Balagam ott date: ఓటీటీలో ‘బలగం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Balagam ott date: వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కీలక పాత్రల్లో నటించిన ‘బలగం’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 23 Mar 2023 15:22 IST

హైదరాబాద్‌: హాస్యనటుడు వేణు (Venu) దర్శకత్వంలో రూపొందిన ఫీల్‌గుడ్‌ మూవీ బలగం (balagam). ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, సినీ ప్రేక్షకులతో పాటు, విమర్శకులను సైతం మెప్పించింది. తెలంగాణ పల్లె జీవనాన్ని, మనుషుల మధ్య బంధాలను ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్‌లో విశేషంగా అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. (balagam ott release) ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సింప్లీ సౌత్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై మార్చి 24 తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సింప్లీ సౌత్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు.

క‌థేంటంటే: తెలంగాణలోని ఓ మారుమూల ప‌ల్లెలో జ‌రిగిన క‌థ ఇది. సాయిలు (ప్రియ‌ద‌ర్శి) ఓ నిరుద్యోగి.  ఉపాధి కోస‌మ‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ల‌క్ష‌లు అప్పు చేసి ఊళ్లో ఓ స్నూక‌ర్ బోర్డ్ పెడ‌తాడు. అది అత‌ని క‌ష్టాల్ని ఏమాత్రం గ‌ట్టెక్కించ‌క‌పోగా, అప్పుల ఒత్తిళ్లు అధిక‌మ‌వుతాయి. పెళ్లి చేసుకుంటే వ‌చ్చే క‌ట్నంతో అప్పులు తీర్చుకోవడ‌మే  త‌న ముందున్న ఏకైక మార్గంగా భావిస్తాడు.  పెళ్లి కూడా కుద‌ర‌డంతో అప్పుల వాళ్ల‌కి అదే విష‌యం చెబుతాడు. ఒక‌ప‌క్క నిశ్చితార్థం ప‌నులు జ‌రుగుతుండ‌గానే, తాత కొముర‌య్య చ‌నిపోతాడు. అది చాల‌ద‌న్న‌ట్టుగా  చావు ఇంట్లో మాటా మాటా పెరిగి కుదిరిన ఆ పెళ్లి కూడా పెటాకుల‌వుతుంది. దాంతో సాయిలు క‌ష్టాలు రెట్టింప‌వుతాయి. తాత మ‌ర‌ణంతో సూర‌త్‌లో ఉన్న బాబాయ్‌,  ఎప్పుడో ఇర‌వ‌య్యేళ్ల కింద‌ట దూర‌మైన మేన‌త్త‌, మేన‌మామ, వాళ్ల కూతురు సంధ్య (కావ్య క‌ళ్యాణ్‌రామ్‌) రావ‌డంతో ఒక‌ప‌క్క వాళ్ల మంచి చెడులు చూసుకుంటూనే తాత అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తాడు సాయిలు. కానీ ఆ త‌ర్వాతే అస‌లు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. (balagam ott release) చిన్న క‌ర్మ రోజున పెట్టిన పిండం తినేందుకు ఒక్క కాకి కూడా రాదు. దాంతో  కొముర‌య్య కొడుకు, అల్లుడి మ‌ధ్య గొడ‌వ మొద‌ల‌వుతుంది.  ఐదో రోజైనా కాకులొస్తాయ‌నుకుంటే ఆ రోజు కూడా అదే ప‌రిస్థితి.  దాంతో ఇంట్లో గొడ‌వ‌లు మ‌రింత‌గా ముదిరిపోతాయి. తాత మ‌న‌సులో బాధ ఉండ‌టంతోనే కాకులు రావ‌డం లేద‌ని, ఇది ఊరికే అరిష్టం అని పంచాయ‌తీలో పెద్ద‌లు తేలుస్తారు. పెద్ద క‌ర్మ అయిన ప‌ద‌కొండో రోజున  ఏం జ‌రిగింది?  ఆ రోజైనా కాకులొచ్చి పిండాన్ని తిన్నాయా?  కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయా?  సాయిలు క‌ష్టాలు తీరాయా ? అనేది మిగ‌తా క‌థ‌.

(పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని