Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
హీరో నాని ఊరమాస్ లుక్‌లో నటించిన చిత్రం ‘దసరా’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తనేలాంటి పాత్రలు పోషించాడు? నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభమైంది? అనే వివరాలివీ..
ఈ ఏడాది శ్రీరామనవమికి ‘దసరా’ (Dasara) సంబరాలు జరగనున్నాయి. ఆ రెండు పండగలకు సంబంధమేంటి? అని సందేహంలో ఉన్నారా?. వాటిల్లో.. ఒకటి రాముడి ఫెస్టివల్ అయితే ఇంకోటి సినిమా ఫెస్టివల్. ఆ దసరా మరేదో కాదు హీరో నాని (Nani) నటించిన చిత్రం. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నాని కెరీర్‌ను గమనిస్తే..
నటన వద్దనుకుని..
సినిమాలను ఇష్టపడే చాలామందికి నటుడుకావాలనే కోరిక ఉండడం సహజం. నాని కూడా అలానే మనసులో అనుకునేవాడు. వయసుతోపాటు హీరోకావాలనే తన ఆశా పెరిగింది. దాన్ని నెరవేర్చుకునేందుకు ఫొటో ఆల్బమ్ పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. చిన్న పాత్ర పోషించేందుకూ అవకాశం రాకపోవడం.. ఏవో మాయ మాటలు చెబుతూ పలువురు కో- డైరెక్టర్లు డబ్బులు తీసుకోవడంతో విసిగిపోయిన అతడు ‘ఆ నటన మనకొద్దు’ అనుకుంటూ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వైపు ఆసక్తి చూపాడు. ఈ రహస్యాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇటీవల రివీల్ చేసి, షాక్ ఇచ్చాడు. నటనకు బై చెప్పి.. ప్రముఖ దర్శకుడు దివంగత బాపు వద్ద క్లాప్ అస్టిస్టెంట్‌గా పనిలో చేరిన నాని ఆ తర్వాత ఇతర దర్శకుల చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కొన్నాళ్లు రేడియో జాకీ (ఆర్జే)గా అలరించాడనే సంగతి తెలిసిందే. నటనే వద్దు అనుకున్న నానిని ‘రాంబాబు’ పాత్ర వెతుక్కుంటూ వెళ్లింది. నేచురల్ యాక్టర్‌ని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. అదెలా అంటే?
అలా మొదలైంది..
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అష్టాచమ్మా’ (Ashta Chamma) చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్న రోజులవి. ఓ లీడ్ రోల్ కోసం అవసరాల శ్రీనివాస్ ఫిక్స్. ఇంకో మెయిన్ క్యారెక్టర్‌కి ఎవరిని తీసుకోవాలి? అనే దర్శకుడి అన్వేషణలో భాగంగా నాని కనిపించాడు. సంబంధిత పాత్రకు ఆడిషన్స్ ఇచ్చేందుకు వచ్చిన వారికి ఎలా యాక్ట్ చేయాలో నాని చెబుతుంటే.. ఆ హావభావాలు నచ్చడంతో ఆయన్నే హీరోగా నటించమన్నారట ఆ సినిమా డైరెక్టర్. అలా రాంబాబు/మహేశ్ పాత్ర కోసం నాని తొలిసారి మేకప్ వేసుకున్నాడు. పల్లెటూరిలో రాంబాబుగా, సిటీలో మహేశ్‌గా.. రెండు పార్వ్శాలను చూపించి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ఏమైందంటే?
భలే భలే మగాడివోయ్‌కి ముందు.. ఆ తర్వాత
నాని కెరీర్ గురించి చెప్పాలంటే ‘భలే భలే మగాడివోయ్’ (Bhale Bhale Magadivoy)కి ముందు.. ఆ తర్వాత అనే చెప్పాలి. ‘అష్టాచమ్మా’ తర్వాత అతడు నటించిన ‘రైడ్’, ‘స్నేహితుడా’ సినిమాలు ఓకే ఏడాది విడుదలై, ఫర్వాలేదనిపించాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ‘భీమిలి’ నానిలోని సహజ నటుణ్ని చూపించింది. అందులో ఆయన అమాయకత్వం ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంది. దాని తర్వాత వచ్చిన ‘అలా మొదలైంది’తో హిట్ అందుకుని.. ‘వెప్పం’ (తెలుగులో సెగ)తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అది ఆకట్టుకోలేదనే నిరాశలో అభిమానులు ఉండగా.. ‘పిల్ల జమీందార్’ రూపంలో మంచి వినోదం పంచాడు. ‘ఈగ’తో విశేష క్రేజ్ సంపాదించాడు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’తో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. 2014లో అసలు కథ మొదలైంది. ఆ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన నాని నటించిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందాయి. అవే ‘పైసా’, ‘ఆహా కల్యాణం’. 2015 మార్చి 21న విడుదలైన ‘జెండాపై కపిరాజు’ కూడా మెప్పించలేకపోయింది. మరో సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అదే రోజు విడుదలకావడం విశేషం. ‘ఇక నాని పని అయిపోంది’ అని భావించిన వారందరికీ ఈ సినిమా కొంత ఊరట కలిగించినా.. ఒక్కసారిగా వచ్చి పడిన ఫ్లాపుల మరకను అది తుడిచేయలేకపోయింది. దాన్నుంచి అతడిని బయటపడేసి, ‘ఇక నానికి తిరుగులేదు’ అని అనిపించిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. ఈ సినిమాతోనే తెరపై నాని పేరుకు ముందు ‘నేచురల్ స్టార్’ ట్యాగ్‌లైన్ వేయడం ప్రారంభమైంది.
ఆ చిత్రంతో నాని కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి వైవిధ్యభరిత కథలు/పాత్రలను మరింత జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ తనదైన శైలిలో సాగుతున్నాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్‌మెన్’, ‘మజ్ను’, ‘నేను లోకల్’ (Nenu Local), ‘నిన్నుకోరి’ (Ninnu Kori), ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవ్‌దాస్’, ‘జెర్సీ’ (Jersy), ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’, ‘వి’ (V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadeesh), ‘శ్యామ్‌సింగరాయ్’ (Shyam Singha Roy), ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki).. ఇవన్నీ అలా వచ్చినవే. వీటిల్లో కొన్ని కథలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయేమోగానీ నాని పోషించిన పాత్రలు మాత్రం కాదని చెప్పొచ్చు.
ప్రతిదీ ప్రత్యేకమే..
తొలి సినిమాలోనే రెండు పార్శ్వాలున్నపాత్ర పోషించి ఆకట్టుకున్న నాని.. ‘భీమిలి’లోని గ్రామీణ యువకుడు సూరిబాబు పాత్రలో ఒదిగిన తీరు అద్భుతం. నెగెటివ్ ఛాయలున్న పాత్రలకూ న్యాయం చేస్తాడనేందుకు ‘జెండాపై కపిరాజు’, ‘జెంటిల్‌మెన్’, ‘వి’ చిత్రాలే నిదర్శనం. ఓ వైపు ‘సుందర్’ వంటి రొమాంటిక్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు ‘శ్యామ్‌సింగరాయ్’లాంటి పవర్‌ఫుల్ పాత్రలు పోషించి నటుడిగా వైవిధ్యానికి అర్థం చెప్పాడు. ‘జెర్సీ’లో తండ్రిగా కనిపించి, హీరోయిజాన్ని కొత్తగా ప్రదర్శించాడు. కళ్లు చెదిరే స్టెప్పులు వేయకపోయినా.. భారీ డైలాగులు పేల్చకపోయినా.. సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించకపోయినా.. హీరోగా విజయాలు అందుకోవచ్చని నిరూపించి, ఎందరో వర్ధమాన నటులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు నటించిన 28 చిత్రాల్లోని పాత్రలకు పూర్తి భిన్నంగా 29వ సినిమా ‘దసరా’ కోసం మాస్ లుక్ ప్రయత్నించాడు.
ఇది వేరే మాస్..
‘దసరా’ను అందరూ ఊరమాస్, వీరమాస్ అని అంటుంటే నాని మాత్రం దాన్ని మనసుని హత్తుకునే మాస్ అంటున్నాడు. ప్రేక్షకులు భావోద్వేగంతో విజిల్స్ వేస్తారంటూ ఆసక్తి పెంచుతున్నాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందిందీ చిత్రం. కీర్తిసురేశ్ కథానాయిక. నాని.. ధరణి పాత్రలో నటించగా వెన్నెలగా కీర్తి కనిపించనుంది. ఇప్పటికే పోస్టర్లు, ప్రచార చిత్రాలను చూస్తే ‘అష్టా చమ్మాలోని ఆ రాంబాబేనా.. ఈ వైలెంట్ ధరణి?’ అని అనిపించకమానదు. ఈ ధరణి కథ తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్.. అదే మా లక్ష్యం: ప్రధాని మోదీ
-
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
-
Flipkart: బిగ్ బిలియన్ సేల్‌లో నథింగ్ ఫోన్, పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్
-
Ott Movies This week: ఓటీటీలో ఈ వారం సందడే సందడి.. ఏయే చిత్రాలొస్తున్నాయంటే?
-
Justin Trudeau: ట్రూడో సార్ గుర్తుందా.. ‘మీరు ఇది చదవాలనుకోరు’..!
-
2018 Movie: భారత్ నుంచి ఆస్కార్ అధికారిక ఎంట్రీ మలయాళ బ్లాక్‌బస్టర్ ‘2018’!