Sai Shivan: పాటల రచయితగా ప్రవేశించి.. దర్శకుడిగా మారి.. సాయి శివన్‌ ప్రయాణమిదీ!

‘గ్రంథాలయం’ సినిమాతో దర్శకుడిగా మారిన సాయి శివన్‌.. ప్రస్తుతం ‘వైరం’తో బిజీగా ఉన్నారు. మచిలీపట్నం వచ్చిన ఆయన్ను ‘న్యూస్‌టుడే’ పలకరించింది.

Published : 20 Apr 2023 21:49 IST

చిన్నాపురం (మచిలీపట్నం రూరల్‌): సాహిత్యంపై ఉన్న ఇష్టంతో సినీ రంగంలో ప్రవేశించాడతడు. ఓ వైపు పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూనే లక్ష్యంగా దిశగా సాగాడు. లిరిసిస్ట్‌గా అవకాశం వచ్చిందనే ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైంది. అతడు పనిచేసిన సినిమాలు విడుదలకాకపోవడంతో నిరాశ ఎదురైంది. అయినా సంకల్పం వీడకుండా మరో అడుగు ముందుకేసి దర్శకుడిగా మారాడు. ‘గ్రంథాలయం’తో సత్తా చాటి, ద్విభాషా చిత్రం ‘వైరం’తో బిజీగా ఉన్న ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు చిన్నాపురానికి చెందిన సాయి శివన్‌ జంపాన (Sai Shivan Jampana). ఇటీవల మచిలీపట్నం విచ్చేసిన ఆయన్ను ‘న్యూస్‌టుడే’ పలకరించింది.

* మీ కుటుంబ నేపథ్యమేంటి? సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన ఎలా వచ్చింది?

సాయిశివన్‌: నాన్న పేరు ఈశ్వరరావు. రైతు. అమ్మ వెంకటేశ్వరమ్మ.. గృహిణి. మాది సినీ నేపథ్య కుటుంబం కాదుగానీ మా తాత రామమూర్తి కళాకారుడు. ఆయన 400 నాటకాల్లో నటించారు. బాల్యం నుంచీ ఆయన ప్రభావం నాపై ఉంది. స్వయంగా పాటలు రాసి, పాడడం అంటే నాకు బాగా ఇష్టం. మచిలీపట్నంలో నేను చదివిన బాలసాయి డిగ్రీ కళాశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేవాణ్ని. అలా ఓ వేడుకలో నేను పాడిన పాట మా సంస్కృతం సర్‌కు నచ్చి, నన్ను మెచ్చుకున్నారు. నా ప్రతిభను సమాజం గుర్తిస్తుందనే నమ్మకం అప్పుడే కలిగింది. ‘నీ టాలెంట్‌కు నువ్వు సినిమా రంగంలో ఉండాలి’ అంటూ స్నేహితులు ప్రోత్సహించేవారు. కుటుంబం, మిత్రులు అందించిన సపోర్ట్‌తో చిత్ర రంగంలోకి అడుగుపెట్టా.

* సాహిత్యం, గానం అంటే ఇష్టమన్నారు కదా. దర్శకుడు కావాలని ఎప్పుడు అనుకున్నారు?

సాయిశివన్‌: పాటల రచయితగా స్థిరపడాలన్న లక్ష్యంతోనే 2010లో ఇండస్ట్రీలోకి వెళ్లా. అప్పుడు అక్కడ నాకెవరూ తెలియకపోవడంతో పరిచయాల కోసం నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగేవాణ్ని. ఆఫీస్‌బాయ్‌గా అయినా పని చేస్తానని అక్కడి వారిని అడిగేవాణ్ని. ఫలితంలేకపోవడంతో వేరేచోట పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ పొట్ట నింపుకున్నా. నా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఓ కో- ఆర్డినేటర్‌ ద్వారా కొంతమంది సినీ ప్రముఖులను పరిచయం చేసుకున్నా. క్రమక్రమంగా పాటలు రాయడం ప్రారంభించా. కొందరి వద్ద ఘోస్ట్‌ రైటర్‌గానూ పనిచేశా. నేను రాసిన పాటలు రికార్డు అయినా ఆయా సినిమాలు విడుదలకాకపోవడంతో నిరాశకు గురయ్యా. ‘ఇది కాదు మనం ఇంకేదో చేయాలి’ అనుకుంటూ ఉండగా దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందోనని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ముందడుగేసి.. అనుభవం కోసం ‘ఢమరుకం’, ‘గరుడవేగ’, ‘మహంకాళి’ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నా. ఆ తర్వాత నేనే కథలు రాసుకుని, దర్శకుడిగా సినిమా తీసేందుకు నిర్మాతల కోసం అన్వేషించేవాణ్ని. ఆ ప్రయత్నంలోనే నిర్మాత జె. మల్లికార్జున నాకు దర్శకుడిగా ఛాన్స్‌ ఇచ్చారు. అదే ‘వైరం’.

* మీ రెండో సినిమా ముందు విడుదలైంది. ఆ సంగతేంటి?

సాయిశివన్‌: ‘వైరం’ (Vairam)లో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన విన్ను మద్యపాటి తక్కువ బడ్జెట్‌తో రూపొందించగలిగే కథ ఏదైనా చెప్పమని అడగ్గా ‘గ్రంథాలయం’ (Grandhalayam) కాన్సెప్ట్‌ గురించి చెప్పా. విన్నుతో కలిసి ఫైనాన్స్‌ చేసిన పార్టనర్స్‌ కొవిడ్‌ సమయంలో ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. అప్పుడు వైష్ణవి శ్రీ క్రియేషన్స్ సంస్థ ముందుకొచ్చి సినిమాని నిర్మించింది. త్వరగా చిత్రీకరణ పూర్తవడంతో నా రెండో సినిమా అయిన ‘గ్రంథాలయం’ ముందుగా విడుదలైంది. ఈ ఏడాది మార్చి 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నిర్మాతకు ఆర్థికంగానూ సంతృప్తినిచ్చింది.

* కన్నడ నటులతో సినిమా తీసే అవకాశం ఎలా వచ్చింది?

సాయిశివన్‌: పోస్టర్‌ డిజైనర్‌ విక్రమ్‌ రమేశ్‌ సూచనతో కన్నడ నటుడు దేవరాజ్‌ కుమారులను ఓ రోజు కలిసి ‘వైరం’ కథ వినిపించా. అది వారికి నచ్చడంతో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపారు. చిరవగా.. దేవరాజ్‌ రెండో కుమారుడు ప్రణమ్‌ దేవరాజ్‌ (Pranam Devaraj), ‘కేజీయఫ్‌’ (KGF) విలన్‌గా గుర్తింపు పొందిన రామచంద్రరాజు ప్రధాన పాత్రలకు ఎంపికయ్యారు.

* తదుపరి ప్రాజెక్టుల వివరాలేంటి?

సాయిశివన్‌: సుడిగాలి సుధీర్, రష్మి కాంబినేషన్‌లో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. హీరో నానిని దృష్టిలో పెట్టుకుని కథ రాయడం పూర్తి చేశా. అనంత పద్మనాభస్వామి చరిత్ర ఆధారంగా స్టోరీ రాశా. ఇంకా నా దగ్గర సుమారు 50 స్టోరీలు సిద్ధంగా ఉన్నాయి.

* భవిష్యత్తుపై ఎలాంటి దృక్పథంతో ఉన్నారు?

సాయిశివన్‌: కష్టపడి పని చేస్తూ.. నిర్మాతకు నష్టం రానీయకుండా చూసుకోలానుకుంటున్నా. క్రేజ్‌ ఉన్న ఓ హీరోతోనైనా సినిమా తీసి హిట్‌ కొడితే చాలా అవకాశాలు వస్తాయి. దర్శకుడిగా రాణిస్తాననే నమ్మకం ఉంది. రాబోయే సినిమాలను మచిలీపట్నంలో షూటింగ్‌ చేయాలనే ఆలోచనతో ఉన్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని