Chiranjeevi: ఆ ప్రాజెక్ట్‌ చిరంజీవి చేసి ఉంటే.. ఇంకెక్కడో ఉండేది: అశ్వనీదత్‌

సూపర్‌హిట్‌ వెబ్‌సిరీస్‌ స్టోరీ ముందుగా చిరంజీవి కోసం సిద్ధమైందని, కానీ దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ప్రాజెక్ట్‌ అంటే? 

Published : 30 Aug 2023 16:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ హీరో నటించాల్సిన సినిమాలు/వెబ్‌సిరీస్‌ల్లో పలు కారణాల వల్ల మరో హీరో నటించడం సహజమే. అలా టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) నటించాల్సిన ఓ కథలో బాలీవుడ్‌ నటుడు నటించి విశేష క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్‌ మరేదో కాదు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (The Family Man). ఇందులో చిరంజీవి నటించకపోవడానికి కారణమేంటో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ (Aswani Dutt) తెలిపారు. చిరంజీవి హీరోగా తాను నిర్మించిన ‘చూడాలని ఉంది’ (Choodalani Vundi) సినిమా విడుదలై 25 ఏళ్లు అయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ముద్దు వివాదం.. అందులో తప్పేముందన్న దర్శకుడు..!

‘‘చిరుత’ (రామ్‌చరణ్‌ హీరో) తర్వాత చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలని ప్రయత్నించా. ఈ క్రమంలోనే దర్శకులు రాజ్‌, డీకేలు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిద్ధం చేశారు. చిరంజీవి కోసమే రాసిన కథ అది. ‘ఖైదీ నం. 150’ సినిమా విజయోత్సాహంలో ఉన్న సమయంలో చిరంజీవికి ఈ విషయం చెప్పగా ‘నా పాత్రకు కూతురు, కొడుకు ఉంటారని అంటున్నారు..!’ అంటూ సందేహం వ్యక్తం చేశారు. దాంతో, అవసరమైతే ఆ పిల్లల క్యారెక్టర్లను తొలగిస్తామని దర్శకులు చెప్పారు. అయినా ఎందుకో చిరంజీవి అంతగా ఆసక్తి చూపలేదు. ఇదే ప్రాజెక్టు అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఒకవేళ చిరంజీవి చేసి ఉంటే ఇంకెక్కడో ఉండేది’’ అని అన్నారు.

అలా చిరంజీవి నో చెప్పడంతో వెబ్‌సిరీస్‌గా తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌తో ఆయన కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌: 2’ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ నటి సమంత (Samantha) కీలక పాత్ర పోషించారు. మూడో సీజన్‌కి రంగం సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని