Oscars: ఆస్కార్‌ వేదిక ఎక్కనున్న తెలుగు కుర్రాళ్లు.. ‘నాటు నాటు’ గాయకుల నేపథ్యమిదే..!

 kaala bhairava- Rahul sipligunj: సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscars) వేడుకలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ ఈ ఏడాది ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అకాడమీ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది. దీంతో గాయకులు రాహుల్‌, కాలభైరవ.. ఆస్కార్‌ వేదికపై ఈ పాటను ఆలపించనున్నారు.

Updated : 02 Mar 2023 12:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకరు తన పాటతోనే ప్రేక్షకులకు కన్నీరు తెప్పించగలరు.. మరొకరు తన పాటతో స్టేజీపై ఉర్రూతలూగించగలరు. మరి అలాంటి నీరు-నిప్పు కలిస్తే ప్రపంచం మొత్తం వారి పాటకు చిందేయాల్సిందే. ఆ యువ గాయకులే కాలభైరవ (Kaala Bhairava) - రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోని ‘నాటు నాటు’(Naatu Naatu)తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ త్వరలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ (Oscars) వేదికగా లైవ్‌ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యువ గాయకులకు సంబంధించిన ఆసక్తికర విశేషాలపై ఓ లుక్కేయండి..!

కీరవాణి గారి అబ్బాయి..!

తొమ్మిదో తరగతిలోనే..!

కాలభైరవ (Kaala Bhairava).. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ సంగీత కెరటం. తండ్రి సంగీత దర్శకుడు కావడంతో చిన్నతనం నుంచే అతడికి సంగీతంపై మక్కువ ఏర్పడింది. తొమ్మిదో తరగతి పూర్తయ్యే సరికి మ్యూజిక్‌ కంపోజర్‌ కావాలని ఫిక్స్‌ అయ్యాడు. అలా కోరస్‌ పాడటం నేర్చుకుని.. సినిమాల్లోకి పరిచయమయ్యాడు. డిగ్రీ పూర్తి చేశాక సంగీతంపైనే దృష్టి పెట్టాడు.

తొలిపాట..! 

కల్యాణ్‌ మాలిక్‌ సారథ్యంలో ‘నాన్న’ సీరియల్‌ కోసం కాలభైరవ తొలిసారి పాట పాడాడు. అనంతరం, తండ్రి సంగీత దర్శకత్వంలో ‘యమదొంగ’ (Yamadonga) కోసం బిట్‌ సాంగ్‌ పాడాడు. ఆ సినిమా టైటిల్స్‌తోపాటు వచ్చే పాట ఆయనదే. తన బాబాయ్‌ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాలభైరవ(Kaala Bhairava) చిన్న పాత్రలో నటించారు కూడా.

‘దండాలయ్య’.. బ్రేక్‌ ఇచ్చింది..!

2010లో తన తండ్రి బృందంలో చేరిన కాలభైరవ.. ‘ఝుమ్మందినాదం’ కోసం మొదటిసారి కోరస్‌ ఆలపించాడు. అక్కడి నుంచి కీరవాణి సారథ్యంలో అన్ని ప్రాజెక్ట్‌లలోనూ భాగం అవుతూ.. ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ‘బాహుబలి -2’(Baahubali 2)లోని ‘దండాలయ్య’తో గాయకుడిగా మంచి బ్రేక్‌ అందుకున్నాడు. ఆ పాట విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో భైరవకు గుర్తింపు లభించింది. అదే సినిమాలో.. ‘దేవసేన’ ఫస్ట్‌లుక్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చింది కూడా ఇతడే. ఆ బీజీఎం విని రాజమౌళి సైతం మెచ్చుకున్నారు. ‘అరవింద సమేత వీర రాఘవ’లోని ‘పెనివిటి’, ‘బాహుబలి -2’లోని ‘ఒక ప్రాణం’, ‘తొలిప్రేమ’లోని టైటిల్‌ సాంగ్‌ పాటలు ఇతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే, కాలభైరవ కేవలం.. సింగర్‌గానే కాకుండా మ్యూజిక్‌ కంపోజర్‌గానూ వర్క్‌ చేశాడు. ‘మత్తు వదలరా’, ‘కలర్‌ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ చిత్రాలకు ఇతడే మ్యూజిక్‌ డైరెక్టర్‌.

‘‘కోరస్‌ సింగర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన నాటి నుంచి నన్ను కీరవాణి గారి అబ్బాయిగానే గుర్తిస్తున్నారు.  నాన్న పేరు కొంతవరకూ సహాయపడుతుంది. అది నేను కాదనను. నాన్న బ్యాక్‌గ్రౌండ్‌ వల్లే అన్ని అవకాశాలూ వచ్చాయంటే నమ్మను. ‘దండాలయ్యా’ తర్వాత కూడా నేను ఏడాది ఖాళీగానే ఉన్నా. వారసత్వం అనేది కొంతవరకే మనల్ని నిలబెడుతుంది. స్వయంకృషి లేకపోతే పోటీ ప్రపంచంలో ముందుకెళ్లడం చాలా కష్టం’’

- కాలభైరవ


ఊరమాస్‌ పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌..!

తండ్రి ప్రోత్సాహం..!

రాహుల్‌ (Rahul Sipligunj) చిన్నప్పుడు ఎక్కువగా తన తండ్రి షాప్‌లోనే ఉండేవాడు. ఆ సమయంలో సంగీతంపై అతడికి ఉన్న మక్కువను తండ్రి గుర్తించి.. సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అలా కెరీర్‌ ఆరంభంలో కొన్ని డబ్బింగ్‌ చిత్రాలకు కోరస్‌ పాడాడు.

తొలిపాట..!

రాహుల్‌ (Rahul Sipligunj) మొదటిసారి ‘నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి’, ‘జోష్‌’ చిత్రాల్లో పాటలు పాడాడు. ఆయా పాటలకు మంచి ఆదరణ లభించడంతో.. అప్పటివరకూ తాను ఆలపించిన కోరస్‌లన్నింటినీ సీడీగా చేసి కీరవాణి(Keeravani)కి వినిపించాడు. అలా కీరవాణి కోరస్‌ టీమ్‌లో భాగమై.. ‘ఈగ’, ‘దమ్ము’, ‘మర్యాద రామన్న’ సినిమాల కోసం పనిచేశాడు. ‘లై’లోని ‘బొమ్మోలే’, ‘రంగస్థలం’లోని ‘రంగా రంగా’ అనే పాటలకు విశేషణ ఆదరణ దక్కింది. వీటితోపాటు ప్రైవేటు ఆల్బమ్స్‌తోనూ ఇతడు యువతకు బాగా చేరువయ్యాడు. ‘బిగ్‌బాస్‌-3’ రియాల్టీ షోలో విజేతగా నిలిచి తెలుగువారి మన్ననలు అందుకున్నాడు. 

తొలిసారి మేకప్‌..!

2019లో విడుదలైన ‘రామ చక్కని సీత’లో అతిథి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘ప్రెజర్‌ కుక్కర్‌’లోనూ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ‘రంగమార్తాండ’ కోసం వర్క్‌ చేస్తున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాత్మికకు జోడీగా రాహుల్‌ కనిపించనున్నాడు.

‘‘బిగ్‌బాస్‌’ నుంచి వచ్చిన తర్వాత ప్రైవేటు ఆల్బమ్స్‌ చేస్తోన్న సమయంలో కీరవాణి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నాటు నాటు’ (Naatu Naatu) లిరిక్స్‌ ఇచ్చి పాడమని చెప్పారు. అయితే, ఇది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసమని ముందు నాకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత విషయం తెలిసి ఎంతో కంగారుపడ్డాను. కేవలం టెస్టింగ్‌ కోసమే అని చెప్పినప్పటికీ ఛాలెంజింగా తీసుకుని వర్క్‌ చేశా. అయితే, ఏడాది తర్వాత ఆ పాటను విడుదల చేసినప్పుడు.. సాంగ్‌ విని మా వాయిస్‌నే ఫైనల్‌ చేయడం ఆనందంగా అనిపించింది. ఇందులో నేను రామ్‌చరణ్‌ కోసం పాడగా.. కాలభైరవ ఎన్టీఆర్‌ కోసం గాత్రం అందించాడు. వర్క్‌ విషయంలో భైరవ నాకెంతో సాయం చేశాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడలోనూ ఈ పాట పాడాను. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఇలాంటి పాట పాడే అవకాశం రావడమే నాకొక పెద్ద ప్రశంస’’

- రాహుల్‌ సిప్లిగంజ్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు