Lakshya: ఈసారి ‘జై శౌర్య’ అనే సౌండ్‌ వినిపించాలి: శర్వానంద్‌

నాగశౌర్య హీరోగా ఆర్చరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. కేతిక శర్మ కథానాయిక.

Updated : 07 Dec 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య హీరోగా ఆర్చరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. కేతిక శర్మ కథానాయిక. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పుల్లెల గోపీచంద్‌, శేఖర్‌ కమ్ముల, శర్వానంద్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

వేడుకని ఉద్దేశించి గోపీచంద్‌ మాట్లాడుతూ.. ‘సినిమా మనకెంతో ఆనందానిస్తుంది. ఆ సంతోషాన్ని పంచేందుకు చాలామంది శ్రమిస్తుంటారు. అలా ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నేపథ్యం (ఆర్చరీ)  తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది. సంగీతం బాగుంది. ఈ సినిమాలోని నాగశౌర్య లుక్‌ని నేనే విడుదల చేశాను. తను సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. చిత్రం మంచి విజయం అందుకోవాలి’ అని ఆకాంక్షించారు. ‘బాలకృష్ణగారు ‘అఖండ’ చిత్రంతో థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్‌. క్రీడా నేపథ్యమున్న చిత్రం చేసేందుకు చాలా ధైర్యంకావాలి. ముఖ్యంగా కథానాయకుడికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. పాత్రలో ఒదిగిపోయేందుకు సంబంధిత ఆటని నేర్చుకుని మరీ నటించాలి. ఈ సినిమా కోసం శౌర్య చాలా కష్టపడ్డాడు. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. సక్సెస్‌ని అందించండి. ఈసారి జై శౌర్య అనే సౌండ్‌ వినిపించాలి’ అని శర్వానంద్‌ ప్రేక్షకుల్ని కోరారు.

నాగశౌర్య మాట్లాడుతూ.. ‘ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు నా కృతజ్ఞతలు. కాలభైరవ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. కంటెంట్‌ ఉన్నప్పుడు ఎక్కువ పాటలు అవసరంలేదని ‘లక్ష్య’ నిరూపిస్తుంది. దర్శకుడు సంతోష్‌కి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షిస్తున్నా. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేతికశర్మ, కాల భైరవ, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని