అక్కడి హీరోలు ఇక్కడ.. ఇక్కడి దర్శకులు అక్కడా!

మన కథలు అందరికీ నచ్చుతున్నాయి. మన హీరోలూ పాన్‌ ఇండియా ఇమేజ్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మార్కెట్‌ పాలిట కల్పతరువుగా కనిపిస్తున్నారు. అందుకే మన హీరోలపై పొరుగు పరిశ్రమలకి చెందిన దర్శకుల దృష్టి పడింది. మన దర్శకులు...

Updated : 17 Jul 2021 10:03 IST

మన కథలు అందరికీ నచ్చుతున్నాయి. మన హీరోలూ పాన్‌ ఇండియా ఇమేజ్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మార్కెట్‌ పాలిట కల్పతరువుగా కనిపిస్తున్నారు. అందుకే మన హీరోలపై పొరుగు పరిశ్రమలకి చెందిన దర్శకుల దృష్టి పడింది. మన దర్శకులు తయారు చేస్తున్న కథలపైనా పొరుగు హీరోలు మనసుపడుతున్నారు. అందుకే అక్కడి హీరోలు ఇక్కడికీ... ఇక్కడి దర్శకులు అక్కడికీ అన్నట్టుగా మారింది వరస.

తమిళ కథానాయకుడు విజయ్‌తో వంశీ  పైడిపల్లి సినిమా చేయనున్న విషయం   తెలిసిందే. మరో తమిళ స్టార్‌ ధనుష్‌ మన దర్శకుడు శేఖర్‌ కమ్ములతో జట్టు కట్టనున్నారు. ధనుష్‌ మరో తెలుగు దర్శకుడితోనూ సినిమాకి పచ్చజెండా ఊపేశారు. సూర్య, శివకార్తికేయన్, విజయ్‌ సేతుపతి... ఇలా పలువురు కథానాయకుల కోసం మన తెలుగు దర్శకులు కథలు సిద్ధం చేశారు. అలాగే అగ్ర దర్శకుడు శంకర్‌... మన హీరో రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్‌ ‘సలార్‌’ చేస్తున్నారు. రామ్‌తో తమిళ దర్శకుడు లింగుస్వామి జట్టుకట్టారు. మురుగదాస్, లోకేష్‌ కనగరాజ్‌... ఇలా పలువురు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ క్షణంలోనైనా తెలుగు కథానాయకులతో సినిమాల్ని ప్రకటించొచ్చని చెబుతున్నారు.

అందుకే...

సినిమా రూపకల్పనలో నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగిందో... వ్యాపార విస్తృతి అంతే పెరిగింది. థియేటర్‌ రూపేణా కాకుండా.... ఓటీటీ, శాటిలైట్, ఇతరత్రా సామాజిక    మాధ్యమాల వేదికల రూపంలోనూ సినిమాకి ఆదాయం సమకూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బహు భాషల్లో గుర్తింపున్న కథానాయకులతోనూ, దర్శకులతోనూ సినిమాలు చేస్తే అందరికీ లాభదాయకం. నిర్మాతల ఆ వ్యూహాల్ని అనుసరించి కాంబినేషన్లని సెట్‌ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇదివరకెప్పుడూ చూడని కొత్త కలయికలు సెట్‌ అవుతున్నాయి. అలాగే కరోనాతో వచ్చిన విరామం వల్ల కూడా దర్శకుల దగ్గర కథలు పేరుకుపోయాయి. ఆ కథల్ని చేయడానికి సరిపడా కథానాయకులు దొరకడం లేదు. దాంతో దర్శకులు పొరుగు భాషలపైనా దృష్టిపెడుతూ అక్కడి కథానాయకులకి చెప్పి ఒప్పిస్తున్నారు.

మార్కెట్‌ పరిధి పెరుగుతుందని

తమిళ దర్శకులు తెలుగు కథానాయకులతో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల వాళ్లు మన హీరోలపై మరింత ఆసక్తి చూపుతున్నారు. అందుకు కారణం మన హీరోల ఇమేజ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ప్రముఖంగా కనిపిస్తుండడమే. రామ్‌చరణ్‌కి దక్షిణాదితోపాటు, హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ్ఞఆర్‌.ఆర్‌.ఆర్ఠ్‌  చేస్తున్న ఆయన... అగ్ర దర్శకుడు శంకర్‌కి ఒక మంచి ఎంపిక అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కలయికలో త్వరలోనే సినిమా పట్టాలెక్కనుంది. ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నీ అలరించిన లోకేష్‌ కనకరాజ్‌.. ప్రభాస్‌ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నుంచి ఈ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. మరో దర్శకుడు మురుగదాస్‌... అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

*ఇక తెలుగు దర్శకులు... తమిళ కథానాయకుల్ని తమ కథలతో ఒప్పించడంలో ముందున్నారు. వంశీ పైడిపల్లి, శేఖర్‌ కమ్ముల కథలకి విజయ్,   ధనుష్‌లు ఫిదా అయిన విషయం తెలిసిందే. సూర్య కోసం బోయపాటి శ్రీను, శివకార్తికేయన్‌ కోసం ‘జాతిరత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ కథలు సిద్ధం చేశారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ కలయికలో సినిమాలు పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ‘రాక్షసుడు-2’ చిత్రం కోసం విజయ్‌ సేతుపతి రంగంలోకి దిగే అవకాశాలున్నాయనీ ప్రచారం సాగుతోంది. ఈపరిణామంతో ప్రేక్షకులు కొత్త తరహా వినోదాన్ని ఆస్వాదిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు చాలా మంది దర్శకులు, కథానాయకుల మార్కెట్‌ పరిధిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రజనీకాంత్,  కమల్‌హాసన్, సూర్య, కార్తి, విక్రమ్‌ తదితర తమిళ కథానాయకులకి తెలుగులో బలమైన మార్కెట్‌ ఉంది. మిగతా కథానాయకులూ ఇప్పుడు నేరుగా సినిమాలు చేయడం వల్ల తెలుగులో వాళ్లకీ అభిమానగణం ఏర్పడే  అవకాశాలున్నాయి. తెలుగు దర్శకులు, తెలుగు కథానాయకులు పొరుగు భాషలపై మరింత ప్రభావం చూపేందుకు ఆస్కారం లభిస్తుంది. దక్షిణాదిలోనే కాదు... ప్రస్తుతం హిందీలోనూ తెలుగు దర్శకులు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.

పాన్‌ ఇండియా మంత్రం

పాన్‌ ఇండియా సినిమాల రూపకల్పనతో భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. హీరోల్ని ఒక భాషకి పరిమితం చేసి చూడలేం. దర్శకుల్నీ ఫలానా పరిశ్రమకి చెందినవాళ్లు అని ప్రత్యేకంగా అనలేం. దర్శకులైనా, హీరోలైనా... ఎవరూ ఎక్కడికీ వెళ్లరు. ఇదివరకటిలా ఒక భాషకి పరిమితం కాకుండా... చేస్తున్నచోటే రెండు మూడు భాషలు లక్ష్యంగా   సినిమాలు చేస్తుంటారు. పాన్‌ ఇండియా సినిమా సంస్కృతి ప్రభావమే అదంతా! దీని ఫలితంగా సినీ పరిశ్రమల ముఖచిత్రమే మారిపోయింది. ఎవరూ ఊహించని కొత్త కలయికలు వెలుగులోకి వస్తున్నాయి. తరచూ కొత్త జట్లు రంగంలోకి దిగుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని  రేకెత్తిస్తుంటాయి. ఆయా కథానాయకులు, దర్శకనిర్మాతల వ్యాపార పరిధి కూడా విస్తృతం అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని