Nagarjuna: అదే నాగార్జునలో మార్పు తీసుకొచ్చింది.. వారే ఈ స్థాయిలో నిలబెట్టింది: బర్త్‌డే స్పెషల్‌

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గురించి కొన్ని సంగతలు చూద్దాం..

Updated : 02 Sep 2023 19:04 IST

‘శివ’గా సైకిల్‌ చైన్‌ తెంచి, టాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ‘గీతాంజలి’తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. ‘అన్నమయ్య’గా భక్తిసాగరంలో ముంచారు. ‘గణేశ్‌’గా ‘మాస్‌’ పదానికి అసలైన అర్థాన్నిచ్చారు. ఇలా.. సుమారు 37 ఏళ్లుగా విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తున్న ఆ ‘కింగ్‌’ మరెవరో కాదు.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). మంగళవారం 64వ పుట్టినరోజు వేడుక చేసుకుంటున్న సందర్భంగా ఈ ‘గ్రీకువీరుడు’ గురించి కొన్ని విశేషాలు (Happy Birthday Nagarjuna)..

 • ఆరు పదుల వయసులోనూ ఎంతో ఫిట్‌నెస్‌తో కనిపిస్తూ, తన తనయులకు సోదరుడిలా పోటీనిస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు నాగార్జున. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం, వ్యాయామం చేయడం దానికి కారణమంటారాయన. ‘శివ’ (1989) సినిమా సమయం నుంచి నాగ్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. అయితే, రోజూ ఐస్‌క్రీమ్‌ లేదా స్వీట్‌ తప్పనిసరిగా తింటారు. అలా తినడం తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి అలవాటైందట.
 • తన బాల్యం చాలా సాధారణంగా గడిచిందని చెప్పే నాగార్జున.. ఆత్మసంతృప్తికి మించింది లేదంటారు. ‘‘మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది. సమస్య తొలగిపోయాక మనం దాన్ని గుర్తుచేసుకుని నవ్వుకొంటాం’ నాన్న చెప్పిన ఈ మాట నా మనసులో నాటుకుపోయింది. అందుకే జరిగిన దాని గురించి మరిచిపోయి జరగాల్సిన దాని గురించి నేను ఎక్కువగా  ఆలోచిస్తుంటా’ అని  ఓ సందర్భంలో చెప్పారు.
 • ఇక సినిమాల విషయానికొస్తే.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అలా తన సుదీర్ఘ ప్రస్థానంలో సుమారు 40 మంది కొత్త దర్శకులను టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ (శివ), వైవీఎస్‌ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), సూర్యకిరణ్, లారెన్స్‌ (మాస్‌) తదితరులు నాగ్‌ పరిచయం చేసిన వారే. ‘‘కొత్తవారు దర్శకత్వం వహిస్తే సినిమాకి కొత్తదనం వస్తుంది. గతంలో పోషించిన పాత్రల పేరు, దుస్తులు మార్చి ఏదో కొత్తగా చేశామని అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నూతన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంటా. ఆ క్రమంలో ఎదురుదెబ్బలు తిన్నా, విజయాల్నీ అందుకున్నా. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్‌ని అయ్యానంటే కారణం కొత్త దర్శకులే’’ అంటూ విజయాల క్రెడిట్‌ వారికే ఇస్తారు.
 • సుమారు 8 నెలల వయసులోనే నాగార్జున తెరపై సందడి చేశారు. ఆయన కనిపించిన తొలి సినిమా మరేదోకాదు ఏయన్నార్‌ హీరోగా తెరకెక్కిన ‘వెలుగు నీడలు’. దాని తర్వాత, ‘సుడిగుండాలు’తో బాల నటుడిగా మారారు. 1986లో ‘విక్రమ్‌’తో హీరోగా పరిచయమయ్యారు.
 • కమర్షియల్‌ చిత్రాల్లో రాణిస్తూనే ఆధ్యాత్మిక సినిమాల్లో (అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమో వేంకటేశాయ, శిరిడి సాయి, జగద్గురు ఆది శంకర) ఎక్కువగా నటించిన అతి తక్కువమంది అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. ‘అవకాశం వచ్చింది.. నటించాం’ అని కాకుండా భక్తిశ్రద్ధలతో ఆయా పాత్రలు పోషించేవారాయన. ‘అన్నమయ్య’లో అన్నమాచార్య పాత్ర పోషించిన సమయం నుంచీ వ్యక్తిగతంగా తనలో చాలా మార్పు వచ్చినట్లు చెబుతారు. ‘అవి ఎలాంటి మార్పులో మాటల్లో చెప్పలేనుగానీ.. అంతకుముందుతో పోలిస్తే పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో, వాటిని ఎదుర్కోవడంలో ఎంతో పరిణతి వచ్చింది’ అని చెప్పారు.
 • ‘త్రిమూర్తులు’, ‘రావుగారి ఇల్లు’, ‘ఘటోత్కచుడు’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘స్టైల్‌’, ‘తకిట తకిట’, ‘దొంగాట’, ‘అఖిల్‌’, ‘సైజ్‌జీరో’, ‘ప్రేమమ్‌’ సినిమాల్లో అతిథి పాత్రలు పోషించి, కనువిందు చేసిన నాగ్‌.. హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు. ‘ఒక్కడే దేవుడు’, ‘డిక్క డిక్క డుం డుం’, ‘కొత్త కొత్త భాష’, ‘లడ్డుండా’ పాటలతో గాయకుడిగా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’, ‘మన్మథుడు’, ‘ఉయ్యాలా జంపాల’వంటి హిట్‌ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
 • ఇతర హీరోలతో కలిసి నటించేందుకు నాగ్‌ ఆసక్తి చూపిస్తుంటారు. ఆ క్రమంలో వచ్చినవే.. కెప్టెన్‌ నాగార్జున, అరణ్య కాండ (రాజేంద్ర ప్రసాద్‌), కిరాయి దాదా, సిద్ధార్థ (కృష్ణంరాజు), ప్రేమయుద్ధం, అధిపతి (మోహన్‌బాబు), వారసుడు, రాముడొచ్చాడు (కృష్ణ), సీతారామరాజు (హరికృష్ణ), రావోయి చందమామ (జగపతిబాబు), కృష్ణార్జున (మంచు విష్ణు), ఊపిరి (కార్తి), దేవదాస్‌ (నాని).
 • తన కుటుంబంతో కలిసి నాగ్‌ నటించిన సినిమాలు: కలెక్టర్‌గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే, శ్రీరామదాసు (ఏయన్నార్‌తో కలిసి నటించిన చిత్రాలివి), స్నేహమంటే ఇదేరా (సుమంత్‌), మనం (నాగేశ్వరరావు, నాగచైతన్య, అఖిల్‌), బంగార్రాజు (నాగ చైతన్య). అటు తండ్రి, ఇటు తనయులతో కలిసి నటించిన అరుదైన అవకాశం తెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జునకే దక్కిందని చెప్పొచ్చు. ‘మనం’లో అక్కినేని మూడు తరాల హీరోలు కనిపించి, ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచారు.
 • ‘విక్రమ్‌’, ‘మనం’.. ఈ రెండూ మే 23నే విడుదలవ్వడం విశేషం. అందుకే ఆ తేదీ అంటే తనకెంతో ప్రత్యేకమంటారు నాగార్జున. నటుడు, నిర్మాతగా ఆయన 9 ‘నంది’ అవార్డులు అందుకున్నారు. నాగ్‌ నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో, ‘అన్నమయ్య’ స్పెషల్‌ మెన్షన్‌ కేటగిరీలో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాయి.
 • ‘బాస్‌’గా వెండితెరపైనే కాదు ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌గానూ బుల్లితెరపై తనదైన ముద్ర వేశారాయన. వరుసగా నాలుగు సీజన్ల (బిగ్‌బాస్‌ 3,4,5,6)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘ఓటీటీ బిగ్‌బాస్‌’లోనూ హోస్ట్‌గా సందడి చేశారు. త్వరలోనే ‘బిగ్‌బాస్‌ 7’తో అలరించనున్నారు. గతంలో, తాను నిర్మించిన ‘యువ’ అనే సీరియల్‌లో మెరిసి ఆకట్టుకున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే కార్యక్రమానికీ నాగ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
 • గతేడాది ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్‌’, ‘బ్రహ్మాస్త్ర 1’లతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున తాజాగా ‘నా సామిరంగ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ 98 సినిమాల్లో నటించిన నాగార్జున తన 99వ చిత్రాన్ని కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో చేస్తున్నారు. మరోవైపు, 100వ చిత్రానికీ రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమ అభిమాన హీరోని తెరపై చూసి చాలా కాలమైందనే లోటును ‘మన్మథుడు’ సినిమా తీర్చింది. నాగ్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రీ రిలీజ్‌ అయింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు