Teja Sajja: వయసు 28 ఏళ్లు.. నటనానుభవం 25 ఏళ్లు: ‘చూడాలని ఉంది’పై తేజ సజ్జా నోట్‌

బాల నటుడిగా తెరంగేట్రం చేసి హీరోగా రాణిస్తున్న నటుడు తేజ సజ్జా. తన తొలి చిత్రం ‘చూడాలని ఉంది’ విడుదలై 25 ఏళ్లైన సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ పెట్టాడు.

Published : 27 Aug 2023 19:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నా వయసు 28 ఏళ్లు. నట ప్రస్థానానికి 25 ఏళ్లు’ అని సరదాగా పేర్కొన్నాడు తేజ సజ్జా (Teja Sajja). తాను మూడేళ్ల వయసులోనే ‘చూడాలని ఉంది’ (Choodalani Vundi) చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు. ఈ సందర్భంగా అతడు సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ నోట్‌ పెట్టాడు. నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ తనకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలు, హీరోకి కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘ఊహ తెలియని సమయంలోనే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టా. తొలి సినిమాలోనే లెజెండ్‌ అయిన చిరంజీవితో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. అక్కడ నుంచి ఇప్పటి నా కొత్త చిత్రం ‘హనుమాన్’ వరకు సాగిన ప్రయాణాన్ని చూస్తుంటే అంతా కలలా అనిపిస్తోంది. నేనిలా ఉన్నానంటే దానికి కారణం మీరే. గుణశేఖర్‌గారు, చిరంజీవిగారు, అశ్వనీదత్‌గారు.. మీరు నా జీవితాన్ని మార్చారు. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని నోట్‌లో రాశాడు (25Years For Choodalani Vundi).

డైలాగ్‌ లేకుండా చిరంజీవి సీన్‌.. ఆ మాటకు షాకైన అశ్వనీదత్‌

చిరంజీవి, సౌందర్య, అంజలా ఝవేరీ, ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం 1998 ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో చిరంజీవి కొడుకుగా నటించాడు తేజ. తన ముద్దుముద్దు మాటలతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాడు. ఈ సినిమా తర్వాత, ‘రాజకుమారుడు’, ‘కలిసుందాం.. రా’, ‘యువరాజు’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’, ‘వసంతం’, ‘ఠాగూర్‌’, ‘బాలు’ తదితర చిత్రాల్లో బాల నటుడిగా సందడి చేసిన తేజ ‘జాంబిరెడ్డి’తో హీరోగా మారాడు. తర్వాత, ‘ఇష్క్‌’, ‘అద్భుతం’తో అలరించి.. ఇప్పుడు ‘హనుమాన్‌’తో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. 11 భాషల్లో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని