Netflix Movies 2023: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాదంతా సినిమాల పండగే..!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పెద్ద ఎత్తున వినోదాలు పంచడానికి సిద్ధమైంది.

Published : 16 Jan 2023 01:51 IST

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పెద్ద ఎత్తున వినోదాలు పంచడానికి సిద్ధమైంది. చిరంజీవి, మహేష్‌బాబు, రవితేజ, నాని, నిఖిల్‌, కల్యాణ్‌రామ్‌లాంటి కథానాయకుల చిత్రాలతోపాటు యువ ప్రేక్షకులను అలరించే మరికొన్ని చిత్రాలనూ 2023లో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఆయా చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాక ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. అవేంటో చూసేయండి.

  • ఈ సంక్రాంతి సీజన్‌లో ‘వాల్తేరు వీరయ్య’గా అభిమానులకు పూనకాలు తెప్పించారు అగ్రకథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ఈ విజయం తర్వాత ఆయన ‘భోళాశంకర్‌’గా రాబోతున్నారు. ఆయనతోపాటు తమన్నా, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్‌ కథానాయకుడిగా తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
  • ‘అతడు’, ‘ఖలేజా’ల తర్వాత మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో మరో చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. మహేష్‌ బాబు 28వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. తమన్‌ స్వరాలందిస్తున్నారు. థియేటర్లలో విడుదల అనంతరం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.
  • రవితేజ, శ్రీలీల నాయకానాయికలుగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న చిత్రం ‘ధమాకా’. ఇది రవితేజకు తొలి రూ.100 కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. దీంతోపాటు నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ నాయకానాయికలుగా నటించిన ‘18 పేజెస్‌’నూ ఈ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
  • నాని, కీర్తి సురేష్‌ నాయకానాయికలుగా సింగరేణి గనుల నేపథ్యంలో కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. నాని తొలిసారి మాస్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకులను పలకరించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
  • నందమూరి కల్యాణ్‌రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘అమిగోస్‌’. నూతన దర్శకుడు రాజేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఆసక్తి రేకెత్తించింది. ఈ చిత్రం కూడా థియేటర్‌ విడుదల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.
  • ప్రముఖ కథానాయిక అనుష్క, యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో, నూతన దర్శకుడు పి.మహేష్‌బాబు దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న చిత్రం కూడా థియేటర్లలో పలకరించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
  • సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ నాయకానాయికలుగా రూపొందుతున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్‌’, వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రం, సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్తా మేనన్‌ల ‘విరూపాక్ష’, పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం, కిరణ్‌ అబ్బవరం ‘మీటర్‌’, కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న 8వ చిత్రం, సందీప్‌ కిషన్‌ ‘బడ్డీ’, అనికా సురేంద్రన్‌ ప్రధాన పాత్రలో మలయాళ చిత్రం ‘కప్పెలా’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘బుట్టబొమ్మ’, నాగశౌర్య తదుపరి చిత్రం.. ఇవి కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు వినోదాలు పంచనున్నాయి. 
Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు