తన మైనపు విగ్రహం చేయించుకున్న బాలు

దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన విగ్రహాన్ని ముందే తయారు చేయించుకున్నారు. తొలుత బాలు కోరిక మేరకు ఆయన తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ విగ్రహాలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌ వుడయార్‌ రూపొందించారు....

Updated : 31 Oct 2023 17:06 IST

కరోనా తర్వాత వస్తానన్నారు: శిల్పి

హైదరాబాద్‌: దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన విగ్రహాన్ని ముందే తయారు చేయించుకున్నారు. తొలుత బాలు కోరిక మేరకు ఆయన తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ విగ్రహాలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌  రూపొందించారు. నెల్లూరు జిల్లాలోని తన స్వగృహంలో విగ్రహాలను పెట్టాలని అనుకున్నారు. ఆ తర్వాత తన విగ్రహం కూడా రూపొందించమని శిల్పికి చెప్పారు. బాలు తన విగ్రహాన్ని చూసుకోవాలని ముచ్చటపడ్డారని, కానీ ఆ ఆశ తీరకుండానే కన్నుమూశారని శిల్పి మీడియాతో అన్నారు.

‘బాలు తండ్రి గారు కాలం చేసిన తర్వాత ఆయన విగ్రహం చేయాలని గాన గంధర్వుడు నా దగ్గరికి వచ్చారు. ఎనిమిది అడుగుల విగ్రహాన్ని తయారు చేశాం. దాన్ని నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర కస్తూర్బా కళా క్షేత్రంలో ఆవిష్కరించారు. ఆగస్టు 1న బాలు నాతో మాట్లాడారు. ‘నెల్లూరులో ఉన్న నా ఇంటిని వేద పాఠశాలకు ఇస్తున్నాను. అక్కడ మా తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టాలి, తయారు చేయండి’ అన్నారు. నేను కూడా వెంటనే తయారు చేశా. ఆగస్టులోనే ఆ విగ్రహాల్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఈ లోపు ఆయనకు కరోనా వైరస్‌ సోకింది’.

‘బాలుతో నాకు ఎనిమిదేళ్ల పరిచయం ఉంది. ఓ సారి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు తన విగ్రహం కూడా చేయమని అడిగారు. అప్పుడే ఫొటో షూట్‌ చేసి, నమూనా తయారు చేశాం. చాలా రోజుల క్రితమే మోడల్‌ను సిద్ధం చేశా.. ఈ మధ్య తుది మెరుగులు దిద్దా. జూన్‌ 4న ఆయన పుట్టినరోజు, ఆ రోజు జరిగే కార్యక్రమంలో విగ్రహాన్ని ఆయనకు ఇవ్వాలి అనుకున్నా. ఈ ఏడాది బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారాన్ని నాకు ఇవ్వాలి అనుకున్నారు. జనవరిలో అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవం వాయిదా పడింది. కరోనా తర్వాత ఇక్కడికి వచ్చి, విగ్రహం చూస్తానని  నాతో ఫోన్‌లో అన్నారు. కానీ ఇంతలో ఆయన లోకాన్ని వదిలివెళ్లిపోయారు. బాలు కోరిక మేరకు చెన్నైలోని ఆయన నివాసానికి విగ్రహాన్ని పంపిస్తాను’ అని శిల్పి  పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని