Custody: ‘కస్టడీ’ డబ్బింగ్‌ సినిమా కాదు.. ఓ ట్విటర్‌ పేజీ తీరుపై దర్శకుడు అసహనం

‘కస్టడీ’ సినిమా గురించి దర్శకుడు వెంకట్‌ ప్రభు తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

Published : 09 May 2023 00:44 IST

చెన్నై: ‘కస్టడీ’ (Custody) చిత్రంపై  ఓ ట్విటర్‌ ఖాతా నిర్వహించిన పోల్‌పై చిత్ర దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) అసహనం వ్యక్తం చేశారు. దయచేసి ‘కస్టడీ’ని ఒక డబ్బింగ్‌ సినిమాలా చూడవద్దని ఆయన విన్నవించారు. నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన సినిమా ‘కస్టడీ’. కానిస్టేబుల్‌ బ్యాక్‌డ్రాప్‌ కథతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళం భాషల్లో మే 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్‌కు చెందిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్విటర్‌ ఖాతా తాజాగా పోల్‌ నిర్వహించింది. ‘‘ఈ వారం తమిళంలో రిలీజ్‌ కానున్న ఏ సినిమాలను మీరు చూడాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నిస్తూ.. ‘‘1.గుడ్‌ నైట్‌, 2.ఫర్హానా, 3.కస్టడీ (డబ్బింగ్‌ సినిమా), 4.రావణ కొట్టం’’ అనే ఆప్షన్స్‌ను జత చేసింది. ఇది కాస్త వెంకట్‌ ప్రభు కంట పడింది. దీనిని చూసిన ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. ‘‘మై ఫ్రెండ్‌.. ‘కస్టడీ’ డబ్బింగ్‌ సినిమా కాదు. తెలుగు, తమిళంలో తెరకెక్కిన సినిమా అది’’ అంటూ నమస్కారం పెడుతోన్న ఓ ఎమోజీని జత చేసి కామెంట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

కస్టడీ చిత్రంలో నాగచైతన్య కానిస్టేబుల్‌ పాత్రలో కనిపించనున్నారు. కృతిశెట్టి కథానాయిక. అరవింద్‌ స్వామి, ప్రియమణి వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని ఒకేసారి షూట్‌ చేశారు. తమిళ వెర్షన్‌కు వెంకట్‌ ప్రభునే మాటలు రాయగా.. తెలుగులో అబ్బూరి రవి మాటలు అందించారు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువయ్యేలా సినిమాలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని