Diwakarbabu: తొలి సినిమాకే నా పేరు లేదు: సినీ రచయిత దివాకర్‌బాబు

బాల్యం నుంచే రంగస్థల నటుడిగా, నాటక రచయితగా జీవితాన్ని ఆరంభించారు. కవి, కథారచయితగా పేరుగాంచారు. 

Updated : 05 Apr 2022 10:02 IST

సినిమాలు రావడం లేదు..వస్తే రాస్తా

ఇంటర్నెట్‌డెస్క్‌: బాల్యం నుంచే రంగస్థల నటుడిగా, నాటక రచయితగా జీవితాన్ని ఆరంభించారు. కవి, కథా రచయితగా పేరుగాంచారు. ఆయనే మాడభూషి దివాకర్‌బాబు. నాటక రచయితగా ప్రఖ్యాతిగాంచిన సమయంలో ‘కొంటె కాపురం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపుగా 100 సినిమాలకు పైగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈటీవీ వార్తా ఛానెళ్లలో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

100కి పైగా సినిమాలు చేశారు. వాటిలో 80 సూపర్‌ హిట్‌. మంచి డైలాగ్స్‌తో పాటు అందరూ నవ్వే హాస్యంతో మీకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమయ్యింది..?

దివాకర్‌బాబు: నిరంతరం కష్ట పడటం వల్లే ఏదైనా సాధ్యమవుతుంది. దానికి తోడు నాకు అవకాశాలు కూడా వచ్చాయి. మంచి విజయాలు సాధించడంతో పేరొచ్చింది.

మీ బాల్యం ఎక్కడ గడిచింది..?

దివాకర్‌బాబు: గుంటూరు. పుట్టింది తాడేపల్లిగూడెం. నాన్నగారు కూడా నాటక రంగంలో పని చేశారు. ఆయన నాటకాలను చూశాను. ఒక నాటకంలో లోహితశ్రీ పాత్రధారుడు రాకపోతే నేనే వెళ్లి వేశా. మా నాన్న నన్ను చూసి షాక్‌ తిన్నారు. ఆ తర్వాత నేను కంగుతిన్నా.. డైలాగులు మర్చిపోవటడంతో వెనక నుంచి అందించారు.

నాన్న నాటక రచయితగా పని చేశారా..?

దివాకర్‌బాబు: మా నాన్నగారే కాదు..తాత దగ్గరి నుంచి అందరూ నాటకాలు, ఇతర రచనలు చేశారు. నానమ్మ పాటలు రాసేది. రచన మా రక్తంలోనే ఉంది. మా ఇంట్లో దొంగలు పడి నగదు, నగలు, వస్తువులు, బట్టలు తీసుకెళ్లారు. దొంగ దొరికిన తర్వాత మా నాన్నమ్మ వాడిని అడిగిన ప్రశ్న ఒకే ఒక్కటి. ‘నా పాటల పుస్తకం ఏం చేశావ’ని.. వాడు గోదాట్లో విసిరేశానన్నాడు.

ఎప్పుడు కలం పట్టి రాయడం మొదలెట్టారు..?

దివాకర్‌బాబు: కాలేజీడేస్‌లో క్రీడల వైపు కాకుండా చిత్రలేఖనం, కల్చరల్‌ వింగ్‌లో ఉండేవాడిని. నేను మ్యాగజైన్లకు కథలు రాసేవాడిని. నాటకాల్లో పాత్రలు వేయడం, డైరెక్షన్‌ కూడా చేశా. నాటక పరిషత్తులలో నాటకాలు వేయడానికి నాటకం ఎవరూ ఇవ్వరు. అందుకే సొంతంగా రాయాలనుకున్నా. అదే సమయంలో గుంటూరు శాస్త్రి తెల్లారేసరికి ఒక నాటకం రాయాలని కోరారు. రాత్రంతా కూర్చొని అసుర గణం నాటకం రాశాను. అది బాగా ప్రాచుర్యం పొందింది. అందులో స్త్రీ పాత్ర ఉండదు.

ఉద్యోగం ఎక్కడ చేశారు..?

దివాకర్‌బాబు: నిరుద్యోగ పర్వం చాలా డేంజరస్‌. మొదటి ఉద్యోగం అబిడ్స్‌లోని అన్నపూర్ణ హోటల్‌లో రిసెప్షనిస్టుగా ఒక నెల చేసి మానేశా. బందరులో ఎల్‌ఐసీ ఆఫీస్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రాయడం మొదలెట్టాను.

మీరు రాసిన ‘కుందేటి కొమ్ము’ చాలా ప్రసిద్ధి పొందింది. అది మూడు భాషల్లోకి అనువదించారు. ఇటీవల దిల్లీలో నాటక ప్రదర్శన జరిగితే ప్రధాని మెచ్చుకున్నారు. ఆ అనుభవాలు చెప్పండి..?

దివాకర్‌బాబు: మొదట రవీంద్రభారతిలో నాటకం వేశాం. నేను కూడా ఒక పాత్ర వేశా. ఆ నాటకం కావాలని ఒకరొచ్చారు. అప్పటికే మా బృందానికి ఇచ్చానని చెప్పా. ‘అయితే సరి’ అనేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మా టీం సభ్యులు వచ్చి ‘ఏం గురూ వి.మధుసూదన్‌రావు ఏం మాట్లాడారు’ అని అడిగారు. ఆయనని నాకు తెలియదు. ఆ తర్వాత ఆయన్ని కలిశాను. చాలా రోజుల తర్వాత హిందీలో ఆ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు రూ.5లక్షల బహుమతి వచ్చింది. అది ఎవర్‌గ్రీన్‌ నాటకమని గర్వంగా చెప్పుకోగలను. నా నాటికలన్నీ 40 ఏళ్లుగా వేస్తూనే ఉన్నారు.

సినిమా అవకాశం ఎప్పుడు, ఎక్కడ వచ్చింది..?

దివాకర్‌బాబు: విజయవాడ బ్యాంకులో పని చేస్తున్న సమయంలో ‘కుందేటి కొమ్ము’కు మంచి పేరు వచ్చింది. డైరెక్టర్‌ రేలంగి నరసింహారావు కబురు పెడితే వెళ్లా. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చూసిన తర్వాత ఒక కొత్త ఆలోచన వచ్చింది. దాన్నే ఆయనకు చెప్పా. కానీ, తర్వాత మరచిపోయా. ఒక మిత్రుడు గుర్తు చేస్తే ఉద్యోగానికి వారం సెలవు పెట్టి 80-85 సీన్లు రాసి పంపించా. డైరెక్టర్ ఒప్పుకున్నారు. డైలాగ్‌లు కూడా నన్నే రాయమని చెప్పారు. మద్రాస్‌ రమ్మంటే వెళ్లా. కానీ ఆ సినిమా ఆగిపోయింది. వెనక్కి వెళ్లిపోయా. మళ్లీ అదే కథతో ‘కొంటె కాపురం’ సినిమా వచ్చింది. కానీ, అందులో నా పేరు లేదు. తొలి సినిమాకే నా పేరు లేకుండా పోయింది. చాలా నిరుత్సాహపడ్డా.

‘కొంటె కాపురం’ తర్వాత సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి..? 

దివాకర్‌బాబు: రెండేళ్లు ఉద్యోగానికి సెలవు పెట్టా. ‘డబ్బెవరికి చేదు’, ‘మన్మథలీల కామరాజుగోల’ అలా సినీ ప్రయాణం కొనసాగింది. సిక్‌లీవ్‌ పెట్టి సినిమాలు చేస్తున్నట్టు.. మా యూనియన్‌ వాళ్లు ఉద్యోగం చేయడమా..? మానేయడమా.?ఏదో ఒకటి చెప్పాలన్నారు. రాజీనామా చేస్తానంటే అందరూ గొల్లుమన్నారు. మా ఇంట్లో నేనొక్కడినే సంపాదించేవాణ్ణి. అది తప్ప ఆధారం లేదు. మా మామగారు ఒక్కరే భరోసా ఇచ్చి సినిమాల్లోకి వెళ్లమన్నారు.

దర్శకుడు రేలంగితో 20కిపైగా సినిమాలు చేశారు కదా..ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది..?

దివాకర్‌బాబు: బ్యాంకులో ఉద్యోగం మానేయడానికి ముందు రేలంగితో మాట్లాడా. ‘నన్ను నమ్ముకుని ఉద్యోగం మానేయొద్దు. మీకు అవకాశాలు ఇవ్వొచ్చు.. ఇవ్వలేకపోవచ్చు’ అన్నారు. ఆ తర్వాత చాలా సినిమాలకు అవకాశం ఇచ్చారు.

పింగళి ‘మాయబజారు’లో చాలా ఊతపదాలు వాడారు. అవి ప్రాచుర్యం పొందాయి. అలాంటి ప్రయోగాలు మీ సినిమాల్లో కూడా వాడారు. వాటి గురించి..?

దివాకర్‌బాబు: పాతాళభైరవిలో గురూ ఊతపదం మొదలెట్టారు. ఊతపదాలు ఆయన కనిపెట్టారు. కృష్ణారెడ్డి సినిమాల్లో ఊతపదాలు ప్రయోగం చేయడానికి అవకాశం వచ్చింది. ఎన్నో భావాలతో చెప్పేదాన్ని ఒక్క ముక్కలో చెప్పడానికి వీలుంటుంది. 

హాస్యమంటే మీకు ఇష్టమా..? ఆ క్యారెక్టర్‌కు తగ్గట్టు చేసేవారా..?

దివాకర్‌బాబు: ‘మాయలోడు’ గుర్తుందా.. అలీ మేనరిజం బాగా పండింది. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ వీడియో క్యాసెట్‌ చూస్తుంటే పనివాడు పక్కనే కూర్చొని విచిత్రంగా ప్రవర్తించాడు. దాన్ని ‘మాయలోడు’లో అలీ పాత్రకు పెట్టాం. సూపర్‌హిట్‌ అయ్యింది. ‘ఘటోత్కచుడు’లో ఏవీఎస్‌ను రౌడీ పాత్రకు ఎంపిక చేశాం. ‘రంగుపడుద్ది’ డైలాగ్‌ మాత్రమే ఇచ్చాం. ‘యమలీల’లో హిమక్రిములు పెట్టా.

చిరంజీవితో చేసిన సినిమాలు..?

దివాకర్‌బాబు: ‘చూడాలని ఉంది’ చాలా గ్రేట్‌ ఎక్స్‌పిరియన్స్‌. స్క్రీన్‌ప్లేపై అవగాహన అనేది డైరెక్టర్‌కే ఉంటుంది. కానీ ఆ పని చేసేది రచయిత. ఇలా ఇండియన్‌ మూవీస్‌లో ఉంటుంది. ఇది తప్పు. ఇంగ్లిష్‌లో ఇలా ఉండదు. ‘చూడాలని ఉంది’లో నా కంట్రిబ్యూషన్‌ తక్కువ. స్క్రీన్‌ప్లే గుణశేఖర్‌ చేశారు.

దాసరితో కూడా చేశారు కాదా..?

దివాకర్‌బాబు: నా మొదటి సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు దాసరిగారు వచ్చారు. ఈ సినిమాకు కథే హీరో అన్నారు. ఆయనతో అనుబంధం ఎక్కువ. ఆయన నటించిన సినిమాలకు మాటలు రాశా. ఆయన డైరెక్షన్‌లోనూ రాశాను. దాసరి, విశ్వనాథ్‌ దగ్గర చేశానని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అంతా వాళ్లే రాసుకుంటారు. మా పేర్లు వేస్తారు.

విశ్వనాథ్‌తో ఏ సినిమా చేశారు..?

దివాకర్‌బాబు: ‘సిరిమువ్వల సింహనాదం’ సినిమా అది. ఆయన ప్రతి సినిమా ‘ఎస్‌’తోనే వస్తుంది. అంతా కొత్తవాళ్లే. ఆయన దగ్గరకు వెళితే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కథ చెప్పడంలో ఆయన నంబర్‌వన్‌. ఆయన చెబుతుంటే హాస్యం వస్తే నవ్వుతాం.. ట్రాజెడీ వస్తే ఏడ్చేస్తాం. ఆయనలా ఎవరూ చెప్పలేరు. ‘మావిచిగురు’లో ‘ఏమిటో’ ఊతపదం ఆయన దగ్గరి నుంచి తీసుకున్నదే..!

కె.రాఘవేంద్రరావు ఎలా పరిచయం  అయ్యారు..?

దివాకర్‌బాబు: మా ఇద్దరికి గొడవతోనే మొదలయ్యింది. తప్పు నాది. చేసిన పాపం చెబితే పోతుంది. ‘పెళ్లిసందడి’కి నన్ను రాయమన్నారు. కథ విన్నా. నాకు చిన్న సమస్య వచ్చింది. ఆ సినిమా చేయలేనని చెప్పా. ఆయనకు కోపం వచ్చింది. ‘కథ వినక ముందు చెప్పాలి. కథ విని చేయనంటే ఎలా’ అని ఆగ్రహించారు. ‘చూడాలని ఉంది’ షూటింగ్‌ నాంపల్లిలో జరిగింది. చిరంజీవి, నేనూ స్టేషన్‌ మాస్టర్‌ గదిలో ఉన్నాం. అప్పుడు ఒక లైన్‌ చెప్పి కథ రాయమన్నారు. దాన్ని రాఘవేంద్రరావు చేస్తారన్నారు. ‘సార్‌.. నేను పొరపాటు చేశా. ఆయన నాతో చేయరేమో’నన్నా. ‘ఆయన ప్రతి విషయాన్నీ గుర్తు పెట్టుకోరులే’ అని చెప్పారు. ఆ సినిమానే ‘ఇద్దరు మిత్రులు’. అప్పటి నుంచి మా సంబంధం కొనసాగుతోంది.

దర్శకుడు కోడిరామకృష్ణతో మీ జర్నీ ఎలా సాగింది..?

దివాకర్‌బాబు: కోడిరామకృష్ణకున్న మల్టీపుల్‌ టాలెంట్‌ ఎవరికీ లేదు. ఇది ఇప్పటి దర్శకుల గురించి కాదు..ఎన్ని టేకులు తీసుకున్నా కోపం రాదు. ప్రశాంతంగా ఉంటారు. అన్ని రకాల సినిమాలు చేశారు. రచయితకు నమ్మకం కలిగిస్తారు.

ఎస్వీ కృష్ణారెడ్డి మీ గురించి బాగా చెప్పారు..?

దివాకర్‌బాబు: టెక్నిషియన్లకు గౌరవం ఇస్తారు. మాట్లాడుకున్న పారితోషికం ఎప్పుడు కావాలన్నా అడగాలని చెప్పేవారు. డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకోవచ్చు. ఎవరి జాబ్‌ వాళ్లను చేసుకోవడానికి అవకాశం ఇస్తారు.

వందకుపైగా సినిమాలు చేసిన మీరు ఎందుకు ఆపేశారు..?

దివాకర్‌బాబు: నాకు సినిమాలు రావడం లేదు. ఎందుకు రావడం లేదో తెలియదు. నాటికలు రాస్తున్నా. కథలు రాస్తున్నా. ఈటీవీకి రెండు, మూడు చేస్తున్నాను. యానిమేషన్‌ వైపు వెళ్తున్నాను. రచన ఎక్కడా ఆగడం లేదు.

సినిమాలు చూస్తున్నారా..? మీకు ఇష్టమైన రచయితలెవరూ..?

దివాకర్‌బాబు: ఎప్పటికప్పుడు చూస్తున్నా. చాలా మంది మంచి రచయితలున్నారు. సాయిమాధవ్‌. త్రివిక్రమ్‌, లక్ష్మీ భూపాల్‌.

ఇప్పుడు విలనిజమ్‌ కూడా హీరోగా చూపించడంతో సమాజంపై ప్రభావం ఎలా చూపుతుంది..?

దివాకర్‌బాబు: రామారావుగారు రావణాసురుడిని మంచివాడిగా చూపించారు. ఒక హీరో చెడ్డ పాత్ర వేసినా కూడా ఆ పాత్ర మంచిదే అనిపించేలా రామారావుగారే చేశారు. సినిమా అనేది కాలక్షేపం. నెగెటివ్‌ పాత్రలను చూసి ఎవరూ చెడిపోరు.

సురభిలో పనిచేసేవారికి పింఛన్లు ఇస్తున్నారు. నాటకాలు, నాటక పరిషత్తులోని వారికి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందన్నారు..?

దివాకర్‌బాబు: సురభి కళాకారులు వృత్తికళాకారులు . మిగిలిన వారు సాంఘిక కళాకారులు. క్రీడా కోటాలో ఇచ్చినట్టే..ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి రిజర్వేషన్‌ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాను.

మీరు రాసిన రసరాజ్యం వందలసార్లు ప్రదర్శించారు..? పూర్వవైభవం రావాలంటే ఎలా..?

దివాకర్‌బాబు: చాలా నాటికలు వందలు, వేల సార్లు ప్రదర్శించారు. కొన్ని నాటికలు సినిమాలుగా వచ్చాయి. తమిళనాడులో టికెట్‌ తీసుకొని వెళ్తారు. కానీ మన వాళ్లు టికెట్‌పై రారు. సినిమాల్లో ఎన్నో హంగులుంటాయి. నాటకాల్లో ఉండవు కదా..

మీ పిల్లలు ఏం చేస్తున్నారు..?

దివాకర్‌బాబు: అబ్బాయి శ్రీకర్‌బాబు రెండు సినిమాలు డైరెక్టు చేస్తున్నారు. అమ్మాయి సాహిత్య ఆంగ్లంలో పట్టుంది. నాతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తోంది. 

మిమ్మల్ని మళ్లీ రచయితగా చూడాలనుకుంటున్నాం..?

దివాకర్‌బాబు: నేను రాయగలిగే స్థితిలోనే ఉన్నాను. ఆ వేగం తగ్గలేదు. ఆసక్తి తగ్గలేదు. శక్తికూడా తగ్గలేదు. కొన్ని చర్చలు జరుగుతున్నాయి. తొందరలోనే మీ ముందుకు రావొచ్చు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని