‘ఏమాయ చేసావె’ కోసం మలయాళంతో కుస్తీ

వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లోముందుకు సాగుతున్న యువ కథానాయకుడు

Updated : 29 Nov 2020 15:48 IST

ఇంటర్నెట్‌డెస్క్: వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లోముందుకు సాగుతున్న యువ కథానాయకుడు సుధీర్‌బాబు. ‘ఎస్‌.ఎమ్‌.ఎస్‌.’ చిత్రంలో వెండితెరకు పరిచయమైన ఆయనకు అంతకుముందే సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా చేయలేదట. దాని వెనుక కారణాన్ని ఓ సందర్భంలో పంచుకున్నారిలా..!

‘‘సినిమాని కెరీర్‌గా ఎంచుకోవాలనే ఆలోచన లేని సమయంలోనే కొన్ని అవకాశాలు వచ్చాయి. అప్పుడు నేను కాలేజీకి వెళుతున్నా. ఒక సినిమా మొదలైంది కూడా. అది కార్యరూపం దాల్చలేదు. సినిమాపై అవగాహన పెంచుకుని, నేను నటించాలనుకొని చేసిన సినిమా... ‘ఏమాయ చేసావె’. హీరోగా చేసిన తొలి సినిమా ‘ఎస్‌.ఎమ్‌.ఎస్‌’. ‘ఏమాయ చేసావె’లోని నా తొలి సన్నివేశాన్ని సమంతతో కలిసి చేశా. అయితే ఆ సన్నివేశంలో సంభాషణ లేదు. మాంటేజ్‌ షాట్‌గా బయట ఏదో మాట్లాడుకునేలా కనిపించే సన్నివేశం అది.  దూరంలో ఒక కెమెరా పెట్టి తీశారు. ఆ సన్నివేశం తర్వాత సమంత ‘ఇది మీకు తొలి షాటా’ అని అడిగింది’’

‘‘అందులోనే డైలాగ్‌తో కూడిన సన్నివేశాన్ని కేరళలో చిత్రీకరణ చేశారు. రెండు పేజీల సంభాషణ అది. ఒక పేజీ నిండా మలయాళం సంభాషణలే ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాక్టీస్‌ చేశాను. కెమెరా ముందుకు వెళ్లేసరికి... మలయాళం చెబితే హావభావాలు వచ్చేవి కావు, హావభావాలపై దృష్టి పెడితే మలయాళం వచ్చేది కాదు. నా పరిస్థితిని గమనించి ‘పర్వాలేదు, నువ్వు ఇంగ్లిష్‌లో చెప్పేయ్‌’ అన్నారు దర్శకుడు గౌతమ్‌ మేనన్‌. ఇంతగా ప్రాక్టీస్‌ చేశాను కదా అని నేను కష్టపడి చేశా. గౌతమ్‌ మేనన్‌కి నచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత కూడా ఆ సంభాషణలు అనుకుంటూనే ఉండేవాణ్ని. ఇప్పుడు ఆ సినిమా కోసం సెట్స్‌పై గడిపిన క్షణాలు గుర్తున్నాయి’’ అని తన తొలి నటనా అనుభవాలను గుర్తు చేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని