Theppa samudram: యథార్థ సంఘటనల ఆధారంగా.. ‘తెప్ప సముద్రం’

‘బిగ్‌ బాస్‌’ ఫేం అర్జున్‌ అంబటి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘తెప్ప సముద్రం’. కిశోరి ధాత్రక్‌ కథానాయిక. రవిశంకర్‌, చైతన్యరావు ప్రధాన పాత్రలు పోషించారు.

Updated : 16 Apr 2024 09:28 IST

బిగ్‌ బాస్‌’ ఫేం అర్జున్‌ అంబటి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘తెప్ప సముద్రం’. కిశోరి ధాత్రక్‌ కథానాయిక. రవిశంకర్‌, చైతన్యరావు ప్రధాన పాత్రలు పోషించారు. సతీష్‌ రాపోలు దర్శకుడు. నీరుకంటి మంజులా రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మాత. పీఆర్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించింది. ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రైలర్‌, పాటల విడుదల అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో, యథార్థ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. బలమైన కథతోపాటు థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటాయి. వాటిని తెరపైనే చూడాలి. నటులు, సాంకేతిక నిపుణులు మంచి పనితీరుని కనబరిచార’’న్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘దర్శకనిర్మాతలకి తెలిసింది సినిమా ఒక్కటే. ఎంతో తపన ఉంటేనే ‘తెప్ప సముద్రం’ తరహా చిత్రాలొస్తాయి. 90 శాతం సినిమాని పోచంపల్లిలోనే చేశాం. అక్కడ గొప్ప సహకారం అందించారు. అందరికీ ఓ మంచి గుర్తింపుని తీసుకొచ్చే చిత్రం అవుతుంది’’ అన్నారు. ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘కమల్‌హాసన్‌ చేసిన ‘మహానది’ ఎంతో ఆలోచింపజేసింది. అలాంటి ఓ మంచి కథాంశాన్ని ఎంచుకుని చేసిన ఈ బృందానికి నా అభినందనలు. ఇలాంటి చిత్రాలు విజయవంతమైతే కృష్ణానగర్‌లోని ఎంతోమందికి పని దొరుకుతుంది. ఈ సినిమాని తెలుగువాళ్లంతా చూసి ఆదరించాలి’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘చిరంజీవి అభిమానిని నేను. ఆయన స్ఫూర్తితోనే పరిశ్రమకి వచ్చా. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో నటులు చైతన్యరావు, యోగి, ఫైట్‌మాస్టర్‌ శంకర్‌, ఛాయాగ్రాహకుడు శేఖర్‌, ఎడిటర్‌ సాయిబాబు, గీత రచయిత పూర్ణాచారి, మహేంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని