Jailer ott release: ‘జైలర్‌’ ఓటీటీ రిలీజ్ డేట్‌ ఎప్పుడు ప్రకటిస్తారు?

Jailer ott release date: రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘జైలర్‌’ ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Updated : 30 Aug 2023 18:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.600 కోట్లకు(గ్రాస్‌)పైగా వసూళ్లను రాబట్టి, అత్యధిక వసూళ్లను సాధించిన రెండో తమిళ చిత్రంగా నిలిచింది. టాప్‌లో 2.ఓ (రూ.665 కోట్లు) ఉండగా, మూడో స్థానంలో ‘పొన్నియిన్‌సెల్వన్‌-1’ (రూ.492 కోట్లు), నాలుగో స్థానంలో ‘విక్రమ్‌’ (రూ.432 కోట్లు) ఉన్నాయి.

ఆ ప్రాజెక్ట్‌ చిరంజీవి చేసి ఉంటే.. ఇంకెక్కడో ఉండేది: అశ్వనీదత్‌

మరోవైపు సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా, చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఓటీటీ విడుదలపై (Jailer ott release date) పెదవి విప్పడం లేదు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ కన్నా మరింత ఓటీటీలో ఆలస్యంగా ‘జైలర్‌’ వస్తుందని కొన్ని రోజుల కిందటే చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలో కనీసం తేదీనైనా ప్రకటించారేమోనని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. తేదీ సంగతి పక్కన పెట్టండి... అసలు ఎక్కడ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారో కూడా చెప్పటం లేదు. ఈ విషయంలో సన్‌ పిక్చర్స్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికీ థియేటర్‌లలో ‘జైలర్‌’ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో సినిమాను ఓటీటీ తేదీ ప్రకటిస్తే, ఆ ప్రభావం కలెక్షన్లపై పడుతుందని చిత్ర బృందం యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అత్యధిక వసూళ్లను రాబట్టిన ‘2.ఓ’ను దాటే దిశగా ‘జైలర్‌’ అడుగులు వేస్తున్న క్రమంలో ఆ రికార్డు కూడా పూర్తయిన తర్వాతే ఓ నిర్ణయానికి రావచ్చని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ‘జైలర్‌’ ఓటీటీ రైట్స్‌ అత్యధికంగా రూ.100కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అటు ఓటీటీ వేదిక, ఇటు చిత్ర నిర్మాణ సంస్థ ఎక్కడా స్పందించలేదు. అయితే, డీల్‌ ప్రకారం నాలుగు వారాల తర్వాత సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారట. అన్నీ కుదిరితే వినాయకచవితి సందర్భంగా సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈలోగా ఎలాగూ ‘జైలర్‌’ 2.ఓ రికార్డును బద్దలు కొడుతుందుని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో ‘జైలర్‌’ హెచ్‌డీ ప్రింట్‌ లీక్‌

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘జైలర్‌’ మూవీ ‘హెచ్‌డీ ప్రింట్‌ ఆన్‌లైన్‌లో లీకైంది. దీంతో రజనీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్‌లో ‘జైలర్‌’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని కోరుతున్నారు. మరోవైపు చిత్ర బృందం ఆన్‌లైన్‌ వేదికగా ఉన్న లింక్‌లను తొలగించే ప్రయత్నం చేస్తోంది. అయినా కూడా సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతున్న క్రమంలో  ఆన్‌లైన్‌లో లీకవడం కొంతమేర కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని