ఏప్రిల్‌.. ఈ సినిమాలతో థియేటర్స్‌ ఫుల్‌ 

తెలుగు చిత్రసీమ పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం తెరుచుకున్న థియేటర్లలో క్రమంగా హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ సందడి మొదలై దాదాపు మూడు నెలలు దాటినా..

Published : 01 Apr 2021 13:50 IST

సందడికి సిద్ధమైన సినిమాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్రసీమ పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం తెరుచుకున్న థియేటర్లలో క్రమంగా హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ సందడి మొదలై దాదాపు మూడు నెలలు దాటినా.. పెద్ద హీరోల సినిమాలు లేవనే భావన చాలామంది మదిలో ఉంది. అయితే.. ఈ ఏప్రిల్‌ ఆ చింతకు చెక్‌ పెట్టనుంది. వారంవారం సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’తో పాటు నాని ‘టక్‌ జగదీష్‌’, రానా ‘విరాటపర్వం’ వంటి పెద్ద సినిమాలు.. మరోవైపు చిన్న సినిమాలు కూడా పోటీకి సై అంటున్నాయి.

యువరత్న తెలుగులోకి

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ తొలిసారి నేరుగా తెలుగు చిత్రంతో టాలీవుడ్‌ను పలకరించబోతున్నారు. ఆయన నటించిన ‘యువరత్న’ ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, సాయేషా కీలక పాత్రలు పోషించారు. సంతోష్‌ అన్నాద్రం దర్శకత్వంలో హోంబలే సంస్థ సినిమాను నిర్మించింది. తమన్ స్వరాలు‌ అందించారు. కళాశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇటీవల వచ్చిన ‘మాస్టర్‌’ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.


విజయ్‌వర్మ ‘పవర్‌ఫుల్‌’

ఈ నెలలో విడుదల కానున్న పెద్ద హీరో సినిమాల్లో ‘వైల్డ్‌డాగ్‌’ ఒకటి. ఇందులో నాగార్జున విజయ్‌వర్మగా ఒక పవర్‌ఫుల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. టాలీవుడ్‌లో క్రైమ్‌ థ్రిల్లర్లకు మంచి ఆదరణ ఉంటుంది. పైగా మన హైదరాబాద్‌కు సంబంధించిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాబట్టి మరింత ఆసక్తి నెలకొంది. దర్శకత్వంలో ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. సయామీఖేర్‌, అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కూడా తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.


ఏప్రిల్‌ 2 సుల్తాన్‌

కార్తీ.. తమిళ నటుడే అయినా.. తెలుగులోనూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. పైగా, కార్తీ, రష్మిక జంటగా ‘సుల్తాన్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ పతాకంపై బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడదలైన సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా కూడా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున సైతం ‘‘నా తమ్ముడు కార్తీ సినిమా ‘సుల్తాన్‌’ కూడా మంచి విజయం సాధించాలి’’ అని అనడంతో ఆ సినిమాకు మరింత బలం చేకూరినట్లయింది. ఏదేమైనా ‘ఊపిరి’ నటుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.


ఓ మంచి రోజు చూసి చెప్తా

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ప్రధానపాత్రలో తెరకెక్కిన ఓ చిత్రం ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో యువరాణి పాత్రలో నాగబాబు కుమార్తె నిహారిక కనిపించనుంది. ‘ఒరు నల్లనాళ్‌ పాత్తు సొల్రేన్’ అనే పేరుతో తమిళంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే పేరుతో విడుదల కాబోతోంది. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదలకానుంది.


పోటీలేని వకీల్‌సాబ్‌

పవన్‌ అభిమానులకు ఈ ఏప్రిల్‌ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అభిమానులు తమ అభిమాన హీరోను తెరపై చూసుకోబోతున్నారు. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్‌’ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఏప్రిల్‌ 9న ‘వకీల్‌సాబ్‌’ సందడి మొదలుకానుంది. కాగా.. పవన్‌తో పోటీపడేందుకు మరే సినిమా దిగకపోవడం గమనార్హం.


ప్రేమకథ చెప్పేందుకు..

ప్రేమకథలను తెరకెక్కించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ముల నుంచి వస్తున్న మరో చిత్రం ‘లవ్‌స్టోరీ’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘సారంగదరియా’ విడుదలై యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పైగా.. ఫిదా తర్వాత సాయిపల్లవితో కలిసి శేఖర్‌కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం కావడం విశేషం. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


కనబడుటలేదు సిద్ధం..

డిటెక్టీవ్‌గా మారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు సునీల్‌. ‘కనబడుట లేదు’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో థియేటర్లలో ఉత్కంఠను చూపించనున్నారు. సుక్రాంత్‌ వీరెల్ల హీరోగా నటించిన ఈ సినిమాలో సునీల్‌ది కీలక పాత్ర. బాలరాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో పెద్ద సినిమాలకు పోటీ ఇస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదలకు సిద్ధమైంది.


నాని కోసం ఎదురుచూపులు

నాని-శివనిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘టక్‌ జగదీష్‌’. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలుగా సందడి చేయనున్నారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ‘హిట్‌’తో మంచి హిట్‌ అందుకున్న నాని నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


పోటీలోకి చిన్న చిత్రం

అరవింద్‌ కృష్ణ, శ్రీజితా గోష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శుక్ర’. సుకు పూర్వజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. ఏప్రిల్‌ 23న చిత్రాన్ని విడుదల కానుంది. వరుస చోరీలతో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలకు వణుకు పుట్టిస్తున్న ఒక అండర్‌వరల్డ్‌ ముఠా చుట్టూ సాగే కథతో ఈ సినిమా తెరకెక్కించారు.


తలైవి వచ్చేస్తోంది

దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎదురుచూస్తు్న్న చిత్ర ‘తలైవి’. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి కంగన నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. కేఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, అరవిందస్వామి, జిషుసేన్‌ గుప్తా కీలకపాత్రల్లో కనిపించనున్నారు.


‘విరాటపర్వం’దే లాస్ట్‌పంచ్‌

విభిన్న కథలను ఎంచుకుంటూ తన అభిమానులను అలరించే రానా.. ఈసారి విరాటపర్వం అంటూ మరింత కొత్తగా కనిపించనున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి కీలకపాత్ర పోషించింది. ఏప్రిల్‌లో సాయిపల్లవి నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా టీజర్‌ మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ టీజర్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కానుంది. ఇలా ఏప్రిల్‌కు విరాటపర్వం లాస్ట్‌ పంచ్‌ ఇవ్వనుంది.


సీటీమార్‌ కొడుతుందా..?

గోపీచంద్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘సీటీమార్‌’. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ.. నిర్మాణానంతర పనులు పూర్తికాకపోవడంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే, ఈ సినిమాను ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని