RRR: 4 ఏళ్లు.. రూ. 400 కోట్లు.. ‘RRR’ ఆ ఒక్క ఫొటోతో మొదలై..!

సినీ ప్రేక్షకలోకం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) అతి త్వరలోనే విడుదలకానుంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది.

Updated : 21 Mar 2022 11:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రేక్షకలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతుంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం ఒక్క ఫొటోతో ప్రారంభమై, దాదాపు 4 ఏళ్ల ప్రయాణం సాగించింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా మొదలైందంటే..

ఎవ్వరూ ఊహించని చిత్రం

అది 2017 నవంబరు 18. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి తన ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. క్యాప్షన్‌ ఏం పెట్టకుండా కొన్ని డాట్స్‌ (...), ఓ ఎమోజీని జతచేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. ‘ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా వస్తుంది’ అని కొందరు, ‘ఇద్దరు హీరోలతో రాజమౌళికి పరిచయం ఉంది కాబట్టి సరదాగా కలిశారు’ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. అసలు విషయం తెలియడానికి కొంత సమయం పట్టింది. ఎవ్వరూ ఊహించని ఈ చిత్రం అప్పట్లో వైరల్‌ అయింది. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ ఈ ఫొటోపై స్పందించారు. రామ్‌చరణ్‌ తానూ రాజమౌళి ఆహ్వానం మేరకు వారింటికి వెళ్లామని, ఈ సినిమా కథ వినకుండానే ఆ ఫొటో దిగామని, ఆ తర్వాత కథ విని, కాఫీ తాగామని తెలిపారు. అలా ఈ ఫొటోతో ‘కథ’ మొదలైంది.


టైటిల్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌

2018 మార్చి 22న ఉత్కంఠ వీడింది. ‘రాజమౌళి (Rajamouli), రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) కలిసి పనిచేస్తున్నారు’ అనే అధికారిక ప్రకటన వెలువడింది. ముగ్గురు పేర్లలోని Rను కామన్‌గా తీసుకొని చిత్ర బృందం #RRR అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసింది. ఇది టైటిల్‌ కాదని, జస్ట్‌ వర్కింగ్‌ టైటిల్‌ అని పేర్కొంది. ఏడాది అనంతరం, 2019 మార్చి 18న ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని వచ్చేలా ఆసక్తికర పేరును మాతో పంచుకోండి. దాన్నే టైటిల్‌గా ఖరారు చేస్తాం’ అని ప్రేక్షకులను కోరింది. ఈ ప్రక్రియకు అనూహ్య స్పందన లభించింది. వాటిల్లోని ఓ పేరు 2020 మార్చి 25న సినిమా టైటిల్‌గా మారింది. అదే ‘రౌద్రం రణం రుధిరం’. (Rise Roar Revolt) టైటిల్‌ ఫిక్స్‌ అయిన రోజే (మార్చి 25) సినిమా విడుదలవుతుండటం విశేషం.


అప్పుడలా మొదలైంది..

యావత్‌ సినీ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని పెంచిన ఈ మల్టీస్టారర్‌ 2018 నవంబరు 11న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నటులు చిరంజీవి, ప్రభాస్‌, రానా, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, వి. వి. వినాయక్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇదే రోజు సాంకేతిక బృంద వివరాలు బయటకు వచ్చాయి. ఓ యాక్షన్‌ సన్నివేశంతో నవంబరు 19 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌, గుజరాత్‌, పుణె, ఉక్రెయిన్‌ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు.


ఇదీ నేపథ్యం..

ఇద్దరు అగ్ర హీరోలు కలిసి పనిచేస్తున్నారనగానే అందరి చూపు కథ వైపే ఉంటుంది. సినిమా ఏ నేపథ్యంలో సాగుతుంది? ఎవరు ఎలా కనిపిస్తారు? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించిన ఆ సందేహాలకు 2019 మార్చి 14న చిత్ర బృందం సమాధానాలిచ్చింది. ఇదే రోజు తొలిసారి ‘ప్రెస్‌ మీట్‌’ నిర్వహించి, సినిమా ఎలా ఉండబోతుందో కాస్త రుచి చూపించింది.

బ్రిటీష్ వారిని గడగడలాడించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామారాజు, నిజాంపై పోరు జరిపిన గోండు వీరుడు కొమురం భీమ్‌ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఫిక్షనల్‌ స్టోరీ అని, బాలీవుడ్‌ నటులు అజయ్‌దేవ్‌గణ్‌, అలియాభట్‌, తమిళ దర్శకనటుడు సముద్రఖని నటిస్తున్నారని తెలిసింది. తర్వాత ఇదే రోజు.. 2020 జులై 30న ఈ సినిమా విడుదలవుతుందనే ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌, విలన్‌ పాత్రల్లో రే స్టీవెన్‌సన్‌, అలిసన్‌ డూడీ నటిస్తున్నారని 2019 నవంబరు 19న చిత్ర బృందం తెలియజేసింది.


రికార్డు స్థాయిలో..

ఈ సినిమాలోని నాయకానాయికల ఫస్ట్‌లుక్‌లతోపాటు చిత్రీకరణకు సంబంధించిన ప్రతి ఫొటో వైరల్‌గా మారింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో వీడియో రూపంలో చూడాలనుకున్న వారి ఆసక్తికి 2020 మార్చి 27న తెరపడింది. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి వీడియో ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ అందరినీ కట్టిపడేసింది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్‌చరణ్‌ కనిపించడం, ఆయన పోరాట పటిమ గురించి ఎన్టీఆర్‌ (కొమురం భీమ్‌) చెప్పడంతో ఈ వీడియో విడుదలైన అనతి కాలంలోనే కోట్ల వ్యూస్‌ సాధించింది. ఆ తర్వాత విడుదలైన ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ వీడియో, ‘దోస్తీ’, ‘నాటు నాటు’ తదితర పాటలు, ట్రైలర్‌.. ఇలా ప్రతిదీ నెట్టింట రికార్డు సృష్టించింది.


విడుదల తేదీ మారుతూ..

అనుకున్న సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తవకపోవడంతో చిత్ర బృందం ముందుగా ప్రకటించిన విడుదల తేదీని మారుస్తున్నట్టు 2020 ఫిబ్రవరి 5న ప్రకటించింది. ఈ సినిమాని 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కానీ, కొవిడ్‌/లాక్‌డౌన్‌ కారణంగా సాధ్యపడలేదు. 2021 అక్టోబరు 13కు ఈ చిత్రం వాయిదా పడింది. ‘ఎట్టకేలకు వచ్చేస్తుంది’ అని అందరూ భావించగా మరోసారి పోస్ట్‌పోన్‌ అయింది. 2022 జనవరి 7న విడుదలకు సిద్ధమవగా కరోనా థర్డ్‌వేవ్‌ అడ్డంకిగా మారింది. ఓ వైపు కొవిడ్‌ ఆంక్షలు, మరోవైపు థియేటర్లలో 50 శాతం సీటింగ్‌ కెపాసిటీ ఉండటంతో ఈ భారీ బడ్జెట్‌ చిత్రం మరోసారి వాయిదాపడక తప్పలేదు. తర్వాత, పరిస్థితులు చక్కబడితే ‘2022 మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న విడుదల చేస్తాం’ అని ప్రకటించిన చిత్ర బృందం అనూహ్యంగా మార్చి 25వ తేదీని ఎంపిక చేసుకుంది.


ఈ ప్రయాణంలో..

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళితోసహా చిత్ర బృందంలోని పలువురు కొవిడ్‌ బారినపడ్డారు. వ్యాయామం చేస్తుండగా రామ్‌చరణ్‌కు గాయమైంది. దాంతో యాక్షన్‌ సన్నివేశాల షెడ్యూల్‌ కొన్ని వారాలపాటు వాయిదా పడింది. ‘దోస్తీ’ పాటను రచించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్ర బందాన్ని కలచివేసింది. ఇలా ఎన్నో సవాళ్లు దాటుకొని.. నిప్పు (రామ్‌చరణ్‌), నీరు (ఎన్టీఆర్‌) ‘దోస్తీ’ని ప్రేక్షకులకు చూపించబోతుంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని