Venu Thottempudi: ఆ విషయం రవితేజ చెప్తేనే తెలిసింది: వేణు తొట్టెంపూడి

వేణు తొట్టెంపూడి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’ తదితర  సినిమాలతో అలరించిన ఆయన కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు.

Published : 29 Jul 2022 00:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేణు తొట్టెంపూడి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’ తదితర  సినిమాలతో అలరించిన ఆయన కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా వేణు విలేకరులతో మాట్లాడారు.

* ‘దమ్ము’ సినిమా తర్వాత గ్యాప్‌ రావడానికి కారణం?

వేణు:  ప్రత్యేకమైన కారణమంటూ ఏం లేదు. మాకు చాలా వ్యాపారులున్నాయి. దాంట్లో బిజీ అయిపోయా. సినిమాల గురించి అలోచించే తీరికే ఉండేది కాదు. అప్పుడప్పుడు కొంతమంది సినిమాల కోసం సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించేవాడ్ని. అలాంటిది కరోనా లాక్‌డౌన్‌ నాలో మార్పుతీసుకొచ్చింది. ఆ సమయంలో ఎన్నో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూశా. దాంతో నటనపై మళ్లీ ఆసక్తి పెరిగింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు దర్శకుడు శరత్ మండవ ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ చెప్పారు.  నాకు బాగా నచ్చింది. అందులోని నా పాత్ర సీఐ మురళికి ఫిదా అయ్యా.  ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జానర్‌ సినిమా కూడా కొత్తే. మాస్‌ హీరో రవితేజ సినిమాతో నేను రీఎంట్రీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. 

* సీఐ మురళి పాత్ర గురించి చెప్తారా ?

వేణు: ‘రామారావు’ ఎక్కువ మందికి చేరగలిగే సినిమా. ఇందులో నటిస్తే నేను మళ్లీ వచ్చానని చాలామందికి తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఈ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పా. ఇంతకుముందు వరకు నా పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పలేదనే అసంతృప్తి ఉండేది. ఈ చిత్రంతో అది తొలగిపోయింది.

* రవితేజతో కలిసి నటించడం ఎలా అనిపించింది? 

వేణు: రవితేజతో గొప్ప అనుభవం. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. నేను హీరోగా నటించిన ‘స్వయంవరం’లో తాను ఓ పాత్ర చేయాల్సి ఉండగా మిస్‌ అయ్యారట. ఆ విషయం ఆయన చెప్పేదాక నాకు తెలియదు. అప్పటి కాంబో ఇప్పుడు కుదిరింది. నేను మొదటి నుంచీ మల్టీస్టారర్‌ సినిమాలపైనే ఆసక్తి చూపేవాడ్ని.

* మీ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు. తర్వాత ఆయన స్టార్ దర్శకుడయ్యారు కదా?

వేణు: తన సినిమాల్లో నాకు సరిపడే పాత్ర ఉంటే కచ్చితంగా చెప్తారు. ‘అతడు’ సినిమాలో సోనూసూద్ పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోవడంతో ఆయన నటించారు. 

* కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. రహస్యమేంటి?

వేణు: మంచి ఆహారం తినడం తప్ప నాకు మరో అలవాటు లేదు. శరీరానికి హాని చేసే వాటి గురించి నేను ఆలోచించను. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్‌కు దూరంగా ఉంటా. తల్లీదండ్రుల ఆశీర్వాదమే ఆ రహస్యం అనుకోవచ్చు.

* సినిమాలని కొనసాగిస్తారా ?

వేణు: కచ్చితంగా. సినిమాలతో పాటు డిజిటల్‌ కంటెంట్‌పైనా దృష్టి పెడుతున్నా. ప్రస్తుతం ‘ఛాయ్ బిస్కెట్’ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. ఓ వెబ్ సిరీస్‌ చర్చల దశలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని