Oke Oka Jeevitham Review: రివ్యూ: ఒకే ఒక జీవితం

శర్వానంద్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఎలా ఉందంటే

Updated : 09 Sep 2022 11:48 IST

Oke Oka Jeevitham Review: చిత్రం: ఒకే ఒక జీవితం; నటీనటులు: శర్వానంద్‌, అమల, రీతూవర్మ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్‌; సినిమాటోగ్రఫీ: సుజిత్‌ సారంగ్‌; ఎడిటింగ్‌: శ్రీజిత్‌ సారంగ్‌; మాటలు: తరుణ్‌ భాస్కర్‌; నిర్మాత: ప్రకాశ్‌బాబు, ప్రభు; కథ, కథనం, దర్శకత్వం: శ్రీ కార్తిక్‌; విడుదల తేదీ: 9-9-2022

జీవితం ఒక్కటే.. ప్రతి రోజునీ అనుభ‌విస్తూ ముందుకు వెళ్లాలి. మంచి, చెడు, క‌ష్టం, న‌ష్టం.. ఇలా ఏదొచ్చినా స్వీక‌రించాలి. గ‌తం నుంచి పాఠాలు నేర్చుకొని అడుగు వేయ‌డ‌మే త‌ప్ప.. గ‌తంలోకి వెళ్లలేం, చేసిన త‌ప్పుని స‌రిదిద్దుకోలేం. భ‌విష్యత్తునూ ముందుగానే చూడ‌లేం. కానీ, జీవితంలో అలాంటి అవ‌కాశం కూడా ఉంటే? ఆ ఆలోచ‌న నుంచే టైమ్ మెషిన్‌ క‌థ‌లు పుట్టుకొస్తుంటాయి. భార‌తీయ తెర‌పై ఆవిష్కృత‌మైన మరో టైమ్ ట్రావెల్‌ క‌థే.. ‘ఒకే ఒక జీవితం’. శ‌ర్వానంద్‌, అమ‌ల న‌టించిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందే ప్రచార చిత్రాల‌తో ప్రేక్షకుల్లో ఆస‌క్తి రేకెత్తించింది. మ‌రి చిత్రం ఎలా ఉందో చూద్దాం..

క‌థేంటంటే: ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. చిన్నప్పట్నుంచీ క‌లిసి పెరిగిన వీళ్లు ఒకొక్కరూ ఒక్కో స‌మ‌స్యతో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. ఎవ‌రిలోనూ సంతృప్తి ఉండదు. ఈ ముగ్గురికీ పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. అతడు ఇర‌వ‌య్యేళ్లుగా టైమ్ మెషిన్‌ క‌నిపెట్టడం కోసం కష్టప‌డుతుంటాడు. చివ‌రికి తాను క‌నిపెట్టిన టైమ్ మెషిన్‌తో గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. మ‌రి వాళ్లు గ‌తంలోకి వెళ్లి ఏం చేశారు? త‌ప్పుల్ని స‌రిదిద్దుకున్నారా ? భ‌విష్యత్తుని గొప్పగా మార్చుకున్నారా? విధి వారికి ఏం చెప్పింద‌నేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: టైమ్ మెషిన్‌ క‌థ‌లు భార‌తీయ తెర‌కి కొత్త కాదు. వ‌ర్తమానంలో జ‌రుగుతున్న క‌థ‌ని గ‌తానికీ, భ‌విష్యత్తుకీ తీసుకెళుతూ ప్రేక్షకుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచుతుంటాయి. ‘ఆదిత్య 369’  మొద‌లుకొని ‘24’, ‘బింబిసార’.. ఇలా క్రమం త‌ప్పకుండా వ‌స్తూనే ఉన్నాయి. ఫాంట‌సీతో కూడిన ఈ క‌థ‌ల్లో ఓ ప్రత్యేక‌మైన మ్యాజిక్‌ ఉంటుంది. మిగ‌తా అన్ని జోన‌ర్లలాగా త‌ర‌చూ తెర‌పైకొచ్చే సినిమాలు మాత్రం కావివి. ప‌క్కా స్క్రిప్ట్‌, లాజిక్‌ల‌తో రూపొందించాల్సి ఉంటుంది. అరుదైన క‌థ‌లు కాబ‌ట్టి ఆ నేప‌థ్యంలో ఎప్పుడు సినిమాలు వ‌చ్చినా అవి ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆక‌ర్షిస్తుంటాయి. చ‌ర్చని లేవనెత్తుతుంటాయి. కాల ప్రయాణంతో కూడిన క‌థే అయినా ‘ఒకే ఒక జీవితం’ గ‌తంలో వ‌చ్చిన సినిమాల‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మ ప్రేమ‌తో ముడిపెట్టి ఈ క‌థ‌ని అల్లాడు ద‌ర్శకుడు. భావోద్వేగాల‌తో కూడిన ఈ నేప‌థ్యంలో క‌థ రాసుకోవడంలోనే ద‌ర్శకుడు స‌గం విజ‌యం సాధించాడు.  ఆది, శ్రీను, చైతూల పాత్రల‌ని ప‌రిచ‌యం చేస్తూ క‌థ‌లోకి తీసుకెళ్లిన ద‌ర్శకుడు.. మంచి ఫ‌న్ కూడా ఉండేలా స‌న్నివేశాల్ని రాసుకున్నాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ పాత్ర‌, ప్రియ‌ద‌ర్శి ల‌వ్ ట్రాక్ ఆక‌ట్టుకుంటుంది. విరామ స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఎవరూ ఊహించ‌ని విధంగా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో పూర్తిగా భావోద్వేగాలే ప్రధానంగా సాగుతుంది. అమ్మ ప్రేమ‌ని పొంద‌డం కోసం ప‌రిత‌పించే ఆది చుట్టూ సాగే ఆ స‌న్నివేశాలు హృద‌యాల్ని బ‌రువెక్కిస్తాయి. గ‌తంలోకి వెళ్లి త‌న అమ్మానాన్నలు, ఇల్లుని చూసుకోవ‌డం, అమ్మ చేతి వంట రుచి చూడటం వంటి స‌న్నివేశాలు మ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి. క‌థ‌లో విధి అంశాన్ని స్పృశించిన తీరు కూడా బాగుంది. అమ‌ల - శ‌ర్వానంద్ త‌మ న‌ట‌న‌తో క‌ట్టిప‌డేశారు. ప్రథమార్ధమంత వేగం ద్వితీయార్ధంలో లేక‌పోయినా, ఆ ప్రభావం పెద్దగా క‌నిపించ‌దు. టైమ్ మెషిన్ నేప‌థ్యంలో వ‌చ్చిన క‌థ‌ల్లో గుర్తుండిపోయే మ‌రో మంచి సినిమా ఇది.

ఎవ‌రెలా చేశారంటే: శ‌ర్వానంద్‌, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీళ్ల బాల్యాన్ని గుర్తు చేసే పాత్రల్లో నటించిన చిన్నారులు కూడా ఆకట్టుకున్నారు. శ‌ర్వానంద్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే స‌న్నివేశాల్లో తన‌లో ఎంత గొప్ప న‌టుడు ఉన్నాడో మ‌రోసారి చాటి చెప్పాడు. అమ‌ల త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించి న‌టించారు. చాలా రోజుల త‌ర్వాత ఆమె తెర‌పై ఓ బ‌ల‌మైన పాత్రలో క‌నిపించారు. ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇది. శ‌ర్వానంద్‌కి కూడా అంతే. రీతూవ‌ర్మ పాత్ర‌, ఆమె అభిన‌యం కూడా ఆక‌ట్టుకుంటుంది. నాజ‌ర్ త‌న‌కి అల‌వాటైన పాత్రలోనే క‌నిపించారు. సాంకేతికత విష‌యానికొస్తే ప్రతీ విభాగం చ‌క్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిచింది. ముఖ్యంగా సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు జేక్స్ బిజోయ్‌. సుజీత్ సారంగ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శకుడు శ్రీకార్తిక్‌ క‌థ‌ని తెరపైకి తీసుకొచ్చిన విధానంలోనూ ఓ ప్రత్యేక‌త క‌నిపించింది. నిర్మాణం బాగుంది.

బ‌లాలు
క‌థ‌, క‌థ‌నం
నటులు
మ‌న‌సుల్ని హ‌త్తుకునే భావోద్వేగాలు

బ‌ల‌హీన‌త‌లు
అక్కడ‌క్కడా వేగం త‌గ్గడం

చివ‌రిగా: మధురానుభవాల ప్రయాణం.. ‘ఒకే ఒక జీవితం’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని