిగేలా ఉంటేనే పాలిటిక్స్‌లోకి రావాలి’ అని చెప్పారు.

* ఈ సినిమాలో మీరు ఎలా కనిపిస్తారు? (కేతికనుద్దేశించి..)

కేతిక శర్మ: సాయిధరమ్‌ తేజ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌గా కనిపిస్తా. రియాలిటీ ఉన్న పాత్ర అది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని