Sree Leela: బాలకృష్ణకు ఇదెలా తెలిసిందని ఆశ్చర్యపోయా!: శ్రీలీల

ఇటీవల ‘స్కంద’తో ప్రేక్షకులను పలకరించిన శ్రీలీల త్వరలో ‘భగవంత్‌ కేసరి’తో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో పలు విశేషాలు పంచుకుంది.

Published : 13 Oct 2023 19:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుని టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా నిలిచింది యువ నటి శ్రీలీల (Sreeleela). ఓ వైపు కథానాయకులతో ఆడిపాడుతూనే మరోవైపు ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari)లో బాలకృష్ణకు కుమార్తెగా నటించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ (Kajal Aggarwal) కథానాయిక. యాక్షన్‌ కామెడీ-డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీలీల హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది. ఆ సంగతులివీ..

మహేశ్‌ బాబుతో మరో సినిమా.. ఆ పోస్ట్‌కు నేను షాకయ్యా: అనిల్‌ రావిపూడి

సెట్స్‌లో బాలకృష్ణను మొదటిసారి చూడగానే మీ రియాక్షన్ ఏంటి?

శ్రీలీల: ఆర్మీ శిక్షణ నేపథ్యంలో సాగే సన్నివేశం ఈ సినిమా తొలి షాట్‌. నేను పుషప్స్‌ చేయలేకపోతుంటే.. ఆయన పట్టుబట్టి చేయిస్తుంటారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత నిజంగా నీకు పుషప్స్‌ చేయడం రాదా? అని బాలకృష్ణ అడిగారు. దర్శకుడే అలా చేయమన్నారని సమాధానమిచ్చా (నవ్వుతూ). బాలకృష్ణని తొలిసారి చూడగానే భయమేసింది. అయితే ఆయన్ను కలిసి మాట్లాడగానే టెన్షన్‌ అంతా మాయమైపోయింది. చిన్న పిల్లాడి మనస్తత్వం ఆయనది. స్వీట్‌ పర్సన్‌.

భగవంత్ కేసరి కుమార్తెగా నటించడం ఎలా అనిపించింది?

శ్రీలీల: గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలు ఉంటాయి. కానీ, భావోద్వేగంతో కూడిన, నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి వాటిలో ‘భగవంత్ కేసరి’ ఒకటి. ఈ కథ వినగానే నాకు బాగా నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే సినిమా ఇది. ఇప్పుడీ అవకాశాన్ని వదులుకుంటే భవిష్యత్తులో మళ్లీ రాదేమో అనిపించింది. శ్రీలీల అనగానే ఎక్కువ మంది ప్రేక్షకులకు డ్యాన్స్ గుర్తొస్తుంది. ఇది ఆనందించదగ్గ విషయమే అయినా నటనపరంగానూ అదే స్థాయిలో మెప్పుపొందాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలోని భగవంత్‌ కేసరి కుమార్తె పాత్రతో నా కల నెరవేరుతుందని ఆశిస్తున్నా.

నటనపరంగా బాలకృష్ణ ఏవైనా సలహాలు ఇచ్చారా?

శ్రీలీల: నటుడిగా బాలకృష్ణకు అపార అనుభవం ఉంది. సినిమాతోపాటు ఇతర రంగాలపై ఆయనకి పరిజ్ఞానం ఉంది. నేను మెడిసన్ పరీక్ష రాసి వచ్చిన తర్వాత అందులోని విషయాలపై ఆయన లోతుగా విశ్లేషించేవారు. ‘ఈయన వైద్య విద్య చదవలేదు కదా! ఇదెలా తెలిసింది’ అని ఆశ్చర్యపోయేదాన్ని. షూటింగ్ సమయంలో ఎన్నో విషయాలు పంచుకునేవారు. ఏ భావోద్వేగాన్ని ఎలా పలికించాలి? ఏ సంభాషణ ఎలా చెప్పాలి? తదితర విషయాల్లో సలహాలు ఇచ్చేవారు.

కాజల్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

శ్రీలీల: కాజల్.. బ్యూటీ విత్ బ్రెయిన్. మంచి నటి. ఆమె టైమింగ్ అద్భుతం. నాకు కొత్త విషయాలెన్నో నేర్పారు. కాజల్‌తో కలిసి నటించడం అందమైన జ్ఞాపకం.

ఈ సినిమాలో మీకు సవాల్‌ విసిరిన సీన్‌?

శ్రీలీల: ఒక్క సన్నివేశం అని కాదు ఈ సినిమా మొతాన్ని సవాల్‌గా తీసుకున్నా. ఓ ఆర్టిస్ట్‌గా నన్ను నేను పరీక్షించుకునే సమయం, సందర్భం ఇదే. నేనిందులో పోషించిన విజ్జి పాప పాత్ర మనసుకు బాగా దగ్గరైంది. ఈ పాత్ర కచ్చితంగా నన్ను మరింత ముందుకు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. ఇందులో తండ్రీ కూతుర్ల ఎమోషన్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణను చిచ్చా అని పిలుస్తా. నిజ జీవితంలో నా చిచ్చా అమ్మ. ధైర్యంగా ఉండమని భగవంత్‌ కేసరి సినిమాలో చెప్పినట్లే చిన్నప్పుడు అమ్మ నాకు ధైర్యం నూరిపోసేది. అందుకే ఈ కథతో బాగా కనెక్ట్ అయిపోయా.

తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తుండడం ఎలా అనిపిస్తోంది?

శ్రీలీల: చాలా ఆనందంగా ఉంది. భగవంతుడికి, నాకు తొలి అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావుకు, నాపై నమ్మకం ఉంచిన ప్రతి దర్శకుడికి కృతజ్ఞతలు. తీరిక లేకుండా చిత్రీకరణలో పాల్గొంటున్నా. ఇన్ని సినిమాల్లో ఒకేసారి నటిస్తుండడాన్ని బాధ్యతగా భావిస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని