Shaakuntalam movie review: రివ్యూ: శాకుంతలం
Shaakuntalam review: సమంత కీలక పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా ఎలా ఉందంటే?
Shaakuntalam movie review; చిత్రం: శాకుంతలం; నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్, గౌతమి, అల్లు అర్హ తదితరులు; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి; సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా; నిర్మాణ సంస్థ: గుణ టీమ్‌వర్క్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్; స్క్రీన్‌ప్లే దర్శకత్వం: గుణశేఖర్; విడుదల: 14-04-2023
గతేడాది ‘యశోద’తో బాక్సాఫీస్ ముందు సందడి చేసింది సమంత(Samantha). అయితే ఇది ఆమెకు మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఈ నేపథ్యంలోనే విజయమే లక్ష్యంగా ‘శాకుంతలం’(Shaakuntalam)తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఇది ఆమెకు తొలి పౌరాణిక చిత్రం. రుద్రమదేవి వంటి హిట్ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తీసుకొని.. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి గుణశేఖర్ (Guna sekhar) తెరకెక్కించిన చిత్రమిది. భారీ గ్రాఫిక్స్ హంగులతో త్రీడీలో రూపొందించిన సినిమా కావడం.. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఈ ప్రేమ కావ్యం తెరపై ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? (Shaakuntalam review) సమంత, గుణశేఖర్‌లకు విజయాన్ని అందించిందా?
కథేంటంటే: విశ్వామిత్రుని తపస్సును భగ్నం చేసేందుకు ఇంద్రుని ఆదేశానుసారం భూలోకాన అడుగిడుతుంది మేనక (మధుబాల). ఆమె తన అందచందాలతో విశ్వామిత్రుని తపస్సుకు భంగం కలిగించడమే కాక.. శారీకంగానూ ఆయనకు దగ్గరవుతుంది. ఫలితంగా ఓ ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అయితే నరుడి వల్ల కలిగిన ఆ సంతానానికి దేవలోకంలో ప్రవేశం లేదు. అందుకే ఆ పాపను భూలోకంలోనే వదిలి స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ చిన్నారిని ఓ పక్షుల గుంపు మాలినీ తీరాన ఉన్న కణ్వాశ్రమ ప్రాంతంలో వదిలి వెళ్లగా.. కణ్వ మహర్షి (సచిన్ ఖడేకర్) ఆ పాపను దైవ ప్రసాదంగా భావించి దత్తత తీసుకుంటాడు. శకుంతల అని పేరు పెట్టి.. కన్నబిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. ఒకానొక రోజు ఆ కణ్వాశ్రమానికి దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) విచ్చేస్తాడు. శకుంతల (సమంత) అందచందాలు, లావణ్యాన్ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. శకుంతల కూడా దుష్యంతుడి ప్రేమకు దాసోహమవుతుంది. ఇద్దరూ గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. (Shaakuntalam movie review) కొంతకాలం తర్వాత దుష్యంతుడు తన రాజ్యానికి బయలుదేరతాడు. త్వరలోనే తిరిగి వచ్చి.. రాచ మర్యాదలతో తనని రాజ్యానికి ఆహ్వానించి, మహారాణిగా ప్రజలకు పరిచయం చేస్తానని శకుంతలకు మాట ఇస్తాడు. ఆ సమయంలోనే తన గుర్తుగా ఓ ఉంగరం కూడా ఇస్తాడు. కొన్నాళ్లకు శకుంతల గర్భవతి అవుతుంది. ఓవైపు ఆమెకు నెలలు నిండుతున్నా.. దుష్యంతుడు ఎంతకీ తిరిగిరాడు. దీంతో శకుంతలనే దుష్యంత రాజ్యానికి పంపిస్తాడు కణ్వ మహర్షి. కానీ, అక్కడికి వెళ్లాక ఆమెకు ఊహించని పరాభవం ఎదురవుతుంది. కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన సంగతి తనకి గుర్తుంది కానీ.. శకుంతల ఎవరో తనకు తెలియదంటాడు దుష్యంతుడు. మరోవైపు ఆయనే తన భర్త అని చెప్పుకోవడానికి ఉన్న ఒకానొక్క ఆధారమైన ఉంగరాన్ని కూడా ఎక్కడో పోగొట్టుకుంటుంది శకుంతల. దీంతో నిండు సభలో ఆమె తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటుంది. మరి దుష్యంతుడు.. శకుంతలను మర్చిపోవడానికి కారణమేంటి?వీళ్లిద్దరూ తిరిగి ఎలా కలిశారు?(Shaakuntalam review) వీరు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్ బాబు)కి ఉన్న సంబంధం ఏంటి?దుష్యంతుడికి శకుంతలను దక్కకుండా చేయాలన్న అసుర మూక కాలానీముల ప్రయత్నాలు సఫలమయ్యాయా?లేదా? అసలు వీళ్లకు ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి?
ఎలా ఉందంటే: కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల - దుష్యంతుల ప్రేమకావ్యం అందరికీ సుపరిచితమే. మన భారతీయ సాహిత్యంలో ఉన్న ఓ అద్భుత ప్రేమకథగా దీనికి పేరుంది. దీనికే తనదైన శైలిలో కాస్త కల్పన జోడించి తెరపై ఓ అపురూప దృశ్య కావ్యంలా అందంగా ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేశారు గుణశేఖర్. (Shaakuntalam review) నిజానికి ఈతరానికి ఇలాంటి కథను అందించాలన్న గుణశేఖర్ ఆలోచన అభినందనీయమే. అయితే ఇలా బాగా సుపరిచితమైన కథల్ని.. రెండున్నర గంటల సినిమాగా ఆద్యంతం ఆకట్టకునేలా చెప్పడానికి ఎంతో నేర్పు కావాలి. ఎంత సాంకేతిక హంగులద్దినా.. కథలో వేగం.. బలమైన సంఘర్షణ లేకపోతే దర్శకుడి ప్రయత్నం వృథా ప్రయాసే అవుతుంది. గుణశేఖర్ శాకుంతలం దీనికి ఓ పెద్ద ఉదాహరణ. నిజానికి ఇలాంటి కథని గుణశేఖర్ లాంటి దర్శకుడు తీస్తున్నపుడు కచ్చితంగా అందులో వైవిధ్యం ఆశిస్తాం. కానీ, ఈ ప్రేమకావ్యాన్ని చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి.. తెరపై చూస్తున్నప్పుడు ఏమాత్రం కలగదు. (Shaakuntalam movie review) దీనికి నాసిరకమైన త్రీడీ హంగులు ఓ కారణమైతే.. నత్తనడకన సాగే కథనం, సంఘర్షణ లేమి మరో కారణం.
చిన్నారి శకుంతలను ఓ పక్షుల గుంపు కణ్వాశ్రమానికి తీసుకురావడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఆశ్రమ ప్రాంతం.. అందులోని జంతువులు, పక్షులతో శకుంతలకు ఉన్న అనుబంధాలు పరిచయం చేస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు గుణశేఖర్. దుష్యంతుడి పాత్ర పరిచయ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నా.. పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్ వల్ల ఆ ఎపిసోడ్ తేలిపోయినట్లనిపిస్తుంది. శకుంతలకు దుష్యంతుడు ఎదురుపడే సన్నివేశాల్ని చక్కగా తీర్చిదిద్దుకున్నారు గుణశేఖర్. కానీ, వాళ్లిద్దరూ ఒక్కటయ్యే క్రమంలో వారి మధ్య ఉన్న ప్రేమను, కెమిస్ట్రీని మనసులకు హత్తుకునేలా చూపించలేకపోయారు. దీంతో ప్రేక్షకులు ఆరంభం నుంచే వారి ప్రేమకథకు సరిగా కనెక్ట్ కాలేకపోతారు. (Shaakuntalam review) అయితే ఈ ప్రేమ కథ మధ్యలో వీలు చిక్కినప్పుడల్లా.. అసురజాతి కాలానీముల కథను, దుర్వాస మహర్షి కథను పరిచయం చేసే ప్రయత్నం చేశారు గుణశేఖర్. ఇవి ఈతరం ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి.
దుర్వాస మహర్షి ఎంట్రీ కథను ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది. (Shaakuntalam review) ఆయన ఎపిసోడ్‌తోనే విరామమిచ్చిన తీరు మెప్పిస్తుంది. దుష్యంతుడి రాజ్యానికి శకుంతల వెళ్లడం.. నిండు సభలో ఆమె అవమాన పడటం.. రాజ్య ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేయడం వంటి సన్నివేశాలతో ద్వితీయార్ధం ఆరంభం ఆసక్తికరంగా సాగుతుంది. కానీ, ఆ తర్వాత కథ కాస్త గాడి తప్పుతుంది. శకుంతల - దుష్యంతుడు తిరిగి ఎలా కలిశారన్న విషయాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేకపోయారు దర్శకుడు. ముగింపునకు ముందు కాలానీములతో దుష్యంతుడు తలపడే యాక్షన్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. పతాక సన్నివేశాల్లో భరతుడిగా అల్లు అర్హ ఎంట్రీ.. దుష్యంతుడితో ఆమె వాదన మాత్రం ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే: శకుంతల పాత్రకు న్యాయం చేసేందుకు సమంత శక్తివంచన లేకుండా శ్రమించింది. కానీ, ఆ పాత్ర ఆమెకెందుకో అంతగా నప్పలేదు. తన డబ్బింగ్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. భావోద్వేగభరిత సన్నివేశాల్ని మాత్రం తన అనుభవంతో పండించే ప్రయత్నం చేసింది సామ్. దుష్యంతుడి పాత్రకు తగ్గ రూపం దేవ్ మోహన్(Dev Mohan)లో ఉంది కానీ.. ఆయన నటన కృతకంగా అనిపిస్తుంది. నిజానికి ఆ పాత్రకు కాస్త ఫేం ఉన్న నటుడ్ని తీసుకొని ఉంటే సినిమాకు మార్కెట్ పరంగా కలిసొచ్చేది. (Shaakuntalam movie review) దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు (Mohan babu) నిండుదనం తెచ్చారు. ఆయన కనిపించేది కొద్దిసేపే అయినా అందరినీ ఆకట్టుకుంటారు. సచిన్, అనన్య, మధుబాల, జిషు సేన్ గుప్తా.. ఇలా తెరపై లెక్కకు మిక్కిలి పాత్రలు కనిపిస్తాయి. కానీ, ఏదీ గుర్తుంచుకునే స్థాయిలో ఉండదు. పతాక సన్నివేశాల్లో అల్లు అర్హ (Allu arha) నటన.. ఆమె పలికే సంభాషణలు ముచ్చటగొలుపుతాయి. అందరికీ తెలిసిన శాకుంతల - దుష్యంతుల ప్రేమ కథను తెరపై ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో గుణశేఖర్ ఆకట్టుకోలేకపోయారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సింది. మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సినిమాకి ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి.
బలాలు: + సమంత నటన; + మణిశర్మ సంగీతం; + విరామ, పతాక సన్నివేశాలు
బలహీనతలు: - నెమ్మదిగా సాగే కథనం; - తెరపై సంఘర్షణ లేని ప్రేమకథ
చివరిగా: అభిజ్ఞాన ‘శాకుంతలం’.. పెద్దగా ఆకట్టుకోని ‘సమంతలం’ (Shaakuntalam review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Train accident: గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
-
Crime News
Cyber Crime: రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి.. రూ.లక్ష కాజేశాడు!
-
World News
Imran Khan: రూ.1500 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇమ్రాన్‌ఖాన్
-
Crime News
Hyderabad: పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
-
India News
Amit Shah: మణిపుర్ కల్లోలం.. అమిత్ షా వార్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..?
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు